భారత వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర తుపాను ‘అక్వాన్’ గత ఆరు గంటలుగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా పయనిస్తోంది. ఈ తీవ్ర తుపాను ప్రస్తుతం నర్సాపురం (ఆంధ్రప్రదేశ్)కు తూర్పు-ఆగ్నేయంగా 420 కి.మీ, కళింగపట్నం (ఆంధ్రప్రదేశ్)కు దక్షిణ-ఆగ్నేయంగా 400 కి.మీ, గోపాల్‌పూర్ (ఒడిశా)కు దక్షిణంగా 490 కి.మీ, పూరీ (ఒడిశా)కు దక్షిణంగా 550 కి.మీ, చెన్నై (తమిళనాడు)కు తూర్పు-ఈశాన్యంగా 590 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.
ఇది ఉత్తర-వాయవ్య దిశగా పయనిస్తూ, నవంబర్ 20 మధ్యాహ్నానికల్లా నర్సాపురం, పూరీల మధ్య—గోపాల్‌పూర్‌కు తూర్పున—ఉత్తర ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ ఒడిశా తీరాలను దాటే అవకాశం ఉంది. ఈ సమయంలో గాలి వేగం గంటకు 90-100 కి.మీగా ఉండి, గరిష్టంగా గంటకు 110 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. బంగాళాఖాతంలోని ఉప ఉష్ణ మండల అధిక పీడన ప్రభావంతో దిశ మార్చుకుందని ఏయూ వాతావరణ విభాగాధిపతి ఆచార్య సీవీ నాయుడు తెలిపారు.
ప్రస్తుతానికి దక్షిణ ఒడిశా వైపు వెళ్తున్నప్పటికీ కోల్‌కతా, బంగ్లాదేశ్ తీరానికి చేరుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పారు. గతంలో పలు తుపాన్లు ఈ తరహాలో పయనించాయని పేర్కొన్నారు. ప్రస్తుతం అక్వాన్ దక్షిణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా కొనసాగుతోంది.
నేడు, రేపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తీరం వెంబడి గంటకు 60-70 కి.మీ., గరిష్ఠంగా 80 వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుత గమనం ప్రకారం చూస్తే, తుపాను పూర్తిగా దక్షిణ ఒడిశా వైపు పయనించే అవకాశం కనిపిస్తోంది.
అక్వాన్ తుపాను ఉత్తరాంధ్ర జిల్లాలకు సమీపంగా పయనిస్తుండటంతో గురువారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, 20న శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, అల్లూరి సీతారామరాజు, కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.

More Stories
చెక్ బౌన్స్ లో నిర్మాత బండ్ల గణేష్‌కు ఏడాది జైలుశిక్ష
తుఫాన్లతో ఏపీకి రూ.7వేల కోట్ల నష్టం
ఏపీ తీరం వైపు దూసుకొస్తున్న తుఫాన్ ‘అక్వాన్’