రాజీవ్ జపమే గాని పెట్టుబడుల ప్రస్తావన లేని ‘భారత్‌ సమ్మిట్‌’

“ప్రపంచవ్యాప్తంగా ప్రగతిశీల రాజకీయ శక్తుల మధ్య అంతర్జాతీయ సంబంధాలను బలోపేతం చేయడం, తెలంగాణ అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ విధానాలను అంతర్జాతీయ ప్రతినిధులకు పరిచయం చేయడం” లక్ష్యంగా  ఏఐసీసీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆర్భాంగా హైదరాబాద్ లో నిర్వహించిన ‘భారత్‌ సమ్మిట్‌’లో ఎక్కడ పెట్టుబడుల ప్రసక్తి కనిపించని లేదు. కేవలం రాజకీయ ప్రసంగాలకు పరిమితమైంది. 

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ను అంతర్జాతీయంగా ప్రొజెక్ట్‌ చేయాలనే ఉద్దేశంతోనే ఈ సదస్సు  జరిపినట్లు కనిపించింది గాని ఎక్కడా నిర్దుష్టమైన అంశాలపై చర్చలు జరిగిన దాఖలాలు లేవు.  తెలంగాణకు అంతర్జాతీయ పెట్టుబడుల కోసం రోడ్‌మ్యాప్‌ తయారు చేస్తామంటూ రూ.50 కోట్ల ప్రజాధనం ఖర్చు పెడుతూ నిర్వహించిన సదస్సు ద్వారా తెలంగాణకు ఒరిగిందేమిటో ప్రభుత్వం వెల్లడించాలనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

కేవలం రాహుల్‌ గాంధీని వచ్చే లోక్‌సభ ఎన్నికల సమయానికి ప్రధాని అభ్యర్థిగా, ఒక బలమైన నాయకుడిగా నిలబెట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ సదస్సు నిర్వహించారనే విమర్శలున్నాయి. సదస్సు ప్రధాన ఉద్దేశాల్లో రాహుల్‌ ప్రపంచ దృక్పథాన్ని అంతర్జాతీయ సమాజానికి పరిచయం చేయడం కూడా ఉన్నదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌ ముందుగానే వెల్లడించారు. 2029 తర్వాత కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం, పార్టీ నేతలు కీలక రాజ్యాంగ పదవుల్లోకి రావాలనే ఆకాంక్షను సైతం ఆయన వ్యక్తం చేశారు.

సాధారణంగా అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుల్లో వివిధ దేశాల పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరుగడం, ఒప్పందాలు కుదరడం, కొత్త పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం కావడం సహజం. కానీ భారత్‌ సమ్మిట్‌లో ఆ దిశగా ఒక్క ఒప్పందం చేసుకున్న దాఖలాలు లేవు. పైగా, చెప్పుకోదగిన పారిశ్రామిక వేత్తలు ఎవ్వరూ పాల్గొననే లేదు.  

ఐటీ, పారిశ్రామికాభివృద్ధి, ఆర్థిక అసమానతలు, వాతావరణ మార్పులు, ప్రజాస్వామ్యం వంటి అంశాలపై చర్చలు జరిగినా, వాటిని రాష్ట్రానికి పెట్టుబడులుగా మలిచే కార్యాచరణ గురించిన ఎవ్వరూ ప్రస్తావించని లేదు. పైగా, సదస్సు ఆద్యంతం రాహుల్ గాంధీ నాయకత్వంపై పొగడ్తలు కురిపించడంతో పాటు కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని మోదీ, పారిశ్రామికవేత్త ఆదానీలపై విమర్శలు గుప్పించేందుకే రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ నేతలు ప్రాధాన్యమిచ్చారు. రాహుల్ స్పష్టంగా  కేంద్ర ప్రభుత్వంపై ఏ విధంగా పోరాటం చేయాలో చెప్పడం గమనార్హం. 

భారత్‌ సమ్మిట్‌కు 70కి పైగా దేశాల నుంచి వివిధ రంగాల నిపుణులు, విధానకర్తలు, రాజకీయ ప్రముఖులు, మేధావులు కలిపి వెయ్యి మంది దాకా ప్రతినిధులు హాజరవుతారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నిర్వాహకులు చెప్పుకొంటూ వచ్చారు. అయితే, వాస్తవానికి సదస్సు అంతా కాంగ్రెస్ ప్రచారవేదికగా మారిపోయింది. అంతర్జాతీయ నిపుణులు, మేధావుల సంగతేమో గానీ సదస్సు మొత్తం జాతీయ, రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో నిండిపోయింది. 

ఏ గ్రూప్ ఫోటో చూసినా సంగం మందికి పైగా కాంగ్రెస్ వారే!

ఏ ప్యానెల్‌ చర్చలో పరిశీలించినా వారే ఉన్నారు. ఒక సందర్భంలో వేదికపై గ్రూప్‌ ఫొటో దిగే సమయంలో 25 మంది ఉంటే.. అందులో 13 మంది కాంగ్రెస్‌ నేతలు ఉండటం గమనార్హం. వీరిలో స్పీకర్‌, మండలి చైర్మన్‌, సీఎం, ఆరుగురు మంత్రులు ఉన్నారు. 12 మంది మాత్రమే విదేశీ ప్రతినిధులు ఉండగా, వారు కూడా చిన్న చిన్న దేశాలకు సంబంధించిన వారే. పైగా, వారిలో ఎక్కువగా భారతదేశంలో విధినిర్వహణలో ఉన్నవారుగా కనిపించారు. 

సదస్సులో పాల్గొనబోయే వెయ్యి మందిలో 315 మంది వరకు విదేశీ ప్రతినిధులు ఉంటారని నిర్వాహకులు ప్రచారం చేశారు. కానీ 115 మంది మించి రాలేదని తెలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం విదేశీ ప్రతినిధుల వీసాలు రద్దు చేయడమే ఇందుకు కారణమని కాంగ్రెస్‌ ఆరోపిస్తున్నది. కానీ విదేశీ ప్రతినిధులు ఆసక్తి లేకపోవడం వల్లే సదస్సుకు హాజరుకాలేదని తెలుస్తున్నది. 

సదస్సు జరిగిన తీరుతెన్నులు, అంతర్జాతీయ ప్రతినిధులను రప్పించడంలో రాష్ట్ర నాయకత్వం, నిర్వాహకుల వైఫల్యంపై రాహుల్‌ గాంధీ స్వయంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. సదస్సు పూర్తయిన తర్వాత అంతర్జాతీయ స్థాయి సదస్సు అని చెప్పి కనీస సమన్వయం లేకుండా వ్యవహరించడంపై ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది.

విదేశాల నుంచి అంతర్జాతీయ స్థాయి వ్యక్తులను రప్పించడంలో ఎందుకు విఫలమయ్యారని ప్రశ్నించినట్లు తెలిసింది. స్థాయికి తగిన విదేశీ ప్రతినిధులు లేకుండా ఇంత పెద్ద సదస్సు నిర్వహించి ప్రయోజనం ఏమిటని నిలదీసినట్టు సమాచారం. సదస్సులో విదేశీ ప్రతినిదుల కన్నా కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలే ఎక్కువ కనిపించారని, ఈ మాత్రం దానికి అంతర్జాతీయ సదస్సు అని పేరు పెట్టాలా? అంటూ ఆయనే అసంతృప్తి వ్యక్తం చేశారని చెబుతున్నారు. 

చెప్పుకోదగిన సంఖ్యలో విదేశీ ప్రతినిధులు లేకపోతే పరువు పోతుందనే ఉద్దేశంతోనే హడావుడిగా ఒక్కరోజు ముందు మీడియా సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ వీసాల రద్దు అంటూ చెప్పుకొచ్చారు. వంద మందికి వీసా నిరాకరించారని అంటుండగా మిగిలిన వారెందుకు హాజరుకాలేదు తెలియడం లేదు.  ఒకవేళ అదే నిజమైతే ఎవ్వరి వీసాలు  రద్దు చేశారో వారి పేర్లను ఎందుకు బైటపెట్టలేదనే ప్రశ్న తలెత్తుతుంది.  

దళిత, బిసి మంత్రులకు అవమానం 

కాంగ్రస్ ప్రభుత్వంలో దళిత, బహుజన మంత్రుల పట్ల వ్యక్తం అవుతున్న వివక్ష ఈ సదస్సులో సహితం స్పష్టంగా కనిపించింది.   అంతర్జాతీయ వేదికపై దళిత నేత, ఉప ముఖ్మంత్రి భట్టి విక్రమారకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండానే సభను ముగించారు. రాష్ట్ర మంత్రివర్గంలో దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మాత్రమే ప్రసంగించే అవకాశం కల్పించి, సమయం మించిపోతుండటంతో సీఎం రేవంత్‌రెడ్డి కంటే ముందే రాహుల్‌ గాంధీ ప్రసంగించి వెళ్లిపోయారు.

ఆయన తర్వాత ఇద్దరు విదేశీ ప్రతినిధులు ప్రసంగించగా, చివరగా ముఖ్యమంత్రి ప్రసంగించారు. సీఎం కంటే ముందుగా భట్టి విక్రమారకు మాట్లాడే అవకాశం ఇచ్చి ఉంటే అంతర్జాతీయ వేదికపై దళిత ఉప ముఖ్యమంత్రికి సముచిత గౌరవం దకేదని దళిత సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. అంతేగాక భారత్‌ సమ్మిట్‌ ప్యానెల్‌ డిస్కర్షన్‌ కోసం ప్రత్యేకంగా ముద్రించిన ఆహ్వాన పత్రికలోనూ మంత్రులు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌ పేర్ల పక్కన మంత్రి హోదాను విస్మరించి, కేవలం ఎమ్మెల్యేలుగానే పేరొనడం మొదట్లోనే విమర్శలకు దారితీసింది.  

About The Author