డిసెంబర్ మొదటి వారంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు

* నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు అగ్ర ప్రాధాన్యత 
 
పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్లతో ముడిపడి ఉన్న ‘డీలిమిటేషన్ బిల్లు’ను ఆమోదింపజేయడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించనుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ శీతాకాల సమావేశాల్లో రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. 
 
డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతమున్న 543 నుండి 850కి పెంచడం ఈ బిల్లు ఉద్దేశ్యం. ఇది 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు మార్గం సుగమం చేస్తుంది. ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే లోక్‌సభలో మూడింట రెండు వంతుల మెజారిటీ, అంటే 361 ఓట్లు అవసరమవుతాయి.
 
ప్రస్తుతం లోక్‌సభలో 540 మంది సభ్యులు ఉండగా, మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. బిజెపి నేతృత్వంలోని అధికార ఎన్డీయేకు 320 మంది సభ్యుల బలం ఉంది. కాబట్టి, ఈ బిల్లు ఆమోదం పొందాలంటే ప్రతిపక్షాల మద్దతు లేదా ఇతర పక్షాల నుండి క్రాస్ ఓటింగ్ అవసరం కావచ్చు. అయితే, ఈ బిల్లును ఆమోదింపజేయడానికి అవసరమైన సంఖ్యాబలం తమ వద్ద ఉందని ఎన్డీఏ ఇటీవల ధీమా వ్యక్తం చేస్తోంది.
 
ఈ బిల్లు 15 నుండి 18 ఓట్ల మెజారిటీతో ఆమోదం పొందుతుందని ప్రభుత్వానికి చెందిన ఒక ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, వర్షాకాల సమావేశాలను అధికారికంగా ముగించకుండా (ప్రోరోగ్ చేయకుండా) కొనసాగించడం, తదుపరి సమావేశాల నిర్వహణపై ఊహాగానాలకు దారితీసింది. ఆగస్టు 13న నిరవధికంగా వాయిదా పడిన వర్షాకాల సమావేశాలు, ఇప్పటివరకు 94 రోజులుగా ముగింపు లేకుండా కొనసాగుతున్నాయి. 
 
ఇది 2008లో నమోదైన 87 రోజుల రికార్డును అధిగమించింది. ఈ ఏర్పాటు వల్ల, రాజ్యాంగ సవరణ బిల్లును చేపట్టేందుకు తక్కువ వ్యవధిలోనే ప్రత్యేక సమావేశాన్ని లేదా ప్రస్తుత సమావేశాల పొడిగింపును నిర్వహించే అవకాశం ఉంటుంది.  
 
నియోజకవర్గాల పునర్విభజన పరిణామాలపై, ముఖ్యంగా దక్షిణ రాష్ట్రాలలో ఉన్న ఆందోళనలను పరిష్కరించేందుకు, రాష్ట్రాలవ్యాప్తంగా లోక్‌సభ సీట్లను 50 శాతం పెంచే ఒక సూత్రాన్ని ప్రభుత్వం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదిత చట్రం, 1971 జనాభా లెక్కల ఆధారంగా ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల మధ్య సీట్ల వాటాను కూడా కొనసాగించనున్నట్లు అర్థమవుతోంద. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. 
 
ఏప్రిల్ 17న జరిగిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో ఈ ప్రతిపాదిత చట్టానికి అవసరమైన సంఖ్యాబలం లభించడంలో విఫలమైంది. దీంతో శీతాకాల సమావేశాల్లో దీని భవితవ్యం ప్రభుత్వానికి ఒక కీలక రాజకీయ, శాసనపరమైన పరీక్షగా మారింది.  

About The Author