హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన ‘భారత్ సమ్మిట్’ అసలు భారత్ సమ్మిట్టే కాదని, అది ముమ్మాటికీ దేశద్రోహ శక్తులు కూడబలుక్కుని నడుపుతున్న ‘భారత్ వ్యతిరేక సమ్మిట్’ అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తొలుత ఇది తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న సదస్సు అనుకున్నారని, కానీ గత రెండు రోజులుగా సల్మాన్ ఖుర్షీద్, చికాగో నుంచి శామ్ పిట్రోడా చేసిన ట్వీట్లను గమనిస్తే ఇది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విదేశీ శక్తులతో కలిసి చేస్తున్న కుట్రపూరిత సమావేశమని బట్టబయలైందని ఆయన ఆరోపించారు.
100 దేశాల నుంచి వచ్చే ప్రతినిధుల ముందు రాహుల్ గాంధీ ఆలోచనా విధానాన్ని ఉంచి, ఆయనను ‘కాబోయే ప్రధాని’గా, ‘ప్రధానమంత్రి మెటీరియల్’గా షోకేస్ చేయడానికే ఈ వేదికను వాడుకుంటున్నారని కాంగ్రెస్ నేతలే బహిరంగంగా చెబుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. భారతదేశంలో 140 కోట్ల ప్రజల చేతిలో పదేపదే తిరస్కారానికి గురై విఫలమైన రాహుల్ గాంధీని 100 దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రతినిధులను అడ్డుపెట్టుకొని లాంచ్ చేయాలని చూడటం హాస్యాస్పదమని స్పష్టం చేశారు.
ఈ ‘ప్రోగ్రెసివ్ అలయెన్స్’ వెనుక ఉన్నది అంతర్జాతీయంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూలదోసే ప్రమాదకర శక్తులని ఆయన ఆరోపించారు. ఫాక్స్ న్యూస్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ద్వారా అస్రా నొమాని వెలికితీసిన నిజాలను ప్రస్తావిస్తూ 9 దేశాల్లో విద్యార్థులను పావులుగా వాడుకుంటూ ఇస్లామిక్, కమ్యూనిస్ట్ ప్రొటెస్ట్ ఎకోసిస్టమ్‌ను నడుపుతున్న 101 సంస్థలు ఈ కూటమి వెనుక ఉన్నాయని తెలిపారు.
ఇంతటి ప్రమాదకర వ్యవస్థలో రాహుల్ గాంధీ ప్రెసిడియం ఈక్వలెంట్ సభ్యుడిగా ఉన్నారని పేర్కొంటూ మొన్నటికి మొన్న ఫ్రాన్స్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోయడానికి ‘రెజీమ్ చేంజ్’ పేరిట జరిగిన హింసాత్మక అల్లర్ల వెనుక వీరి పాత్ర ఉందని తేలిందని ధ్వజమెత్తారు. ఆ దేశాల్లో జరిగిన అరాచకాలకు, హింసకు నిధులు ఎవరిచ్చారో బహిర్గతం కావాల్సి ఉందని స్పష్టం చేశారు.
జార్జ్ సోరోస్ లాంటి భారత వ్యతిరేక శక్తుల నిధులతో నడిచే ప్రోగ్రెసివ్ ఇంటర్నేషనల్ డెలిగేషన్‌తో సోనియా గాంధీ 10 జనపథ్‌లో, మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ కార్యాలయంలో సమావేశమయ్యారని గుర్తు చేశారు. ఈ కూటమిలో ప్రజాస్వామ్యం లేని 42 ఇస్లామిక్ దేశాలు, వామపక్ష దేశాలు, నియంతృత్వ రాచరిక వ్యవస్థల ప్రతినిధులే ఉన్నారని, అలాంటి శక్తులకు హైదరాబాద్‌ను అడ్డాగా మార్చి దేశంలో అలజడి సృష్టించాలని చూస్తున్నారని ఆయన హెచ్చరించారు.
విదేశీ శక్తుల అండతో 2029 సార్వత్రిక ఎన్నికల వరకు దేశంలో నిరంతరం అరాచకాలు, హింసను సృష్టించి ప్రభుత్వ మార్పు తేవాలన్నదే కాంగ్రెస్ దుష్ట పన్నాగమని రామచందర్ రావు ఆరోపించారు. గతంలో కూడా ఇదే ప్రోగ్రెసివ్ అలయెన్స్, తెలంగాణ ప్రభుత్వం కలిసి నిర్వహించిన సమ్మిట్ కోసం సుమారు రూ. 29 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టారని, ఇప్పుడు మళ్లీ అదే రీతిలో నిధులు వాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశంలో ఏ ఒక్కరికీ లేని విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కు భారతీయులకు ఉందని, కానీ విదేశీ అజెండాతో హింసను ప్రేరేపిస్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. భారతదేశ సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్న ప్రోగ్రెసివ్ అలయెన్స్‌తో గాంధీ కుటుంబానికి ఉన్న రహస్య సంబంధాలను రాహుల్, ప్రియాంక, సోనియాలు దేశ ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. బహుశా ఇక్కడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఈ అంతర్జాతీయ కుట్రల గురించి తెలియకపోవచ్చని చెప్పారు.

More Stories
ప్రపంచ అశాంతి నడుమ మానవాళికి భారత్ మార్గదర్శనం
బాబ్రీపై సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన వీహెచ్‌పీ
ప్రణబ్ ప్రధాని పదవి కోరుకొంటే సోనియాకు ఆశ్చర్యం ఎందుకు?