వైద్య రంగంలో కుత్రిమ మేధ (ఏఐ) అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుండటం వల్ల రానున్న పదేండ్లలో క్యాన్సర్, అల్జీమర్స్, గుండె జబ్బులు, మానసిక అనారోగ్యం వంటి వ్యాధులు గత చరిత్రగా మారే అవకాశం ఉందని ఆంథ్రోపిక్ సీఈవో డారియో అమోడెయ్ తెలిపారు. ఏఐని సరైన రీతిలో వినియోగించుకోగలిగితే, వేల సంవత్సరాలుగా మానవాళిని వేధిస్తున్న సమస్యలకు పరిష్కారాలను కనుగొనవచ్చునని తెలిపారు. క్లాడ్ ఏఐ చాట్‌బాట్‌ను రూపొందించినది ఆంథ్రోపిక్ సంస్థ అనే విషయం తెలిసిందే.
ఎలాన్ మస్క్, గూగుల్ డీప్‌మైండ్ సీఈఓ డెమిస్ హస్సాబిస్ వంటి ప్రముఖులు కూడా ఈ సాంకేతికతపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మెడిసిన్ ఆవిష్కరణకు సాధారణంగా పట్టే సంవత్సరాల సమయాన్ని ఏఐ సాయంతో కొన్ని వారాలకు తగ్గించే అవకాశం ఉందని హస్సాబిస్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో వ్యాధుల చికిత్సలో ఏఐ కీలక పురోగతికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.
అయితే, ఏఐ సహాయంతో పదేండ్లలోనే అన్ని ప్రధాన వ్యాధులకు పరిష్కారాలు లభిస్తాయన్న అంచనాలపై ఔషధ పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వెర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జెఫ్ లీడెన్ మాట్లాడుతూ, దాదాపు 50 ఏఐ సంస్థల సాయంతో 10 వేల ఔషధ సమ్మేళనాలను పరిశీలించినప్పటికీ, వాటిలో ఏదీ స్వతంత్రంగా పని చేసే ఔషధాన్ని రూపొందించలేకపోయిందని గుర్తు చేశారు.
మరికొందరు ఔషధ రంగ నిపుణులు స్పందిస్తూ, ఒక ఔషధానికి ఉపయోగపడే అణువును ఏఐ గుర్తించినంత మాత్రాన అది మందుగా మారిపోదని చెప్పారు. ప్రయోగశాలల్లో పరీక్షలు, జంతువులపై అధ్యయనాలు, మానవులపై క్లినికల్ ట్రయల్స్, నియంత్రణ సంస్థల అనుమతులు తప్పనిసరి అని తెలిపారు. సాధారణంగా ఒక ఔషధాన్ని అభివృద్ధి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి దాదాపు 12 ఏండ్లు పడుతుందని, ఈ ప్రక్రియలో ఎక్కువ సమయం పరీక్షలు, భద్రతా పరిశీలనలకే అవసరమవుతుందని పేర్కొన్నారు.
ప్రస్తుత ఏఐ నమూనాలకు జీవశాస్త్రంలోని సంక్లిష్ట కారణ-ఫలిత సంబంధాలను పూర్తి స్థాయిలో అర్థం చేసుకునే సామర్థ్యం లేదని సంజ్ఞాన శాస్త్రవేత్త గ్యారీ మార్కస్, కార్డియాలజిస్ట్ ఎరిక్ టోపోల్ వంటి నిపుణులు తెలిపారు. ఏఐ రూపొందించిన ఔషధం పూర్తి స్థాయిలో వైద్య వినియోగంలోకి వచ్చిన దాఖలాలు ఇప్పటి వరకు లేవు. ఏఐ కొత్త మందులను కనిపెట్టడంలో సహాయపడవచ్చు. కానీ ఆ మందులు మనుషులకు ఎంతవరకు పనిచేస్తాయి?
వాటితో ఏమైనా దుష్ప్రభావాలు ఉంటాయా? అనే విషయాలను తెలుసుకోవడానికి అనేక పరీక్షలు చేయాల్సి ఉంటుంది. మరోవైపు, క్యాన్సర్‌లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఒక్కో రకానికి ఒక్కో విధమైన చికిత్స అవసరమవుతుంది. రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి కూడా చికిత్స మారుతుంది. అందుకే ఏఐ వచ్చినంత మాత్రాన అన్ని వ్యాధులకు వెంటనే మందులు దొరుకుతాయని భావించలేమని పేర్కొంటున్నారు.

More Stories
అమెరిగా గూఢచారి వ్యవస్థపై దర్యాప్తుకు డెమొక్రాట్లు సిద్ధం
యుద్ధ ఖైదీల అప్పగింతపై రష్యా- ఉక్రెయిన్ అంగీకారం!
అమెరికా రక్షణ కార్యదర్శిపై అభిశంసనను అడ్డుకున్న రిపబ్లికన్లు