అదృశ్యమైన ఇద్దరు పోలీసుల మృతదేహాలు బుల్లెట్ గాయాలతో లభ్యం 

జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లా, దచ్చన్-మార్వా ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తుండగా అదృశ్యమైన ఇద్దరు స్పెషల్ పోలీస్ ఆఫీసర్ల (ఎస్పీఓలు) మృతదేహాలు బుల్లెట్ గాయాలతో లభ్యమయ్యాయి. ధెర్నా పోస్ట్ సమీపంలో గాలింపు బృందం ఈ మృతదేహాలను కనుగొంది. మరణించిన ఎస్పీఓలను రాశ్పాల్ కుమార్ (40), బాబీ చంద్ (54)గా గుర్తించారు. వీరిలో ఒకరి తలపై, మరొకరి వీపుపై బుల్లెట్ గాయాలు ఉన్నాయి. 
 
వీరు ధెర్నా పోస్ట్ వద్ద విధుల్లో ఉన్న తమ సహచరులకు బదులుగా బాధ్యతలు స్వీకరించడానికి వెళ్తుండగా, అక్కడ మాటు వేసిన ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. వీరు తమ వెంట తీసుకెళ్లిన ఇన్సాస్, .303 రైఫిల్స్ కనిపించడం లేదు. ఉగ్రవాదులు వీరిని చంపిన తర్వాత ఆ ఆయుధాలను కూడా తీసుకెళ్లినట్లు భావిస్తున్నారు. 
 
ప్రాథమిక సమాచారం ప్రకారం, వీరు సైన్యంతో కలిసి గస్తీ విధుల్లో ఉండగా, ధెర్నా పోస్ట్‌కు వెళ్లే క్రమంలో అదృశ్యమయ్యారు. ఆ ప్రాంతంలో పగటిపూట కాల్పుల శబ్దాలు వినిపించినట్లు సమాచారం. మొదట్లో వీరి మొబైల్ ఫోన్లు అందుబాటులోనే ఉన్నప్పటికీ, ఆ తర్వాత స్విచ్ ఆఫ్ కావడంతో ఆందోళన మొదలైంది. వారుతిరిగి రాకపోవడంతో గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు, ఈ ఉదయం ధెర్నా టాప్ ప్రాంతంలో వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ ఘటనకు బాధ్యులైన వారిని పట్టుకునేందుకు పోలీసులు, భద్రతా దళాలు సంయుక్తంగా గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. కిష్త్వార్‌లోని మారుమూల అటవీ ప్రాంతాల్లో మిగిలి ఉన్న ఉగ్రవాదులను ఏరివేసేందుకు భద్రతా దళాలు నిరంతరం ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. వరుసగా చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక చర్యల ఫలితంగా పలువురు క్రియాశీల ఉగ్రవాదులు హతమయ్యారు. దీనితో జిల్లాలో వారి ఉనికి గణనీయంగా బలహీనపడింది. 
 
ఇదిలా ఉండగా, అక్టోబర్ 16న కిష్త్వార్‌లోని వనిపోరా త్రిగామ్‌లో మరో ఎస్పీఓ, 55 ఏళ్ల బషీర్ అహ్మద్ తన నివాసం సమీపంలో శవమై కనిపించారు. పెడిల్ పోలీస్ పోస్ట్‌లో పనిచేస్తున్న ఆయన, విధు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా తన సర్వీస్ రైఫిల్ (ఎస్ఎల్ఆర్), మ్యాగజైన్‌తో సహా అదృశ్యమయ్యారు. అయితే, భూ వివాదానికి సంబంధించి బంధువులే ఆయన్ని హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
 
అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం, 2026లో ఉగ్రవాద సంబంధిత ఘటనల్లో ఐదుగురు మరణించారు. వీరిలో నలుగురు ఉగ్రవాదులు, ఒక ఆర్మీ సైనికుడు ఉన్నారు. 2025లో, ముగ్గురు ఉగ్రవాదులు, ఒక ఆర్మీ సైనికుడితో సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 2024లో, ముగ్గురు భద్రతా సిబ్బంది, ఇద్దరు పౌరులు మరణించారు. 
 
ఈ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి, శాశ్వత శాంతిని నెలకొల్పడానికి ప్రజల నుండి మరింత సహకారం అందించాలని జిల్లా యంత్రాంగం, భద్రతా సంస్థలు పదేపదే విజ్ఞప్తులు చేస్తున్న నేపథ్యంలో ఈ తాజా ఘటన చోటుచేసుకుంది. అక్టోబర్ 4న, కిష్త్వార్ డిప్యూటీ కమిషనర్ పంకజ్ కుమార్ శర్మ, మార్వా, వార్వాన్, దచ్ఛన్ వంటి మారుమూల ప్రాంతాల నివాసితులు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలవాలని, అనుమానిత ఉగ్రవాదుల కదలికల సమాచారాన్ని వెంటనే భద్రతా దళాలతో పంచుకోవాలని కోరారు.

About The Author