టీవీఎస్ గ్రూప్ ఆస్తుల పంపకంపై కుమార్తె పట్టు 

దేశంలోని ప్రముఖ పారిశ్రామిక కుటుంబాల్లో ఒకటైన టీవీఎస్ గ్రూప్‌లో కుటుంబ విభేదాలు న్యాయపోరాటానికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల టాటా గ్రూప్‌లో నెలకొన్న అంతర్గత వివాదాలు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో తాజాగాటీవీఎస్ గ్రూప్ గౌరవ ఛైర్మన్ వేణు శ్రీనివాసన్ కుమార్తె లక్ష్మీవేణు కుటుంబ ఆస్తుల పంపకాలు చేపట్టాలని కోరుతూ తన తండ్రికి అధికారికంగా నోటీసు పంపారు. ఉమ్మడి కుటుంబ ఆస్తుల్లో తనకు రావాల్సిన వాటా సక్రమంగా అందలేదని ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. 

కుటుంబ ఆస్తుల విషయంలో తనకు అన్యాయం జరిగిందని పేర్కొంటూ కుటుంభం పెద్దగా ఆస్తులను న్యాయబద్దంగా, పారదర్శకంగా పంపిణీ చేయాలని  ఆమె తన నోటీసులో కోరారు.  2005లో సవరించిన హిందూ వారసత్వ చట్టం, 1956 ప్రకారం ఉమ్మడి కుటుంబ ఆస్తిలో తనకు సమాన వాటా ఉందని ఆమె వాదించారు. ఆ చట్టంలోని సెక్షన్ 6ను ఉటంకిస్తూ, పూర్వీకుల ఆస్తిలో కుమారులతో సమాన హక్కులు కుమార్తెలకు కూడా ఉంటాయని, దాని పంపకాన్ని వారు స్వతంత్రంగా కోరవచ్చని ఆమె పేర్కొన్నారు. 

 2020 నాటి టీవీఎస్ కుటుంబ ఒప్పందం ప్రకారం వేణు శ్రీనివాసన్ వర్గానికి కేటాయించిన వ్యాపారాలు, ఆస్తులు వాటిలో ఉన్నాయి. వాటిలో టీవీఎస్ హోల్డింగ్స్, టీవీఎస్ మోటార్ కంపెనీ, టీవీఎస్ క్రెడిట్ సర్వీసెస్, సుందరం-క్లేటన్ సంస్థలలోని వాటాలు కూడా ఉన్నాయి. అయితే 2020లో ఆస్తుల విభ‌జ‌న‌కు టీవీఎస్ ఉమ్మ‌డి కుటుంబంతో చేసుకున్న ఒప్పందం ఇప్పుడు త‌న కుటుంబంలో ఆస్తుల విభ‌జ‌న‌కు వ‌ర్తించ‌ద‌ని లక్ష్మి వాదిస్తున్నారు. ఇదే ఇప్ప‌టి వివాదానికి కేంద్ర‌బిందువుగా మారింది.

ల‌క్ష్మి వాద‌న ప్రకారం వేణు శ్రీనివాసన్ కుటుంబంలో ఆస్తుల పరిష్కారం లేదా విభజన ఎప్పుడూ ప్రారంభం కాలేదు, ఎప్పుడూ పూర్తి కాలేదు. కుటుంబ వ్యాపారాలను నిర్వహించడంవల్ల ఒక వ్య‌క్తికి సొంతంగా ప్రత్యేక యాజమాన్య హ‌క్కులు లభించవ‌ని, అదే స‌మ‌యంలో ఇతర కుటుంబసభ్యుల చట్టపరమైన హక్కులు తొలగిపోవ‌ని ల‌క్ష్మి వాదిస్తున్నారు. కుటుంబ ఆస్తులలో ప్ర‌ధాన వాటాను త‌న హ‌క్కుల‌ను ఫ‌ణంగా పెట్టి త‌న సోద‌రుడు సుద‌ర్శ‌న్‌కు క‌ట్ట‌బెట్టే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని ఆమె ఆరోపించారు.

ఈ చ‌ర్య‌ల‌ను ఆమె చ‌ట్ట‌ప‌ర‌మైన‌, నమ్మకద్రోహ సమస్యగా అభివర్ణించారు. ఏకపక్ష నిర్ణయాలు, కార్పొరేట్ ఒప్పందాల ద్వారా కుమార్తెల హక్కులను కాల‌రాయ‌లేర‌ని ల‌క్ష్మి త‌న వాద‌న వినిపిస్తున్నారు. లీగల్ నోటీస్ పంపిన‌ప్ప‌టికీ లక్ష్మి సామరస్యపూర్వక పరిష్కారానికే మొగ్గు చూపుతున్నారు. ప్రతి కుటుంబ సభ్యుని హక్కులను గౌరవించే న్యాయమైన ప్రక్రియ ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించాలని ఆమె కోరారు. 

ఈ పరిణామంపై లక్ష్మి తల్లి మల్లికా శ్రీనివాసన్ బహిరంగంగానే తన మద్దతును ప్రకటించారు. కుటుంబ ఆస్తులలో తన కుమార్తెకు సరైన వాటా దక్కాలని ఆమె కోరారు. సౌహార్దపూర్వక పరిష్కారం కోసం చేసిన ప్రయత్నాలు ఇప్పటివరకు ఎలాంటి అర్థవంతమైన పురోగతిని సాధించలేదని మల్లిక వ్యాఖ్యానించారు. కుటుంబ విషయాల్లో కుమారుడికి, కుమార్తెకు సమాన హక్కులు ఉండాలని ఆమె నొక్కి చెప్పారు. ఒక తల్లిగా త‌న‌కు కుమారుడు, కుమార్తె ఇద్దరూ అన్ని విధాలా సమానమేన‌ని పేర్కొన్నారు.  

About The Author