మధుమేహం క్యాన్సర్ ముప్పును పెంచడానికి పలు జీవసంబంధ కారణాలు ఉన్నాయని సమీక్ష వివరించింది. టైప్-2 మధుమేహంలో శరీరం ఇన్సులిన్‌కు సరిగా స్పందించకపోవడంతో రక్తంలో ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. ఇవి కణాల పెరుగుదల, విభజనను ప్రేరేపించే మార్గాలను ప్రభావితం చేసి కణితుల అభివృద్ధికి తోడ్పడతాయి. దీర్ఘకాలంగా రక్తంలో చక్కెర అధికంగా ఉండడం వల్ల కణాలపై ఒత్తిడి పెరిగి డీఎన్‌ఏ దెబ్బతినే అవకాశం ఉంటుంది.
దక్షిణ భారతదేశంలో నిర్వహించిన కొన్ని పరిశోధనల్లో నోటి క్యాన్సర్ ఉన్నవారిలో మధుమేహం ఎక్కువగా కనిపించినట్లు సమీక్ష తెలిపింది. ఇన్సులిన్, ఐజీఎఫ్-1 సంబంధిత మార్పులు నోటి క్యాన్సర్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని పరిశోధకులు భావిస్తున్నారు.
మరోవైపు క్యాన్సర్, దానికి ఇచ్చే చికిత్సలు కూడా రక్తంలో చక్కెర నియంత్రణను దెబ్బతీస్తాయి. క్లోమగ్రంథి క్యాన్సర్, శస్త్రచికిత్సలు, రేడియేషన్, స్టెరాయిడ్లు, కొన్ని లక్ష్యిత చికిత్సలు, ఇమ్యూనోథెరపీ, ప్రోస్టేట్ క్యాన్సర్‌కు ఇచ్చే హార్మోన్ చికిత్సలు మధుమేహానికి దారితీస్తాయి. క్యాన్సర్ చికిత్స పొందుతున్నవారిలో, చికిత్స పూర్తయినవారిలో కూడా రక్తంలో చక్కెర స్థాయిలను పర్యవేక్షించడం అవసరం.
మధుమేహం ఉన్నవారు వయస్సు, వ్యక్తిగత ప్రమాద స్థాయికి తగిన క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. కారణం తెలియకుండా బరువు తగ్గడం, రక్తహీనత, కామెర్లు వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన బరువును కొనసాగించడం, సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచుకోవచ్చు.
మెట్‌ఫార్మిన్ క్యాన్సర్‌కు సంబంధించిన కొన్ని జీవసంబంధ మార్గాలపై చూపే ప్రభావాలపై పరిశోధనలు జరుగుతున్నప్పటికీ, క్యాన్సర్ నివారణకు ఈ మందు ఉపయోగపడుతుందని ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు. మధుమేహం, క్యాన్సర్ మధ్య సంబంధం సంక్లిష్టమైనది. కాబట్టి రక్తంలో చక్కెర నియంత్రణతోపాటు తగిన క్యాన్సర్ పరీక్షలు, చికిత్స సమయంలో ఆరోగ్య పర్యవేక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.

More Stories
సీజేఐపై వ్యాఖ్యలు చేసిన న్యాయవాదికి `సుప్రీం’ ధిక్కార నోటీసులు
యుపి ఎస్ఎస్ఆర్ ముసాయిదా ఓటర్ల జాబితాలో19 లక్షల కొత్త ఓటర్లు
ఈ ఏడాది చార్ధామ్ యాత్రకు ముగింపు