ఎస్ఐఆర్ లో తొలగించిన 1.27 కోట్ల మందిని ఓటర్లుగా చేర్పించండి 

* యుపిలో బిజెపి శ్రేణులకు యోగి ఆదిత్యనాథ్ దిశానిర్ధేశం
 
ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్ఐఆర్) సందర్భంగా రాష్ట్ర ఓటర్ల జాబితాల నుండి 1.27 కోట్ల మంది హిందువులను తొలగించారని, ముస్లిం ఓటర్ల సంఖ్య 1.65% పెరిగిందని ఆరోపిస్తున్న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక సమ్మరీ సవరణ (ఎస్ఎస్ఆర్)లో ఈ పేర్లలో చాలా వరకు తిరిగి ఓటర్ల జాబితాలో చేర్చేలా యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలని బీజేపీ తన నాయకులను కోరినట్లు తెలుస్తున్నది. 
 
యూపీలోని 403 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ 1.27 కోట్ల సంఖ్య, ప్రతి నియోజకవర్గంలో సగటున 31,000 మందికి పైగా ఓటర్లు జాబితా నుండి తొలగించబడినట్లు సూచిస్తుంది. ప్రతి నియోజకవర్గంలో 10,000 నుండి 25,000 మంది ఓటర్లను తిరిగి జాబితాలో చేర్చాలని బీజేపీ తన జిల్లా నాయకులకు లక్ష్యం నిర్దేశించిందని, ఇది ప్రతి పోలింగ్ బూత్‌లో కనీసం 50 మంది ఓటర్లకు సమానమని పార్టీ వర్గాలు తెలిపాయి. 
 
నవంబర్ 8న ప్రసారమైన ‘ఆజ్ తక్ పంచాయత్’ వార్తా కార్యక్రమంలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, పంచాయతీ ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నప్పటికీ, ఎస్ఐఆర్ సందర్భంగా పోలింగ్ సంఘం తయారుచేసిన జాబితాలో గల్లంతైన 1.27 కోట్ల హిందూ ఓటర్ల తొలగింపుపై బీజేపీ ఈసీకి ఒక వినతిపత్రాన్ని సమర్పించిందని తెలిపారు. 
 
“ఈ పేర్లు ఎలా గల్లంతయ్యాయి? దీని వెనుక ఎవరున్నారు? అటువంటి ఓటర్లు 66 లక్షలు ఉన్నారు; వీరిలో 55 లక్షల మంది ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి పొందుతున్న హిందూ ఓటర్లు, కానీ వారి పేర్లు ఓటర్ల జాబితాలో లేవు. 18-19 ఏళ్ల వయస్సు వర్గానికి చెందిన 4.5 లక్షల మంది ఓటర్లు ఓటర్ల జాబితాలో లేరు,” అని యూపీ ముఖ్యమంత్రి తెలిపారు.   
 
ఎస్ఎస్ఆర్ ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించిన మూడు రోజుల తర్వాత, నవంబర్ 20న ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. శుక్రవారం లక్నోలో జరిగిన ముఖ్యనాయకుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు, ఇన్‌చార్జ్‌లకు ఈ లక్ష్యాన్ని తెలియజేశారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పంకజ్ చౌదరి ప్రసంగించారు.
 
వచ్చే నెలలో “మరే ఇతర కార్యక్రమాన్ని చేపట్టకూడదని”, దానికి బదులుగా ఓటర్ల జాబితాను నవీకరించడంపై పూర్తిగా దృష్టి పెట్టాలని పార్టీ నిర్ణయించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. “మనం 40 నుంచి 80 లక్షల మంది ఓటర్లను తిరిగి చేర్చగలిగినా, అది సరిపోతుంది” అని ఒక నాయకుడు పేర్కొన్నారు. ఈ అర్హులైన ఓటర్లను తిరిగి తీసుకురావడానికి వచ్చే నెలను యోగి ఆదిత్యనాథ్ “అంతిమ్ మౌకా (చివరి అవకాశం)”గా అభివర్ణించారని, ఈ అవకాశాన్ని వదులుకోకూడదని నొక్కిచెప్పారని చర్చల గురించి తెలిసిన నాయకులు తెలిపారు.
 
ఈ ప్రత్యేక సంక్షిప్త సవరణ తర్వాత రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితాను నవంబర్ 17న విడుదల చేయనుండగా, అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణ గడువు డిసెంబర్ 16 వరకు కొనసాగుతుంది. పూర్తి ఓటర్ల జాబితాను 2027 జనవరి 4న ప్రచురించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల జాబితాలో ఎవరెవరు లేరో గుర్తించేందుకు, అసెంబ్లీ ఓటర్ల జాబితాలను, పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితాలతో, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాలతో పోల్చి చూడాలని ముఖ్యమంత్రి పార్టీ నాయకులను ఆదేశించారు.
 
2022 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అనేక సీట్లను 1,500 నుండి 3,000 ఓట్ల స్వల్ప తేడాతో గెలుచుకుందని, ఇప్పుడు ఓటర్ల జాబితా 5,000 నుండి 10,000 వరకు తగ్గినా, ఈ నియోజకవర్గాలు పోటీలోకి వచ్చే అవకాశం ఉందని బీజేపీ నాయకత్వానికి ఆందోళనగా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2017లో బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)ల మధ్య ఓట్ల తేడా 1.55 కోట్లు ఉండగా, అది 2022 నాటికి 85 లక్షలకు తగ్గిందని మౌర్య సమావేశంలో పాల్గొన్నవారితో చెప్పినట్లు ఆ వర్గాలు తెలిపాయి. 
 
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సూచించిన సంఖ్య ఆందోళన కలిగించే విషయమని వర్గాలు పేర్కొన్నాయి. “1.27 కోట్ల పేర్ల డేటాను పరిశీలిస్తే, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సగటున 31,513 ఓట్లు తొలగిపోయాయి. ఇది గణనీయమైన సంఖ్య. అందువల్ల, జాబితాలో చేరని అర్హులైన ఓటర్లను సంప్రదించి, సగటున 10,000 నుండి 25,000 పేర్లను తిరిగి ఓటర్ల జాబితాలోకి తీసుకురావాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది,” అని ఒక సీనియర్ బీజేపీ నాయకుడు పేర్కొన్నారు. 
 
రాష్ట్రంలోని మరో నియోజకవర్గానికి మారిన లేదా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన ఓటర్లపై దృష్టి పెట్టాలని బీజేపీ నిర్ణయించిందని ఆ వర్గాలు తెలిపాయి. ఓటర్ల జాబితాలో మరింత మంది మహిళలు, యువతను చేర్చడంపై కూడా దృష్టి సారిస్తామని వారు తెలిపారు. 
 
“ఎస్ఐఆర్ సమయంలో, గణనీయ సంఖ్యలో పట్టణ ఓటర్లు తమ గ్రామీణ చిరునామాలకు మారడానికి ఇష్టపడ్డారు. ఇది పార్టీకి సాంప్రదాయకంగా బలంగా ఉన్న పట్టణ ప్రాంతాలలో సమస్యను సృష్టించింది. మేము అటువంటి ఓటర్లతో మాట్లాడి, తిరిగి పట్టణ స్థానాలకు మారడానికి ఫారాలు నింపడంలో వారికి సహాయం చేస్తాము. అదేవిధంగా, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి అక్కడ ఓటర్లుగా నమోదు చేసుకున్న వారిని, తమ ఓట్లను తిరిగి యూపీకి మార్చుకోవాలని కోరతాము,” అని ఒక బీజేపీ కార్యకర్త తెలిపారు. 
 
“ప్రస్తుత ఓటర్ల జాబితాలో లింగ నిష్పత్తి 834గా ఉంది. ఎస్ఐఆర్ సమయంలో వివిధ కారణాల వల్ల చాలా మంది మహిళలు జాబితాలో చేరలేదని లేదా వారి పేర్లు తొలగించారని పార్టీ అంచనా వేస్తోంది. వారు అర్హులైతే, వారిని నమోదు చేయించుకోవడానికి పార్టీ సహాయం చేస్తుంది,” అని ఆయన చెప్పారు. “తాము ఎన్నడూ గెలవని ముస్లిం ప్రాబల్య స్థానాలపై పార్టీ పెద్దగా దృష్టి పెట్టదు. ఎస్ఐఆర్ సమయంలో పెద్ద సంఖ్యలో హిందూ ఓటర్లు తొలగించిన నియోజకవర్గాలలో, వారి పేర్లను పునరుద్ధరిస్తే మనం గెలవగల స్థానాలలో మా కార్యకర్తలను మోహరిస్తాము,” అని ఆ నాయకుడు తెలిపారు. 
 
“క్షేత్రస్థాయి కార్యకర్తలతో వ్యూహాన్ని చర్చించడానికి బీజేపీ నవంబర్ 19లోగా జిల్లా, అసెంబ్లీ స్థాయి సమావేశాలు నిర్వహిస్తుంది. నవంబర్ 20 నుంచి మా నాయకులు, బూత్ స్థాయి ఏజెంట్లు అన్ని బూత్‌లలో విస్తృతంగా పర్యటిస్తారు,” అని ముఖ్యమంత్రితో జరిగిన సమావేశానికి హాజరైన ఒక నాయకుడు తెలిపారు. 

About The Author