అభివృద్ధి చెందిన భారతదేశమనే లక్ష్యాన్ని సాధించడంలో వ్యవసాయ ఆధునికీకరణ, పంటల వైవిధ్యం, సాంకేతిక పరిజ్ఞానం ప్రాముఖ్యతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం నొక్కి చెప్పారు. దేశ ప్రగతి రైతుల శ్రేయస్సుతో సన్నిహితంగా ముడిపడి ఉందని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ పారిశ్రామికవేత్తలు, రైతుల సమక్షంలో జరిగిన ‘కిసాన్ తక్ భారత్ వ్యవసాయ సదస్సు 2026’లో ప్రసంగిస్తూ, వ్యవసాయం భారతదేశ సాంస్కృతిక, సామాజిక సంప్రదాయాలతో గాఢంగా ముడిపడి ఉందని ప్రధానమంత్రి తెలిపారు.
వ్యవసాయానికి, భారతీయ సంస్కృతికి మధ్య ఉన్న సన్నిహిత సంబంధానికి ఉదాహరణలుగా ఆయన బిహు, పొంగల్, ఓనం, బైసాఖీ, సర్హుల్, పోలా వంటి పండుగలను ఉదహరించారు. “వ్యవసాయం, సాగు మన సంస్కృతి, మన సంప్రదాయం, మన సామాజిక జీవితానికి పునాది” అని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించకుండా, సాగును స్మార్ట్‌గా మార్చకుండా, రైతులకు మరింత సాధికారత కల్పించకుండా ‘వికసిత్ భారత్’ నిర్మాణం అసాధ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
ఎర్రకోట నుంచి తాను చేసిన ప్రసంగాన్ని గుర్తు చేసిన మోదీ, వికసిత్ భారత్ నిర్మాణానికి గుర్తించిన ఏడు ప్రధాన బలాల్లో వ్యవసాయం కూడా ఒకటని తెలిపారు. గత దశాబ్దంలో భారతదేశ వ్యవసాయ వృద్ధి రేటు నాలుగు శాతానికి పైగా ఉందని, స్వాతంత్ర్యం తర్వాత దేశం ఇంతటి వృద్ధిని సాధించిన మొదటి దశాబ్దం ఇదేనని ఆయన అభివర్ణించారు. అంతేకాకుండా, పేదరికంలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వచ్చిన తగ్గుదల గురించి ఆయన ప్రస్తావించారు.
భారత్ నుంచి జరుగుతున్న వ్యవసాయ ఎగుమతుల గురించి ప్రస్తావిస్తూ, ప్రతి ఏటా రూ. 4 లక్షల కోట్లకు పైగా విలువైన వ్యవసాయ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తోందని మోదీ పేర్కొన్నారు. ఫలితంగా రైతుల ఆదాయం పెరుగుతోందని చెప్పారు. పాలు, పప్పుధాన్యాలు, జనపనార (జూట్), బియ్యం, చిరుధాన్యాల ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని తెలిపారు.
“గత పదేళ్లలో భారతదేశంలో పాల ఉత్పత్తి దాదాపు 70 శాతం పెరిగింది. గుడ్ల ఉత్పత్తి 90 శాతం వృద్ధి చెందింది. అలాగే, మత్స్య ఉత్పత్తి రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. ‘స్వీట్ రివల్యూషన్’ తేనెటీగల పెంపకంలో కొత్త అవకాశాలను కల్పించింది. తేనె ఉత్పత్తి 80,000 టన్నుల నుంచి 1,50,000 టన్నులకు పెరిగింది” అని మోదీ పేర్కొన్నారు.
మారుతున్న ప్రపంచ మార్కెట్లు, ఆహార వినియోగ సరళి, వాతావరణ పరిస్థితులు, సాంకేతికతలకు అనుగుణంగా వ్యవసాయ విధానాలు, సాగు పద్ధతులు మారాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. “కేవలం ధాన్యపు గిడ్డంగులను నింపడం మాత్రమే సరిపోదు” అని ఆయన పేర్కొన్నారు.

More Stories
ఈ నెలాఖరులో నియోజకవర్గాల పునర్విభజన బిల్లు?
ముప్పు ఏ రూపంలో వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి
పైలట్ ప్రాజెక్ట్ గా ఏపీతో సహా మూడు రాష్ట్రాల్లో సాయంత్రం కోర్టులు