కేంద్ర ప్రభుత్వం దాదాపు ప్రతి 15 రోజులకు ఓసారి సవరించే విండ్‌ఫాల్ టాక్స్‌ను మరోసారి డీజిల్, ఏటీఎఫ్ (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్- విమాన ఇంధనం) ఎగుమతులపై పెంచింది. డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎగుమతి సుంకం (స్పెషల్ అడిషనల్ ఎక్స్‌పోర్ట్ డ్యూటీ) అంతకుముందు లీటరుపై రూ. 11.50 గా ఉండగా దీనిని ఇప్పుడు రూ. 14 కు చేర్చింది. అంటే లీటరుపై రూ. 2.50 మేర పెరిగింది.
ఇదే సమయంలో విమాన ఇంధనంపైనా ఎగుమతి సుంకం అంతకుముందు లీటరుపై రూ. 11 గా ఉండగా ఇప్పుడు రూ. 12.50 కి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త రేట్లు నవంబర్ 16 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. అయితే పెట్రోల్ ఎగుమతులపై మాత్రం విండ్‌ఫాల్ టాక్స్ రేట్లలో మార్పులు చేయలేదు. ప్రస్తుతం భారత్ నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యే పెట్రోల్‌పై ఈ ఎగుమతి సుంకాలు లేవు.
దీనికి ముందు అక్టోబర్ 31న కూడా కేంద్రం డీజిల్, ఏటీఎఫ్ ఉత్పత్తుల ఎగుమతులాలపై విండ్‌ఫాల్ టాక్స్ పెంచింది. అప్పుడు డీజిల్‌పై రూ. 8.50 నుంచి 3 రూపాయలు పెంచి రూ. 11.50 కి చేర్చగా, ఇదేసమయంలో ఏటీఎఫ్‌పై రూ. 10.50 నుంచి రూ. 11 కు చేర్చింది. ఇంకా అప్పుడు పెట్రోల్ ఎగుమతులపై లీటరుపై రూ. 2.50 విండ్‌ఫాల్ టాక్స్ ఉండగా దీనిని తొలగించింది.
విండ్‌ఫాల్ టాక్స్ రేట్లను సవరించినంత మాత్రాన దేశీయంగా పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరల్లో ఎలాంటి మార్పులు ఉండవు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు హైదరాబాద్ నగరంలో లీటరుకు రూ. 116.15, రూ. 104.23 చొప్పున ఉన్నాయి. ఇది కేవలం దేశీయంగా ముడి చమురు నుంచి ఉత్పత్తి చేసిన పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ వంటి వాటిని విదేశాలకు ఎగుమతి చేస్తే వాటిపై విధించే పన్ను రేట్లలో మార్పుల్ని సూచిస్తుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పతనం అవుతున్నా కేంద్రం ఈ టాక్స్ రేట్లను పెంచుతుండటం గమనార్హం.
పెట్రోల్ ధరల్ని వెంటనే తగ్గించలేం
ఇలా ఉండగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుతున్న నేపథ్యంలో దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే అవకాశం లేదని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు సహాయ మంత్రి సురేష్ గోపి తెలిపారు. తక్షణమే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే అవకాశాల్లేవని స్పష్టం చేశారు. చమురు సంస్థలకు రూ. 40 వేల కోట్లకుపైగా నష్టాలు వచ్చాయని, వాటికి పరిహారం చెల్లించాల్సి ఉందని తెలిపారు. రేపటికి రేపు ధరలు తగ్గాలని కోరుకోవచ్చని, కానీ అది సాంకేతికంగా సాధ్యం కాదని వెల్లడించారు.

More Stories
టీవీఎస్ గ్రూప్ ఆస్తుల పంపకంపై కుమార్తె పట్టు
చైనాకు చెక్ పెట్టేందుకై ఏఐ దిగ్గజాలకు ట్రంప్ ప్రత్యేక హోదా
లలిత్ మోదీకి బ్రిటన్ పౌరసత్వం