దేశ రక్షణ బాధ్యతలు భుజాన వేసుకోవాల్సిన ఓ వాయుసేన అధికారి తన వ్యక్తిగత వ్యామోహానికి దేశ భద్రతనే పణంగా పెట్టినట్లు ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ పాకిస్థాన్ గూఢచారిణి వలలో చిక్కుకుని మరీ దిగజారుడుగా ఒక్కో నగ్న ఫొటోకు ప్రతిగా ఒక్కో యుద్ధ విమాన ప్రణాళిక పేజీని అందిస్తానని చెప్పినట్లు పోలీసులు చార్జిషీట్‌లో పేర్కొన్నారు.
భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ రహస్య సైనిక పత్రాలు, యుద్ధ ప్రణాళికలు, సైనిక బలగాల మోహరింపు వివరాలను పాకిస్థాన్ నిఘా వర్గాలతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న మహిళకు అందించినట్లు ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. ఈ వ్యవహారానికి సంబంధించి కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్‌లో పలు కీలక అంశాలను ప్రస్తావించారు.
2026 జనవరి 12 నుంచి ఏప్రిల్ 1 వరకు అధికారి, అనుమానిత మహిళ మధ్య వాట్సాప్‌లో విస్తృతంగా సంభాషణలు జరిగినట్లు దర్యాప్తులో గుర్తించారు. వీరి మధ్య మొత్తం 3,008 టెక్స్ట్ సందేశాలు, 65 చిత్రాలు, 65 రియాక్షన్లు, 42 వాయిస్ కాల్స్, నాలుగు వీడియో కాల్స్, ఆరు వెబ్ లింకులు మార్పిడి అయినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సమాచారాన్ని పరిశీలించిన దర్యాప్తు అధికారులు గూఢచర్య కార్యకలాపాలకు సంబంధించిన ఆధారాలను సేకరించినట్లు తెలిపారు.
ఈ కేసులో అత్యంత విస్తుగొలిపే అంశం అనుమానిత మహిళ నుంచి ఓ అభ్యంతరకరమైన ఫొటో అందుకున్న తర్వాత ‘సీక్రెట్ వార్ ప్లాన్’గా గుర్తించిన పత్రంలోని ఓ పేజీని వింగ్ కమాండర్ ఆమెకు పంపినట్లు పోలీసులు ఆరోపించారు. అంతటితో ఆగకుండా మరిన్ని ఫొటోలు పంపితే యుద్ధ ప్రణాళికలోని మరిన్ని పేజీలను అందిస్తానని చెప్పినట్లు చార్జిషీట్‌లో పేర్కొన్నారు.
అధికారి చేరవేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సమాచారం ఒక్క యుద్ధ ప్రణాళికకే పరిమితం కాలేదు. భారత సైనిక సామర్థ్యానికి సంబంధించిన కీలక వివరాలనూ అనుమానిత మహిళకు అందించినట్లు పోలీసులు పేర్కొన్నారు. రహస్య డ్రోన్ విభాగం బలగాల సంఖ్య, సంస్థాగత నిర్మాణం, కార్యకలాపాల సామర్థ్యం, డ్రోన్ పరీక్షలు, గాల్లో ఉండగలిగే సమయం, లక్ష్యాలను ఛేదించే విధానాల గురించి వివరించినట్లు తెలిపారు.
యుద్ధ పరిస్థితుల్లో సైనిక బలగాల మోహరింపునకు గుర్తించిన ప్రాంతాలు, లేహ్‌లో యుద్ధ విమానాల స్థానాలు, రాజస్థాన్‌లోని సూరత్‌గఢ్ మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో నిర్వహించిన సైనిక విన్యాసాలకు సంబంధించిన సమాచారాన్ని సైతం చేరవేసినట్లు ఆరోపించారు.
ఈ వ్యవహారంలో మరో తీవ్రమైన కోణాన్ని పోలీసులు గుర్తించారు. అనుమానిత మహిళ సూచనల మేరకు తన విభాగంలో పనిచేస్తున్న ఐదుగురు సిబ్బంది సమాచార, కమ్యూనికేషన్ పరికరాల్లో ప్రత్యేక మాల్‌వేర్, స్పైవేర్ అప్లికేషన్లను వింగ్ కమాండర్ ఇన్‌స్టాల్ చేసినట్లు చార్జిషీట్‌లో పేర్కొన్నారు. ఈ చర్య ద్వారా ఇతర సిబ్బంది పరికరాల్లోని అధికారిక సమాచారం, కమ్యూనికేషన్లను కూడా అనధికారికంగా పొందే అవకాశం ఉందని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.

More Stories
ఎస్ఐఆర్ లో తొలగించిన 1.27 కోట్ల మందిని ఓటర్లుగా చేర్పించండి
మూడు నెలల్లో పాక్ భారత్ నుంచి రూ. 578 కోట్ల వస్తువుల కొనుగోలు
మరో దేశం వెళ్లేందుకు పాస్‌పోర్ట్ కై పట్టుబడుతున్న హసీనా!