పైలట్ ప్రాజెక్ట్ గా ఏపీతో సహా మూడు రాష్ట్రాల్లో సాయంత్రం కోర్టులు 

పెండింగ్‌ కేసుల పరిష్కారానికి చేపట్టిన చర్యలలో భాగంగా సాయంత్రం కోర్టుల ఏర్పాటుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో వెల్లడించారు. పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద దేశ రాజధాని ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌లో సాయంత్రం కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. అధికారిక గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు, హైకోర్టులతో పాటు దిగువ న్యాయస్థానాల్లో కలిపి 5.6 కోట్లకుపైగా పెండింగ్ కేసులు ఉన్నాయి

ప్రస్తుతం న్యాయస్థానాలు పగటిపూట నిర్దిష్ట సమయాల్లో పనిచేస్తున్నాయి. ఈ సమయాన్ని మరింత పెంచి అదనంగా కొన్ని గంటల పాటు సాయంత్రం వేళ కోర్టులు పనిచేసేలా ప్రణాళికలు వేస్తున్నట్లు న్యాయ శాఖ మంత్రి తెలిపారు. అయితే, ఈ అదనపు పని గంటల్లో కేవలం పెండింగ్‌ కేసులను మాత్రమే విచారించేలా మార్గదర్శకాలు తీసుకొస్తామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అలాగే, ఈ కోర్టుల నిర్వహణకు రిటైర్డ్‌ జడ్జిల సేవలను వినియోగించుకోవాలని యోచిస్తున్నట్లు వివరించారు.

 
ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హైకోర్టుల సమన్వయం, సహకారంతో వీటిని అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. పైలట్‌ ప్రాజెక్ట్‌ ఫలితాలు ఆధారంగా మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సాయంత్రం కోర్టులను విస్తరిస్తామని వెల్లడించారు. న్యాయస్థానాలపై పెండింగ్‌ కేసుల భారం తగ్గించేందుకు సాయంత్రం కోర్టులతో పాటు ఇతర ప్రత్యామ్నాయలను అన్వేషిస్తున్నట్లు ఆయన తెలిపారు. లోక్‌ అదాలత్‌ వంటి ప్రజా న్యాయస్థానాల్లో కేసుల పరిష్కారంపై మరింత దృష్టిసారించనున్నట్టు మేఘవాల్‌ వెల్లడించారు.

‘‘న్యాయపరమైన జాప్యాలు, సుదీర్ఘంగా వేచి చూడాల్సి వచ్చే విచారణ తేదీల సమస్యను పరిష్కరించి, సామాన్యులకు న్యాయాన్ని సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం చేపడుతున్న విస్తృత ప్రయత్నాల్లో ఇది ఒక భాగం. కోర్టుల పనివేళలను సాయంత్రం పూట పొడిగించడం, రిటైర్డ్ న్యాయమూర్తుల సేవలను ఉపయోగించుకోవడం ద్వారా కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేసి, ప్రస్తుతం ఉన్న న్యాయ వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది” అని చెప్పారు. 

About The Author