2024 లోక్సభ, రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో పోలైన ఓట్ల సంఖ్యకు, లెక్కించిన ఓట్లకు మధ్య వ్యత్యాసాలు ఉన్నాయని సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలను భారత ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఈ ఆరోపణలు “తప్పుదోవ పట్టించేవి” అని పేర్కొంది. సోషల్ మీడియా ఆరోపణలను తిప్పికొట్టేందుకు, ఎన్నికల సంఘం ఎక్స్ లో ఒక పోస్ట్ ద్వారా నియోజకవర్గాల వారీగా వాస్తవ తనిఖీల శ్రేణిని విడుదల చేసింది.
అసలు పరిస్థితిని స్పష్టం చేయడానికి, తన ఇండెక్స్ కార్డులు, గణాంక నివేదికల నుండి అధికారిక సంఖ్యలను ప్రజలకు అందుబాటులో ఉంచింది. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమైన ఈ ఆరోపణలు, ప్రధానంగా మహారాష్ట్ర, హర్యానా, జమ్మూ కాశ్మీర్లోని నియోజకవర్గాలకు సంబంధించినవి. ఎన్నికల సంఘం ప్రకారం, అనేక పోస్టులు నమోదైన మొత్తం ఓటర్ల సంఖ్యను పోలైన ఓట్ల సంఖ్యగా పొరపాటుగా భావించాయి లేదా ఇతర అధికారిక సంఖ్యలను తప్పుగా అన్వయించాయి. దీనివల్ల రికార్డులలో లేని వ్యత్యాసాలు ఉన్నాయనే అభిప్రాయం ఏర్పడింది.
మహారాష్ట్రలో 7.78 లక్షల ఓట్లు లెక్కించలేదా?
ఈసీఐ మహారాష్ట్రలోని ముంబై నార్త్ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి విస్తృతంగా ప్రచారంలో ఉన్న వాదనలలో ఒకటి ఏమిటంటే, అక్కడ 18.11 లక్షల ఓట్లు పోలవగా, కేవలం 10.33 లక్షల ఓట్లను మాత్రమే లెక్కించారు. అంటే, 7.78 లక్షల ఓట్లు లెక్కించకుండా మిగిలిపోయాయని సూచించింది. అయితే, అధికారిక రికార్డుల ప్రకారం, ఆ నియోజకవర్గంలో 18,12,115 మంది నమోదిత ఓటర్లు ఉండగా, వారిలో 10,36,496 మంది ఓటు వేశారు.
ఇందులో ఈవీఎంలలో నమోదైన 10,33,268 ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ల ద్వారా వచ్చిన 3,228 ఓట్లు ఉన్నాయి. ఈసీఐ మార్గదర్శకాల ప్రకారం 765 టెస్ట్ ఓట్లను, కంట్రోల్ యూనిట్ల (సీయూ) నుండి తిరిగి పొందలేని ఓట్లను మినహాయించిన తర్వాత, 10,35,731 ఓట్లను లెక్కించారు. ఓటింగ్ శాతం 57.20గా నమోదైంది. సుమారు 7.75 లక్షల వ్యత్యాసం అనేది ఓటు వేయని నమోదిత ఓటర్లను సూచిస్తుందని, లెక్కించని బ్యాలెట్లను కాదని కమిషన్ స్పష్టం చేసింది.
జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో 6,66,046 ఓట్లు పోలవగా, 6,72,942 ఓట్లు లెక్కించామని, ఇది 6,896 ఓట్ల అదనపు లెక్కింపును సూచిస్తోందని మరో ఆరోపణ ఉంది. భారత ఎన్నికల సంఘం అందించిన అధికారిక గణాంకాల ప్రకారం, మొత్తం 17,48,803 మంది నమోదిత ఓటర్లు ఉండగా, 6,76,408 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 6,72,942 ఓట్లు ఈవీఎంల ద్వారా, 3,466 ఓట్లు పోస్టల్ బ్యాలెట్ల ద్వారా నమోదయ్యాయి.
1,009 టెస్ట్ ఓట్లను, కంట్రోల్ యూనిట్ల నుండి సేకరించలేని ఓట్లను మినహాయించగా, లెక్కింపునకు స్వీకరించిన మొత్తం ఓట్ల సంఖ్య 6,75,399గా ఉంది. ఓటింగ్ శాతం 38.68 శాతంగా నమోదైంది. అదనపు ఓట్లు లెక్కించినట్లు ఎటువంటి సందర్భం లేదు..
మహారాష్ట్రలోని బీడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి, సోషల్ మీడియాలో కొన్ని కథనాలు ప్రచారమయ్యాయి. అందులో 3.84 లక్షల ఓట్లు పోలయ్యాయని, కానీ కేవలం 2.39 లక్షల ఓట్లు మాత్రమే లెక్కించారని, అంటే 1.45 లక్షల ఓట్లు (సుమారు 37.8 శాతం) లెక్కించలేదని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం, ఆ నియోజకవర్గంలో 3,84,885 మంది నమోదిత ఓటర్లు ఉన్నారని, మొత్తం 2,42,983 ఓట్లు పోలయ్యాయని (వీటిలో 2,38,845 ఈవీఎం ఓట్లు, 4,138 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి) స్పష్టం చేసింది.
పోలైన అన్ని ఓట్లు లెక్కించామని, ఓటింగ్ శాతం 63.13గా నమోదైందని తెలిపింది. ఇక్కడ కనిపిస్తున్న సుమారు 1.42 లక్షల వ్యత్యాసం, ఓటు వేయని ఓటర్ల సంఖ్యను సూచిస్తుంది. మహారాష్ట్రలోని దహాను అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి వచ్చిన ఇలాంటి ఆరోపణలను కూడా ఎన్నికల సంఘం తోసిపుచ్చింది.
సోషల్ మీడియాలో 3.01 లక్షల ఓట్లు పోలయ్యాయని, కేవలం 2.21 లక్షల ఓట్లు మాత్రమే లెక్కించారని ఆరోపణలు రాగా, అధికారిక రికార్డుల ప్రకారం అక్కడ 3,01,257 మంది నమోదిత ఓటర్లు ఉన్నారని, 2,21,818 ఓట్లు పోలై, అన్నీ లెక్కించబడ్డాయని తేలింది. అక్కడ ఓటింగ్ శాతం 73.63గా నమోదైంది.
హర్యానాలో 1.60 లక్షల ఓట్లు లెక్కించలేదా?
హర్యానాలోని తోషమ్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి, 2.21 లక్షల ఓట్లు పోలయ్యాయని, కానీ కేవలం 1.60 లక్షల ఓట్లు మాత్రమే లెక్కించామని కొన్ని వాదనలు వినిపించాయి. ఆ నియోజకవర్గంలో 2,23,609 మంది నమోదిత ఓటర్లు ఉండగా, 1,61,872 ఓట్లు పోలయ్యాయని, టెస్ట్ ఓట్ల సర్దుబాటు తర్వాత 1,61,020 ఓట్లు లెక్కించామయని ఈసీఐ తెలిపింది. పోలింగ్ శాతం 72.39గా నమోదైంది.
ఈ వ్యత్యాసానికి కారణం, ఓటు వేయడానికి దూరంగా ఉన్న ఓటర్ల సంఖ్యే. హర్యానాలోని కైతల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కేవలం 215 మంది పౌరులు మాత్రమే ఓటు వేశారని మరో సోషల్ మీడియా ప్రచారం జరగ్గా, ఈసీఐ 1,67,285 ఓట్లను లెక్కించింది. ఆ సంఖ్య 215 అని, అది నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల సంఖ్య అని, ఓటర్ల సంఖ్య కాదని కమిషన్ స్పష్టం చేసింది.
అధికారిక గణాంకాల ప్రకారం, 2,23,449 మంది నమోదిత ఓటర్లు ఉండగా, 1,68,851 ఓట్లు పాలు కాగా లెక్కించారు. పోలింగ్ శాతం 75.57గా నమోదైంది. జమ్మూ కాశ్మీర్లోని చెనాని, కోకెర్నాగ్, పుల్వామా అసెంబ్లీ నియోజకవర్గాలలో అధికంగా ఓట్లు లెక్కించారన్న ఆరోపణలను కూడా ఈసీఐ తోసిపుచ్చింది. అధికారిక గణాంకాల ప్రకారం, చెనానిలో 85,189 ఓట్లు పోలయ్యాయి, లెక్కించారు.
కాగా, కోకెర్నాగ్లో 57,542 ఓట్లు పోలయ్యాయి, లెక్కించచారు. పుల్వామాలో 51,011 ఓట్లు పోలవగా, వాటిలో ప్రామాణిక కోతల తర్వాత 50,529 ఓట్లను లెక్కించారు. ఈ నియోజకవర్గాలన్నింటిలోనూ ఒకే విధమైన ధోరణి ఉందని ఈసీఐ నొక్కి చెప్పింది: “పోలైనవి కానీ లెక్కించని ఓట్లు”గా చూపిస్తున్న సంఖ్యలు, నమోదైన మొత్తం ఓటర్ల సంఖ్య లేదా ఇతర పరిపాలనా సంఖ్యలు (పోలింగ్ కేంద్రాల సంఖ్య వంటివి) మాత్రమే.
నిర్ణీత మార్గదర్శకాల ప్రకారం పోస్టల్ బ్యాలెట్లు, టెస్ట్ ఓట్లు, కంట్రోల్ యూనిట్ల నుండి తిరిగి పొందలేని ఓట్లను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, ఫారం 17సిలో నమోదు చేసి, ఇండెక్స్ కార్డులలో ప్రతిబింబించే వాస్తవంగా పోలైన ఓట్లు, లెక్కించబడిన ఓట్లు దాదాపుగా సరిపోలుతున్నాయి. ప్రతి పోలింగ్ కేంద్రంలో వేసిన ఓట్లకు ఫారం 17సి మాత్రమే ఏకైక చట్టబద్ధమైన రికార్డుగా ఉంటుందని కమిషన్ పునరుద్ఘాటించింది.

More Stories
మహారాష్ట్ర, ఎంపీలలో నిషేధించిన పాక్ విషపూరిత క్రీమ్ విక్రయం
పంజాబ్ ఎన్నికలకు ముందు హత్యలు, మాదకద్రవ్యాలు, గ్యాంగ్ హింస
దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నవీ ముంబయి