ఈ నెలాఖరులో నియోజకవర్గాల పునర్విభజన బిల్లు?

మహిళా రిజర్వేషన్లను అమలు చేయడంతో పాటు నియోజకవర్గాల పునర్విభజన చేసే లక్ష్యంతో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం పొందేందుకు కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తోందని, ఈ బిల్లుకు అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీని 15 నుంచి 18 ఓట్ల తేడాతో సాధిస్తుందని ప్రభుత్వ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. 
ఈ బిల్లు ఆమోదానికి 361 ఓట్లు అవసరం కాగా, మూడు ఖాళీల కారణంగా లోక్‌సభలో మంజూరైన 543 మంది సభ్యులకు గాను ప్రస్తుతం 540 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. డీలిమిటేషన్‌ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లును ఈసారి పార్లమెంట్‌లో ఎలాగైనా ఆమోదింపజేసుకొంటామని కేంద్రహోంమంత్రి అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపాదిత రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరమన్న అమిత్‌ షా కావాల్సిన మెజారిటీ కంటే తమకు 15-18 ఓట్లు ఎక్కువగానే ఉన్నట్టు పేర్కొన్నారు.

ఈ ఏడాది ఆగస్టు 13న పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధికంగా వాయిదాపడినప్పటికీ  సమావేశాలు ముగిసిపోయినట్టు (ప్రొరోగ్‌ అయినట్టు) ఇంకా ప్రకటన విడుదల చేయని విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. నిబంధనల ప్రకారం ప్రొరోగ్‌ కాని సందర్భంలో సభ్యులకు 48 గంటల ముందు (రెండు రోజుల ముందు) నోటీసులు ఇస్తే సరిపోతుందని షా తెలిపారు.

త్వరలో పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపర్చి బిల్లును ప్రవేశపెడుతామని మీడియా మిత్రులతో నిర్వహించిన ఓ అనధికార భేటీలో అమిత్‌ షా పేర్కొన్నారు. ఇవే సమావేశాల్లో విదేశీ విరాళాల నియంత్రణ చట్టానికి (ఎఫ్‌సీఆర్‌ఏ) సంబంధించిన సవరణ బిల్లును కూడా తీసుకొస్తామని వెల్లడించారు. కాగా, ఈ నెల 24 లేదా 25 తేదీల్లో పార్లమెంటును ప్రత్యేకంగా సమావేశపరిచి, మూడు రోజుల వ్యవధిలో డీలిమిటేషన్‌తో పాటు మహిళా బిల్లును కూడా ఆమోదింపజేయడానికి అధికార ఎన్డీయే కూటమి ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు అధికారవర్గాలు పేర్కొన్నాయి.

గత ఆగస్టు 13న పార్లమెంట్‌ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఆ తర్వాత సమావేశాల ముగింపు గురించి ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో పార్లమెంట్‌ ప్రొరోగ్‌ (అధికారికంగా నిలిపివేత లేదా వాయిదా) కాకుండా గురువారం నాటికి 91 రోజులు గడిచిపోయాయి. దీంతో 2008 నాటి సమావేశాల కాలంలో 87 రోజుల పాటు ప్రొరోగ్‌ అవకుండా ఉన్న రికార్డు బద్దలైంది. 

సాధారణంగా సభలను ఉభయ సభాపతులు నిరవధికంగా వాయిదా వేసిన రెండు, మూడు రోజుల్లో సమావేశాలు ముగిసినట్టు (ప్రొరోగ్‌ అయినట్టు) రాష్ట్రపతి ప్రకటన విడుదల చేస్తారు. అయితే, ఇప్పటికీ అది జరుగలేదు. దీంతో పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను పొడిగించే అవకాశం ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. సమావేశాలను ప్రొరోగ్‌ చేయకుండా ప్రభుత్వం నిర్ణయించడం వెనుక డీలిమిటేషన్‌ బిల్లు ఉన్నట్టు అధికారవర్గాలు ఇచ్చిన తాజా సమాచారాన్ని బట్టి అర్థమవుతున్నది. 

లోక్‌సభ సీట్లను 543 నుంచి గరిష్ఠంగా 850కు పెంచేందుకు ఉద్దేశించిన ఈ ప్రతిపాదిత రాజ్యాంగ సవరణ బిల్లును ఈ ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. దక్షిణాది రాష్ట్రాలు వ్యక్తం చేసిన ఆందోళనలను పరిష్కరించేందుకు, ప్రతి రాష్ట్రానికి లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయాలనే లక్ష్యంతో కూడా ఈ ప్రతిపాదనను తీసుకువచ్చారు. 

గతంలో ఉన్న ప్రతిపాదన ఆధారంగా రూపొందించిన ఈ కొత్త ముసాయిదాలో, 1971 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రాల మధ్య ఉన్న ప్రస్తుత సీట్ల నిష్పత్తిని అలాగే కొనసాగించాలని సూచించినట్లు సమాచారం. అయితే, ఇది పరిశీలనలో ఉన్న అనేక ప్రత్యామ్నాయాలలో ఒకటి మాత్రమేనని, దీనిపై ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

About The Author