తెలంగాణ గ్రామాల్లో 95.3 శాతం మందికి ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు

గ్రామీణ ప్రాంతాల్లో వంట గ్యాస్ (ఎల్పీజీ) వినియోగంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. గ్రామీణ తెలంగాణలో ఏకంగా 95.3 శాతం కుటుంబాలు వంటకు ఎల్పీజీనే ప్రధాన ఇంధనంగా ఉపయోగిస్తున్నట్లు ఎస్‌బీఐ రీసెర్చ్ తాజా నివేదిక వెల్లడించింది. ‘ఇండియాస్ కన్సంప్షన్ జర్నీ’ పేరుతో విడుదల చేసిన ఈ నివేదికలో దేశవ్యాప్తంగా గృహాల వినియోగ సరళిని విశ్లేషించారు. 

రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలను కలిపి చూస్తే ఎల్పీజీ వినియోగం 84.4 శాతంగా నమోదైంది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 95.3 శాతం ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 73 శాతంగా ఉంది. సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో వంట గ్యాస్ వినియోగం ఎక్కువగా ఉంటుందనే అంచనాలకు భిన్నంగా తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోనే అధిక వినియోగం నమోదవడం విశేషం. గ్రామీణ ఎల్పీజీ వినియోగంలో తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది.

తెలంగాణలో 95.3 శాతం, ఆంధ్రప్రదేశ్ 86.9 శాతం, పంజాబ్ 84.1 శాతం, కర్ణాటక 81.5 శాతం, తమిళనాడు 81.4 శాతాలతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో గ్రామీణ ఎల్పీజీ వినియోగం చాలా తక్కువగా ఉంది. ఛత్తీస్‌గఢ్‌లో 15.3 శాతం, ఒడిశాలో 16.8 శాతం, జార్ఖండ్‌లో 17.2 శాతం, రాజస్థాన్‌లో 22.9 శాతంగా నమోదైంది. ఈ గణాంకాలు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో స్వచ్ఛమైన వంట ఇంధన వినియోగంలో ఉన్న వ్యత్యాసాలను వెల్లడిస్తున్నాయి. 

తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో ఎల్పీజీ వినియోగం గణనీయంగా పెరగడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాలు కూడా దోహదపడ్డాయని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గత 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లలో ఎల్పీజీ అందుబాటును పెంచేందుకు చేపట్టిన వివిధ కార్యక్రమాల ద్వారా రాష్ట్ర జనాభాలో దాదాపు సగం మందికి ప్రయోజనం చేకూరిందని తెలంగాణ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. 

ప్రస్తుతం తెలంగాణలో సుమారు 1.3 కోట్ల మంది యాక్టివ్ ఎల్పీజీ వినియోగదారులు ఉన్నారని పేర్కొన్నారు. వీరిలో రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా సుమారు 40 లక్షల మందికి, కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా మరో 10 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు అందినట్లు ఆయన వెల్లడించారు. అలాగే సీఎస్ఆర్ కార్యక్రమాల ద్వారా మరో 5 లక్షల మందికి ఎల్పీజీ అందుబాటులోకి వచ్చిందని తెలిపారు.

ఎస్‌బీఐ రీసెర్చ్ ఈ నివేదికను నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) నిర్వహించిన హౌస్‌హోల్డ్ కన్సంప్షన్ ఎక్స్‌పెండిచర్ సర్వే (హెచ్‌సీఈఎస్) 2023-24 ఆధారంగా రూపొందించింది. 2023 ఆగస్ట్ నుంచి 2024 జూలై వరకు ఈ సర్వే నిర్వహించారు. దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన మొత్తం 2,61,953 కుటుంబాల నుంచి వివరాలు సేకరించారు.  

About The Author