బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అంతకంతకే బలపడుతున్నది. తీవ్ర వాయుగుండంగా మారి క్రమంగా ఏపీ తీరంవైపు దూసుకొస్తున్నది. ఇవాళ తీవ్ర తుపానుగా మారనున్న అక్వాన్, శుక్రవారం నెల్లూరు-తుని మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఈనెల 19, 20 తేదీల్లో ఇది రాష్ట్రంపై విరుచుకుపడుతుందని భారత వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.
ఆ 2 రోజులు అప్రమత్తంగా ఉండాలంటున్న ప్రభుత్వ యంత్రాంగం, తుపానును ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టింది. బంగాళాఖాతంలో అక్వాన్ తుపాను గంటకు పది కిలో మీటర్ల వేగంతో కదులుతోంది. ఇది ఈ సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది.
ఇది మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ గురువారం ఉదయానికి అతి తీవ్ర తుపానుగా బలపడవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నానికి నెల్లూరు – తుని మధ్యలో ఎక్కడైనా తీరం దాటొచ్చని అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 120 కిలోమీటర్ల నుంచి 130 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు తీవ్ర ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. తుపాను ప్రభావంతో కోస్తాంధ్రలో బుధవారం నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురవనున్నాయి. గురు, శుక్రవారాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్వాన్ తుపాను రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం, అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
తుపాను పరిస్థితులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా యంత్రాంగానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రభావిత ప్రాంతాలకు ముందుగానే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని సీఎం స్పష్టం చేశారు.
కాగా, ‘అక్వాన్’ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోఈ నెల 21న పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
మరోవైపు ములుగు, నల్గొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో వర్షాల తీవ్రతను బట్టి వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

More Stories
ఔషధాల ధరల నియంత్రణ కోసం జాతీయ విధానం
రాజమండ్రి మేయర్ స్ధానానికి బీజేపీ అభ్యర్ధిగా రేలంగి శ్రీదేవి
బంగాళాఖాతంలో వేగంగా బలపడుతున్న అల్పపీడనం