రాజస్థాన్‌లో రైల్వే ట్రాక్‌ పేలుడు వెనుక పాకిస్థాన్‌ కుట్ర

రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌ రైల్వే ట్రాక్‌ పేలుడు ఘటన వెనుక పాకిస్థాన్‌ కుట్ర కోణం వెలుగులోకి వచ్చింది. భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దుకు సమీపంలో జరిగిన ఈ పేలుడు కేసులో రాజస్థాన్‌ యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ (ఏటీఎస్‌), శ్రీగంగానగర్‌ పోలీసులు, పంజాబ్‌ పోలీసుల సంయుక్త బృందం ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్టు చేసింది. 

పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ జిల్లాకు చెందిన మహక్‌దీప్‌ కౌర్‌ (21), దేవేందర్‌ సింగ్‌ (23)లను అదుపులోకి తీసుకుంది. వీరి వెనుక పాకిస్థాన్‌కు చెందిన హ్యాండ్లర్ల నెట్‌వర్క్‌ ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.

పోలీసుల దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు స‌మాచారం. మహక్‌దీప్‌ కౌర్‌ సోషల్‌ మీడియా ద్వారా పాకిస్థాన్‌కు చెందిన హ్యాండ్లర్లతో పరిచయం పెంచుకున్నట్లు తెలుస్తోంది. ‘షా’ అనే పేరుతో వ్యవహరిస్తున్న హ్యాండ్లర్‌ ఆదేశాల మేరకు రైల్వే ట్రాక్‌పై పేలుడుకు కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్నారు. ఈ పని కోసం నిందితులకు రూ.30 వేలు అందినట్లు దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి. ఈ నగదు లావాదేవీలకు సంబంధించి ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

పాకిస్థాన్‌ నుంచి డ్రోన్‌ ద్వారా పేలుడు పదార్థాలను సరఫరా చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని ఇండియా టుడే కథనం పేర్కొంది. హ్యాండ్లర్ల సూచనల మేరకు నిందితులు రైల్వే పట్టాల వద్ద పేలుడు పదార్థాలను అమర్చినట్లు అనుమానిస్తున్నారు. అయితే వాటి సరఫరా, వినియోగం, వెనుక ఉన్న వ్యక్తుల పాత్రపై భద్రతా సంస్థలు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి.

నిందితుల నుంచి రెండు తుపాకులు, 46 లైవ్‌ కార్ట్రిడ్జ్‌లు, పేలుడు ఘటనకు సంబంధించి రూ.30 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరి మొబైల్‌ ఫోన్లు, సోషల్‌ మీడియా ఖాతాలు, ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు. పాకిస్థాన్‌లోని హ్యాండ్లర్లతో వీరికి ఉన్న సంబంధాలు, ఇతర వ్యక్తుల ప్రమేయంపై ఆరా తీస్తున్నారు.

నవంబర్‌ 3వ తేదీ రాత్రి సుమారు 9.45 గంటల సమయంలో శ్రీగంగానగర్‌ జిల్లాలోని 50 జీబీ గ్రామం సమీపంలో అనూప్‌గఢ్‌–సూరత్‌గఢ్‌ రైల్వే మార్గంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో రైల్వే పట్టాల కింద ఉన్న రెండు సిమెంట్‌ స్లీపర్లు ధ్వంసమయ్యాయి. సుమారు రెండున్నర అడుగుల లోతులో గొయ్యి ఏర్పడింది. పట్టాలకు కూడా నష్టం వాటిల్లింది.

About The Author