రాహుల్ గాంధీ తరచూ విదేశీ పర్యటనలు చేయడాన్ని లక్ష్యంగా చేసుకుని, అంతర్జాతీయ వేదికలపై దేశాన్ని అప్రతిష్టపాలు చేయడం ద్వారా కాంగ్రెస్ భారతదేశంలో ఎప్పటికీ అధికారాన్ని పొందలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం ప్రతిపక్ష నాయకుడికి సలహా ఇచ్చారు. ప్రపంచమంతా ప్రశంసిస్తున్న నాయకత్వాన్ని కలిగి ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గాంధీ నిరంతరం అప్రతిష్టపాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
అయితే, దీనివల్ల ఆయనకు ఎప్పటికీ ప్రయోజనం చేకూరదని పేర్కొంటూ కాంగ్రెస్ ఎంపీ తన సలహాను ఎప్పటికీ వినరని ఎద్దేవా చేశారు. “మీకు అధికారం కావాలంటే, మీ విదేశీ పర్యటనలు ఆపి, భారతదేశంలోని గ్రామాలను సందర్శించడం ప్రారంభించండి. అప్పుడు బహుశా ఎప్పటికైనా మీ వంతు రావచ్చు,” అని మహారాష్ట్రలోని పూణేలో జరిగిన ఒక కార్యక్రమంలో షా ప్రసంగిస్తూ పేర్కొన్నారు.
“మీరు ఖచ్చితంగా వినరు, అందుకే నేను కాంగ్రెస్ కార్యకర్తలకు చెప్పేది ఏంటంటే, మీరు ఆయనను ఇదే మార్గంలో అనుసరిస్తూ ఉంటే, మీ వంతు 30 ఏళ్ల వరకు రాదు” అని చెప్పారు. హైదరాబాద్లో జరిగిన ‘భారత్ సమ్మిట్ 2026’లో, ఒక ఇటాలియన్ రాజకీయ నాయకుడు ‘ఓటు దొంగతనం’ ఆరోపణలపై ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకోవడంపై కాంగ్రెస్ను ఎద్దేవా చేస్తూ, వరుసగా మూడు లోక్సభ ఎన్నికలలో ఓడిపోయిన నిరాశను కాంగ్రెస్ వెళ్లగక్కుతోందని కేంద్ర మంత్రి ధ్వజమెత్తారు.
అందుకే, భారతదేశం, విదేశాల నుండి వామపక్ష భావజాలాన్ని ప్రచారం చేసే వారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించిందని ఆయన దయ్యబట్టారు. ఈ కార్యక్రమానికి భారత్ సమ్మిట్ అని పేరు పెట్టినప్పటికీ, గాంధీ అంతర్జాతీయ సమావేశాలలో భారత్ వ్యతిరేక అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా దేశాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారని షా విమర్శించారు. ఎన్నికలలో గెలుపు ఓటములు పార్టీ నాయకుల పనితీరుపై ఆధారపడి ఉంటాయని ప్రజలు కాంగ్రెస్కు తెలియజేయాలని ఆయన హితవు చెప్పారు.
“మీకు 10 ఏళ్ల అవకాశం ఇచ్చారు. మీరు రూ. 12 లక్షల కోట్ల విలువైన కుంభకోణాలు, అవినీతికి పాల్పడ్డారు. దేశ ప్రజలు మిమ్మల్ని చేయి పట్టుకుని ఢిల్లీలోని ప్రభుత్వం నుండి బయటకు గెంటేశారు. తద్వారా నరేంద్ర మోదీని ప్రధానమంత్రిని చేశారు” అని గుర్తు చేశారు. “గత 12 ఏళ్లలో నరేంద్ర మోదీ గారిపై కనీసం నాలుగు అణాల విలువైన అవినీతి ఆరోపణ కూడా రాలేదు” అని ఆయన తేల్చి చెప్పారు.
తన ప్రసంగంలో, షా ప్రజలకు ఛత్ పూజ శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు, బిర్సా ముండా 151వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. బిర్సా ముండా వారసత్వాన్ని స్మరించుకోవడానికి, ఆయన త్యాగాన్ని గౌరవించడానికి, ఆయన జయంతిని ‘జనజాతి గౌరవ్ దివస్’గా జరుపుకుంటామని ఆయన పేర్కొన్నారు.

More Stories
ఆప్ మాజీ ఎంపీలకు పంజాబ్ బీజేపీలో కీలక బాధ్యతలు!
5 నెలల్లో బెంగాల్లో ఐదు ఎన్కౌంటర్లు
డిసెంబర్ మొదటి వారంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు