రాజమండ్రి మేయర్ స్ధానానికి బీజేపీ అభ్యర్ధిగా రేలంగి శ్రీదేవి 

ఏపీలో త్వరలో జరిగే రెండో దశ మున్సిపల్ ఎన్నికలలో తమ పార్టీ పోటీ చేస్తున్న చోట్ల అభ్యర్ధుల జాబితాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ విడుదల చేశారు.   రాష్ట్రంలో ఈ నెల 26న జరిగే మున్సిపల్ ఎన్నికల రెండో దశలో బీజేపీకి ఓ కార్పోరేషన్ తో పాటు రెండు మున్సిపాలిటీలు ఇవ్వాలని కూటమి నిర్ణయించింది. దీని ప్రకారం రాజమండ్రి మున్సిపల్ కార్పోరేషన్ తో పాటు కావలి, బాపట్ల మున్సిపాలిటీలను ఆ పార్టీకి కేటాయించారు. 
 
రాజమండ్రి మేయర్ స్ధానానికి బీజేపీ అభ్యర్ధిగా మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మాజీ కార్పొరేటర్ రేలంగి శ్రీదేవిని ఎంపిక చేశారు. అలాగే కావలిలో మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్ధిగా గుండ్లపల్లి భరత్ కుమార్, బాపట్ల మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్ధిగా ఇస్క సునీల్ కుమార్ ను ఖరారు చేశారు. తొలి దశ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తీసుకున్న ఏకైక మేయర్ సీటు అనంతపురంలో ఆ పార్టీ ఓటమి చవి చూసింది. 
 
ఇప్పుడు ఆ తప్పిదాన్ని రాజమండ్రిలో పునరావృతం కాకుండా రేలంగి శ్రీదేవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాకినాడ మేయర్ స్ధానంలో జనసేన పోటీ నుంచి తప్పుకోవడంతో టీడీపీ అభ్యర్ధినే నిలబెడుతున్నారు. ఈ నేపథ్యంలో రాజమండ్రిలో బీజేపీకి బలమైన అభ్యర్ధి దొరక్కపోతే టీడీపీ పోటీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం మధ్య రేలంగి శ్రీదేవి అభ్యర్దిత్వాన్ని ఖరారు చేశారు. ఆమెను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు కూటమి పార్టీలపై ఉంది.
 
స్థానిక సంస్థల రెండో విడత ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యమని పీవీఎన్ మాధవ్ స్పష్టం చేశారు. గతంలో సాధించిన విజయాలను పునరావృతం చేసేలా ఈ ఎన్నికలకు సమాయత్తమవుతున్నామని తెలిపారు. 2024 అసెంబ్లీ ఎన్నికలతోపాటు ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి ప్రజలు మద్దతు ఇచ్చారని చెబుతూ  ఈ మద్దతు ఈసారి కూడా కొనసాగుతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలనపై ప్రజల్లో సానుకూల స్పందనతోపాటు విశ్వాసం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు.
 
రాష్ట్రాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని పేర్కొంటూ అన్ని ప్రాంతాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నేతల సమన్వయంతో అభ్యర్థుల ఎంపిక, సీట్ల పంపకాలపై చర్చలు జరిపామని వివరించారు. పంచాయతీ ఎన్నికల మొదటి విడతకు కూడా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు. జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో కలిసి క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించామని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి అనే రెండు అంశాలకు సమాన ప్రాధాన్యతను ఇస్తూ డబుల్ ఇంజన్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని మాధవ్ ధీమా వ్యక్తం చేశారు.
 

 

About The Author