రూ.7 కోట్లు ఇవ్వకుంటే కేజ్రీవాల్ను చంపేస్తాం.. బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరిక 

ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు హత్య బెదిరింపులు వచ్చినట్లు వెల్లడైంది. లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు రూ.7 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. లేదంటే కేజ్రీవాల్‌తో పాటు ఆయన కుమార్తె హర్షితను హతమారుస్తామని హెచ్చరించినట్లు సమాచారం. ఈ ఘటనపై పంజాబ్‌లోని మొహాలీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఢిల్లీ తిలక్‌ నగర్‌ ఎమ్మెల్యే జర్నైల్‌ సింగ్‌కు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. విదేశాల్లో సంబంధాలు ఉన్నాయని చెప్పుకున్న ఓ వ్యక్తి ఫోన్‌కాల్‌తో పాటు వాట్సాప్‌ సందేశం ద్వారా బెదిరింపులకు పాల్పడినట్లు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.7 కోట్లు చెల్లించాలని డిమాండ్‌ చేశారని, లేదంటే కేజ్రీవాల్‌, ఆయన కుమార్తెను చంపేస్తామని హెచ్చరించారని జర్నైల్‌ సింగ్‌ పేర్కొన్నారు. కేజ్రీవాల్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు తగిన భద్రత కల్పించాలని మొహాలీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కోరారు.

సైబర్‌ క్రైమ్‌ దర్యాప్తు ఈ ఫిర్యాదుపై మొహాలీ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌), ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు బాధ్యతలను సైబర్‌ క్రైమ్‌ విభాగానికి చెందిన అధికారి సునీల్‌ కుమార్‌కు అప్పగించారు. బెదిరింపులకు ఉపయోగించిన మొబైల్‌ నంబర్‌ కాల్‌ రికార్డులు, ఇంటర్నెట్‌ ప్రోటోకాల్‌ (ఐపీ) లాగ్స్‌, లొకేషన్‌ వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. బెదిరింపుల వెనుక ఎవరున్నారు? నిజంగానే బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు సంబంధాలు ఉన్నాయా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

దేశంలో పలు హత్యలు, కాల్పులు, కిడ్నాప్‌లు, బెదిరింపులు, బలవంతపు వసూళ్ల కేసుల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ పేరు గతంలోనూ వెలుగులోకి వచ్చింది. జైలు నుంచే ఈ నేర సిండికేట్‌ను నిర్వహిస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) గతంలో వెల్లడించింది. గోల్డీ బ్రార్‌తో పాటు విదేశాల్లో ఉన్న ఇతర నేరస్థుల సహకారంతో పలు రాష్ట్రాల్లో స్థానిక షూటర్లను ఉపయోగించుకుంటున్నట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది. 

About The Author