యుద్ధ ఖైదీల అప్ప‌గింత‌పై రష్యా- ఉక్రెయిన్ అంగీకారం!

అబుదాబీలో జరిగిన రష్యా-ఉక్రెయిన్‌ శాంతి చర్చల్లో కీలక పురోగతి చోటుచేసుకుంది. భారీ సంఖ్యలో యుద్ధ ఖైదీలను అప్పగించేందుకు రెండు దేశాల మ‌ధ్య‌ పరస్పర అంగీకారం కుదిరింది. అయితే, యుద్ధం ముగింపుపై మాత్రం ఎటువంటి అంగీకారంకు వచ్చిన దాఖలాలు లేవు. మానవతా దృక్పథంతో అత్యంత భారీ స్థాయిలో యుద్ధ ఖైదీలను విడుదల చేసేందుకు అంగీకారం కుదరడం ఈ చర్చల్లో సాధించిన ప్రధాన సానుకూల పరిణామమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు, యూఎస్ ప్రతినిధి జారెడ్ కుష్నర్ తెలిపారు.

విడుదల చేయనున్న ఖైదీల సంఖ్యను గురువారం ఖరారు చేయనున్నట్లు స్పష్టం చేశారు. తదుపరి దౌత్యపరమైన చర్యల్లో భాగంగా కుష్నర్, అమెరికా రాయబారి స్టీవ్ విట్‌కాఫ్‌లు గురువారం మాస్కో వెళ్లి రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ కానున్నారు. ఆ తర్వాత ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశమై, అబుదాబి చర్చల్లో ప్రస్తావనకు వచ్చిన కీలక అంశాలను ఆయనతో పంచుకోనున్నారు.

ఒక్కోవైపు నుంచి సుమారు 1,000 నుంచి 1,500 మంది యుద్ధ ఖైదీలను విడుదలచేసే అంశంపై సమాలోచనలు చేసిన‌ట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. యుద్ధాన్ని విరమింపజేసే లక్ష్యంతో అమెరికా మధ్యవర్తిత్వంలో అబుదాబీ వేదికగా రెండు రోజులపాటు త్రైపాక్షిక చర్చలు జరిగాయి. అమెరికా తరఫున అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్‌, దౌత్యవేత్త స్టీవ్‌ విట్‌కాఫ్‌లు ఇందులో పాల్గొన్నారు.

రష్యా బృందానికి వ్లాదిమిర్‌ మెడిన్‌స్కీ, ఉక్రెయిన్‌ తరఫున రుస్తెం ఉమెరోవ్‌ నేతృత్వం వహించారు. గతంలో విఫలమైన శాంతి ప్రయత్నాలను పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నామని అమెరికా ప్రతినిధి బృందం పేర్కొన్న‌ది.  ప్రస్తుతం జరుగుతున్న ఈ చర్చలు మానవతా సహాయ చర్యలను వేగవంతం చేయడం, ఖైదీల విడుదల, చర్చల్లో యూరోపియన్ దేశాలను కూడా భాగస్వాములను చేయడంపై ప్రధానంగా దృష్టి సారిస్తామని కుష్నర్ తెలిపారు.

ఇదిలా ఉండగా, బుధవారం జరిగిన చర్చలు కేవలం రెండు గంటల లోపే ముగిశాయి. ఈ చర్చల అనంతరం రష్యా ప్రధాన ప్రతినిధి వ్లాదిమిర్ మెడిన్స్కీ మాట్లాడుతూ, మాస్కో తన పాత వైఖరిలోనే కొనసాగుతున్నట్లు సంకేతాలిచ్చారు. “కొన్ని అంశాలపై మాకు పరస్పర అవగాహన కుదిరింది. మరికొన్నింటిపై ఇంకా భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ, ఈ చర్చలు కచ్చితంగా కొనసాగుతాయి” అని మెడిన్స్కీ తెలిపారు. 
 
మరోవైపు, యుద్ధం ముగింపు దిశగా అమెరికా ప్రతినిధులకు కృషికి ఉక్రెయిన్ విదేశీ ఇంటెలిజెన్స్ చీఫ్ రుస్తెం ఉమెరోవ్ ధన్యవాదాలు తెలిపారు. భద్రతా పరమైన అంశాల్లో కీలక పురోగతి సాధించినట్లు పేర్కొన్నారు. అయినప్పటికీ, రష్యా, ఉక్రెయిన్ పక్షాల మధ్య విభేదాలు ఇంకా కొనసాగుతున్నాయని, మాస్కో ఒక దృఢమైన సంప్రదింపుల వైఖరితో చర్చకు వచ్చిందని ఉక్రెయిన్ సంధానకర్త డేవిడ్ అరాఖమియా పేర్కొన్నారు.
 
 

 

About The Author