భగవద్గీత ఒక సమగ్ర జీవన శాస్త్రం

భగవద్గీత కేవలం ఒక మతానికి సంబంధించిన గ్రంథం కాదని, అది భారతీయ జీవన విధానాన్ని ఆవిష్కరించే సమగ్ర జీవన శాస్త్రమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి  జి. కిషన్ రెడ్డి తెలిపారు.  మాదాపూర్‌లోని స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్‌లో ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రీనాథన్ రచించిన ‘భగవద్గీత ఇన్ ది లెన్స్ ఆఫ్ న్యూరోసైన్స్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు వర్చువల్‌గా ఈ పుస్తకాలను ఆవిష్కరించారు.

వేల సంవత్సరాల నాటి మన ఆధ్యాత్మిక జ్ఞాన సంపదను ఆధునిక వైద్య పరిజ్ఞానమైన ‘న్యూరోసైన్స్’తో అనుసంధానిస్తూ డాక్టర్ శ్రీనాథన్ ఈ పుస్తకాలను రచించడం గొప్ప సాహసమని కిషన్ రెడ్డి కొనియాడారు. మన మెదడు, ఆలోచనలు, భావోద్వేగాలు, జ్ఞాపకశక్తి పనితీరును విశ్లేషిస్తూ మనిషికి ఎదురయ్యే ఒత్తిడి, కోపం, భయం, ఆందోళనలను ఎలా నియంత్రించుకోవాలి, ఏకాగ్రతను ఎలా పెంచుకోవాలనే ప్రశ్నలకు భగవద్గీత ద్వారా సమాధానాలు చూపడం నేటి యువతకు, విద్యార్థులకు, వైద్య వృత్తిలో ఉన్నవారికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. 

మన చరిత్రలో వేదాలు, భగవద్గీత ఎప్పటికీ ఆధునికమైనవే తప్ప పురాతనమైనవి కావని, మరో 5 వేల ఏళ్లు లేదా లక్ష సంవత్సరాల తర్వాత కూడా అవి భవిష్యత్ తరాలకు మార్గదర్శనం చేస్తాయని స్పష్టం చేశారు. భగవద్గీత అంటే కేవలం హిందువులకు మాత్రమే సంబంధించినదని, కురుక్షేత్ర యుద్ధంలో చెప్పిన విషయాలు నేటి కాలానికి అవసరం లేదని మాట్లాడే కుహనా లౌకికవాదులు సమాజంలో ఉన్నారని కిషన్ రెడ్డి విమర్శించారు.

కురుక్షేత్రం కేవలం ఒక యుద్ధభూమి మాత్రమే కాదని, ప్రతి మనిషి జీవితంలో ఎదురయ్యే ధర్మసంకటాలకు, అంతర్గత సంఘర్షణలకు ప్రతీక అని పేర్కొన్నారు. 18 అధ్యాయాలు, 700 శ్లోకాలతో కూడిన భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి కేవలం ఓదార్పు మాత్రమే కాకుండా, ధర్మబద్ధమైన కర్తవ్యాన్ని బోధించి ఆత్మవిశ్వాసాన్ని నింపారని గుర్తుచేశారు. నేటి విద్యార్థులు, నిరుద్యోగ యువత, వ్యాపారవేత్తలు, కుటుంబ పెద్దలు తమ బాధ్యతల పట్ల కలిగే సందేహాలను నివృత్తి చేసుకుని ముందుకు సాగడానికి గీతా సందేశం ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు.

శ్రీకృష్ణుడు బోధించిన ‘కర్మయోగం’ స్ఫూర్తితో ఫలితాన్ని ఆశించకుండా నిబద్ధతతో పనిచేయడం వల్లే సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన ఎందరో నేడు ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని కిషన్ రెడ్డి తెలిపారు.   డాక్టర్ శ్రీనాథన్ చేసిన ఈ అద్భుత పరిశోధన సామాన్య ప్రజలకు సైతం చేరువయ్యేలా, వెంకయ్య నాయుడు సూచించినట్లుగా ఈ పుస్తకాలను తెలుగు, హిందీ భాషల్లోకి అనువదించి తీసుకురావాలని, అందుకు అందరూ సహకరించాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు.  

About The Author