గాల్లోకి వెళ్లి టవర్‌కే తిరిగొచ్చిన స్టార్‌షిప్‌!

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థ చేపట్టిన స్టార్‌షిప్‌ ఫ్లైట్‌-15 ప్రయోగంలో అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి భూమికి చేరుకున్న స్టార్‌షిప్‌ పైభాగాన్ని టెక్సాస్‌లోని స్టార్‌బేస్‌ ప్రయోగ కేంద్రంలో భారీ యాంత్రిక చేతులతో విజయవంతంగా పట్టుకున్నారు. లాంచ్‌ టవర్‌పై ఏర్పాటు చేసిన చాప్‌స్టిక్స్‌గా పిలిచే 2 భారీ యాంత్రిక చేతులు స్టార్‌షిప్‌ను గాల్లోనే ఒడిసిపట్టాయి. 
 
కక్ష్యలోకి వెళ్లి తిరిగి వచ్చిన స్టార్‌షిప్‌ వ్యోమనౌకను ప్రయోగ కేంద్రంలోనే ఇలా పట్టుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో పూర్తిస్థాయిలో రాకెట్లను పునర్వినియోగించాలన్న స్పేస్‌ఎక్స్‌ లక్ష్యం దిశగా మరో కీలక ముందడుగు పడింది. స్పేస్‌ఎక్స్‌ 15వ సమగ్ర స్టార్‌షిప్‌ ప్రయోగ పరీక్షను నవంబర్‌ 14వ తేదీన అమెరికాలోని టెక్సాస్‌ స్టార్‌బేస్‌ నుంచి చేపట్టింది. ఈ ప్రయోగంలో స్టార్‌షిప్‌-42 అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. 
 
సుమారు 275 కిలోమీటర్ల ఎత్తులోని లోఎర్త్‌ ఆర్బిట్‌లోకి చేరుకుంది. అక్కడ 22 గంటలకు పైగా ప్రయాణించింది. భూమి చుట్టూ సుమారు 14 సార్లు స్టార్‌షిప్ పరిభ్రమించింది. ఈ ప్రయాణంలో భాగంగా తదుపరి తరం స్టార్‌లింక్‌ వీ3 ఉపగ్రహాల్లో 26 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇందులోని 3 ఉపగ్రహాలకు ప్రత్యేక కెమెరాలను అమర్చారు. వాటి ద్వారా స్టార్‌షిప్‌ హీట్‌ షీల్డ్‌, ఇతర పరికరాల పనితీరును పరిశీలించారు. 
 
వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత నియంత్రిత ల్యాండింగ్‌ విన్యాసాన్ని చేపట్టి స్టార్‌బేస్‌ ప్రయోగ కేంద్రం వైపు దూసుకొచ్చింది. భారత కాలమానం ప్రకారం నవంబర్‌ 15వ తేదీన తెల్లవారుజామున సుమారు 2.52 గంటలకు లాంచ్‌ టవర్‌ వద్దకు చేరుకుంది. అక్కడి 2 భారీ యాంత్రిక చేతులు స్టార్‌షిప్‌ను విజయవంతంగా పట్టుకుని గాల్లోనే నిలిపివేశాయి. స్టార్‌షిప్‌ ప్రయోగ కేంద్రంలోని భారీ లాంచ్‌ టవర్‌కు అమర్చిన 2 యాంత్రిక చేతులను ‘చాప్‌స్టిక్స్‌’ అని పిలుస్తారు. 
 
ఇవి రాకెట్‌ భాగాలను తిరిగి భూమికి చేరుకున్నప్పుడు పట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందించారు. ఈ వ్యవస్థను స్పేస్‌ఎక్స్‌ ‘మెచజిల్లా’ అని కూడా పిలుస్తుంది. సాధారణంగా రాకెట్‌ ప్రయోగం పూర్తి అయిన తర్వాత దాని భాగాలు సముద్రంలో పడిపోవడం, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో ల్యాండ్‌ కావడం జరుగుతుంది. కానీ స్పేస్‌ఎక్స్‌ మాత్రం రాకెట్ భాగాలను తిరిగి భూమిపైన ల్యాండ్ చేయాలని లక్ష్యంగా పనిచేస్తోంది.
 
రాకెట్‌ భాగాలను ప్రయోగ కేంద్రానికే తిరిగి తీసుకొచ్చి అక్కడే యాంత్రిక చేతులతో పట్టుకుని, అవసరమైన తనిఖీలు పూర్తిచేసిన తర్వాత మళ్లీ తదుపరి ప్రయోగాలకు సిద్ధం చేయాలని స్పేస్ఎక్స్ భావిస్తోంది. దీనివల్ల రాకెట్లను తిరిగి ఉపయోగించడానికి పట్టే సమయంతోపాటు ఖర్చు కూడా తగ్గుతుందని ఆ సంస్థ యోచిస్తోంది.   22 గంటలకు పైగా అంతరిక్షంలో ప్రయాణించిన స్టార్‌షిప్‌-42ను విజయవంతంగా పట్టుకోవడం ఈ ప్రయోగంలో అతిపెద్ద విజయంగా నిలిచింది. 
 
గతంలో సూపర్‌ హెవీ బూస్టర్‌లను తిరిగి పట్టుకుని పునర్వినియోగించిన స్పేస్‌ఎక్స్‌ ఇప్పుడు స్టార్‌షిప్‌ పైభాగాన్ని కూడా అదే విధంగా తిరిగి పొందగలిగింది.
స్టార్‌షిప్‌ రెండు భాగాలనూ తిరిగి సేకరించి పునర్వినియోగించగలిగితే ప్రతి ప్రయోగం తర్వాత కొత్త రాకెట్లను తయారు చేయాల్సిన అవసరం తగ్గుతుంది. 
తనిఖీలు, అవసరమైన మరమ్మతులు పూర్తయ్యాక అదే రాకెట్‌ను తక్కువ సమయంలో మరోసారి ప్రయోగించవచ్చు. చంద్రుడిపైకి వ్యోమగాములను పంపడం, భవిష్యత్తులో అంగారకుడిపై మానవ ప్రయాణాలకు మార్గం సుగమం చేయడం స్పేస్‌ఎక్స్‌ ప్రధాన లక్ష్యాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్టార్‌షిప్‌ క్యాచ్‌ విజయం అంతరిక్ష రంగంలో కీలక పరిణామంగా మారింది.
 

About The Author