2014 తర్వాత భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదంటూ రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసలు దేశంలో ‘ఓట్ చోర్’, ‘సంవిధాన్ చోర్’ కాంగ్రెస్ పార్టీయేనని విమర్శించారు.
‘తెలంగాణ బీజేపీ అన్ని విభాగాల (ఆల్ సెల్స్) సమావేశం’లో పాల్గొంటూ హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ పార్టీ పెట్టుబడుల సదస్సు పేరుతో నిర్వహించిన ‘భారత్ సమ్మిట్’లో గిగ్ వర్కర్లు ఎవరూ కనిపించలేదని, కేవలం కాంగ్రెస్ కార్యకర్తలను మాత్రమే తీసుకువచ్చారని విమర్శించారు. భారతదేశ అంతర్గత రాజకీయ వ్యవహారాల్లో విదేశీయులు జోక్యం చేసుకోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
ఇటలీ నుంచి వచ్చిన ఒక ప్రతినిధి “ఓట్ చోర్, గద్దీ చోర్” అంటూ భారత ప్రజాస్వామ్యంపై వ్యాఖ్యలు చేయడం మన దేశ సార్వభౌమాధికారాన్ని అవమానించడమేనని మండిపడ్డారు. ఈ సదస్సుకు 350 మంది విదేశీ ప్రతినిధులు రావాల్సి ఉండగా, కేవలం 115 మంది మాత్రమే హాజరయ్యారని ఎద్దేవా చేశారు.
భారత వ్యతిరేక వ్యాసాలు రాసిన నార్వే జర్నలిస్టు హెల్లె లింగ్ సహా మిగిలిన వారికి కేంద్ర ప్రభుత్వం చివరి నిమిషంలో వీసాలు రద్దు చేయడం ముమ్మాటికీ సరైన నిర్ణయమని స్పష్టం చేశారు. గతంలో నరేంద్ర మోదీ గారు గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు అమెరికా వీసా నిరాకరించాలని 63 మంది కాంగ్రెస్ ఎంపీలు సంతకాలు చేసి అమెరికా అధ్యక్షుడికి లేఖ రాసిన విషయాన్ని శశిథరూర్, కాంగ్రెస్ నేతలు మర్చిపోయారా? అని నిలదీశారు.
బీజేపీ నిర్మాణంలో వివిధ సెల్స్ (విభాగాలు) అత్యంత కీలకమైనవని పేర్కొంటూ బీజేపీలో జాతీయ స్థాయిలో 22 అధికారిక సెల్స్ ఉన్నాయని, రాష్ట్ర స్థాయిలో అవసరాన్ని బట్టి మరో ఐదారు సెల్స్‌ను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని వివరించారు. ఎక్స్-సర్వీస్‌మెన్, అడ్వకేట్స్, ట్రేడర్స్, ఐటీ, సోషల్ మీడియా, టీచర్స్, ఎడ్యుకేషన్, డాక్టర్స్, కల్చరల్ సెల్ వంటి విభాగాల ద్వారా సమాజంలోని వివిధ వృత్తి నిపుణులను, మేధావులను పార్టీతో అనుసంధానించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
పార్టీలో ఇతర ఆఫీస్ బేరర్స్‌కు ఉన్నంత ప్రాముఖ్యత సెల్స్ కన్వీనర్లకు కూడా ఉంటుందని, తాను కూడా గతంలో లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్‌గా పనిచేశానని గుర్తు చేసుకున్నారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, బి.ఎల్. సంతోష్ సూచనల మేరకు అన్ని సెల్స్ సభ్యులు ఓటర్ల ఎన్రోల్మెంట్ కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఆదేశించారు.

More Stories
సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత!
వరంగల్ కోటలో సర్వాయి పాపన్న శిల్పం
`భారత్ సమ్మిట్’ పెరిగే దేశ వ్యతిరేక శక్తుల భేటీ