అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో నిఘా సంస్థల పనితీరు, కీలక అధికారుల తొలగింపులు, రాజకీయ జోక్యంపై దర్యాప్తు చేపట్టేందుకు హౌస్ డెమోక్రాట్లు సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ప్రతినిధుల సభలో కీలక కమిటీలపై నియంత్రణ చేపట్టనున్న నేపథ్యంలో అమెరికా నిఘా వ్యవస్థలో చోటుచేసుకున్న పరిణామాలను వెలుగులోకి తీసుకురావాలని నిర్ణయించారు.
ముఖ్యంగా ట్రంప్ ప్రభుత్వానికి అనుకూలంగా లేని నివేదికలు రూపొందించిన అధికారులపై కక్ష సాధింపు చర్యలు జరిగాయా? అనే అంశాన్ని పరిశీలించనున్నారు. అమెరికా ప్రతినిధుల సభలో ఇంటెలిజెన్స్ కమిటీకి వచ్చే ఏడాది జనవరి నుంచి అధ్యక్షత వహించనున్న డెమోక్రటిక్ పార్టీ నేత జిమ్ హైమ్స్ ఈ దర్యాప్తు అంశాలను వెల్లడించారు.
నిఘా విభాగాల్లో పనిచేస్తున్న విశ్లేషకులు రాజకీయంగా వివాదాస్పదమయ్యే అంశాలపై నివేదికలు రూపొందించేందుకు వెనుకాడుతున్నట్లు ఆధారాలున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఒత్తిళ్ల కారణంగా విశ్లేషణ విభాగాల్లో ఉద్యోగుల నైతిక స్థైర్యం కూడా తగ్గుతోందని వ్యాఖ్యానించారు. 2025లో నిర్వహించిన అమెరికా నిఘా విభాగాల ఉద్యోగుల సర్వేను తాను పరిశీలించినట్లు హైమ్స్ తెలిపారు.
అందులో సిబ్బంది రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నట్లు స్పష్టమైందని చెప్పారు. ఈ పరిణామాలకు సంబంధించిన మరిన్ని అంతర్గత నివేదికలను ప్రజలకు వెల్లడించేలా వర్గీకరణ తొలగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా నిఘా వ్యవస్థలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. వందలాది మంది అధికారులు ఉద్యోగాలు కోల్పోయారు. మరికొందరు ఒత్తిళ్ల కారణంగా విధుల నుంచి తప్పుకున్నారు.
అప్పటి జాతీయ నిఘా విభాగం డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ తన విభాగంలోని సిబ్బందిని సుమారు 40 శాతం తగ్గించారు. సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్ కూడా రాబోయే కొన్ని సంవత్సరాల్లో వెయ్యికి పైగా ఉద్యోగాలను తగ్గిస్తామని ప్రకటించారు. ఉద్యోగులకు స్వచ్ఛందంగా రాజీనామా చేసే అవకాశాన్ని కల్పిస్తూ వేతనాలు, ఇతర ప్రయోజనాలతో కూడిన పథకాలను కూడా అందించారు.
వెనిజులాకు సంబంధించిన అంశాలపై వైట్‌హౌస్ అధికారిక విధానానికి భిన్నమైన అంచనాలతో నివేదిక రూపొందించిన విశ్లేషకుల్లో కనీసం ఇద్దరు ఉద్యోగాలు కోల్పోయినట్లు గతంలో వెల్లడించింది. ప్రభుత్వానికి నచ్చని అభిప్రాయాలు వ్యక్తం చేసినందుకే కొందరిని తొలగించారనే ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
తులసీ గబ్బార్డ్ నేతృత్వంలోని కార్యాలయం గతంలో ప్రస్తుత, మాజీ నిఘా అధికారుల భద్రతా అనుమతులను రద్దు చేయడం కూడా తీవ్ర పరిణామాలకు దారితీసిందని రాయిటర్స్ గతంలో కథనాలు ప్రచురించింది. దీనివల్ల అమెరికా నిఘా సంస్థల మధ్య సమాచార మార్పిడి, పరస్పర సహకారం దెబ్బతిన్నట్లు సమాచారం. కేవలం అధికారుల తొలగింపులకే పరిమితం కాకుండా ట్రంప్ ప్రభుత్వానికి రక్షణ, నిఘా రంగాల్లోని కాంట్రాక్టర్లతో ఉన్న సంబంధాలపైనా దర్యాప్తు చేయనున్నట్లు హైమ్స్ వెల్లడించారు.
More Stories
యుద్ధ ఖైదీల అప్పగింతపై రష్యా- ఉక్రెయిన్ అంగీకారం!
అమెరికా రక్షణ కార్యదర్శిపై అభిశంసనను అడ్డుకున్న రిపబ్లికన్లు
రష్యా- ఉక్రెయిన్ సంఘర్షణకు పరిష్కారం కోసం భారత్ సహకారం