చైనాకు చెక్‌ పెట్టేందుకై ఏఐ దిగ్గజాలకు ట్రంప్ ప్రత్యేక హోదా

ప్రపంచ కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ఆధిపత్యం కోసం అమెరికా, చైనా మధ్య పోటీ రోజురోజుకూ తీవ్రతరమవుతోంది. ఈ పోరులో తమ దేశానికి చెందిన టెక్నాలజీ కంపెనీలను మరింత బలోపేతం చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. ప్రముఖ ఏఐ, టెక్నాలజీ సంస్థలకు ‘నేషనల్‌ ఛాంపియన్స్‌’ (జాతీయ చాంపియన్లు) హోదా కల్పించాలని యోచిస్తోంది. 
 
ఈ జాబితాలో ఎన్విడియా, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, ఓపెన్‌ఏఐ, ఆంత్రోపిక్‌ వంటి దిగ్గజ సంస్థలు ఉండనున్నట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ (డబ్ల్యూఎస్‌జే) వెల్లడించింది. రెండు డజన్లకుపైగా సంస్థలకు ఈ ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని ట్రంప్‌ యంత్రాంగం భావిస్తున్నట్లు పేర్కొంది. అమెరికా కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్లలో విస్తరించేందుకు ప్రభుత్వ సహకారం అందించడం, చైనా సంస్థలతో పోటీపడే సామర్థ్యాన్ని పెంచడం ఈ ప్రతిపాదన వెనుక ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది.

వీటితోపాటు మరో రెండు డజన్లకుపైగా కంపెనీలకు ఈ గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అయితే పూర్తి జాబితా, అర్హతలు, ప్రత్యేక హోదా కింద అందించే ప్రయోజనాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.  ఏఐ రంగంలో కేవలం అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేయడం మాత్రమే సరిపోదని అమెరికా భావిస్తోంది. ఇతర దేశాలు కూడా తమ ఏఐ చిప్‌లు, క్లౌడ్‌ సేవలు, సాఫ్ట్‌వేర్‌, ఏఐ మోడళ్లను వినియోగించేలా చేయడం ద్వారా దీర్ఘకాలిక ఆధిపత్యాన్ని సాధించాలని చూస్తోంది.

ఈ నేపథ్యంలో అమెరికా కంపెనీలు విదేశీ మార్కెట్లలోకి విస్తరించేందుకు ప్రభుత్వ సహకారం అందించాలన్నది తాజా ప్రతిపాదనలో కీలక అంశంగా కనిపిస్తోంది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చైనా కంపెనీలు తక్కువ ధరలకు ఏఐ సేవలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నాయి. ఈ పోటీని ఎదుర్కొనేందుకు అమెరికా తన టెక్నాలజీ కంపెనీలకు అండగా నిలవాలని భావిస్తోంది.

ప్రపంచ ఏఐ రంగంలో అమెరికాకు ప్రస్తుతం బలమైన సాంకేతిక సంస్థలు, అత్యాధునిక చిప్‌ తయారీ పరిజ్ఞానం, భారీ డేటా సెంటర్లు, పరిశోధనా సామర్థ్యం వంటి ప్రయోజనాలు ఉన్నాయి. మరోవైపు చైనా కూడా డీప్‌సీక్‌, హువావే వంటి సంస్థల ద్వారా వేగంగా ముందుకు సాగుతోంది. తక్కువ వ్యయంతో ఏఐ మోడళ్లను అభివృద్ధి చేయడం, ఓపెన్‌సోర్స్‌ సాంకేతికతను విస్తరించడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లలో తన ఉనికిని పెంచుకుంటోంది.

ఈ పరిస్థితుల్లో అమెరికా కంపెనీలకు ప్రభుత్వ మద్దతు అందించడం ద్వారా ఇతర దేశాలు చైనా టెక్నాలజీ వైపు మళ్లకుండా చూడాలన్నది ట్రంప్‌ వ్యూహంగా కనిపిస్తోంది. ముఖ్యంగా చిప్‌ల నుంచి ఏఐ అప్లికేషన్ల వరకు మొత్తం సాంకేతిక వ్యవస్థను ఒకే ప్యాకేజీగా అందించడం ద్వారా అమెరికా టెక్నాలజీపై ఇతర దేశాల ఆధారపడటాన్ని పెంచుకోవాలని చూస్తోంది.

About The Author