దీపావళి కాలుష్యం కాలక్రమేణా తొలగిపోతుంది

దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చడాన్ని సమర్థిస్తూ పండుగ వేడుకల వల్ల కలిగే కాలుష్యం కాలక్రమేణా తొలగిపోతుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  పేర్కొన్నారు. “వ్యవస్థ మొత్తాన్ని కలుషితం చేసిన” అవినీతి విషయంలో ఎందుకు ఇలాంటి ఆందోళన వ్యక్తం చేయరని ఆయన ప్రశ్నించారు. తమ ప్రభుత్వం పండుగ వేడుకలపై ఎటువంటి ఆంక్షలు విధించలేదని, పైగా ప్రజలు ఉత్సాహంగా పండుగను జరుపుకోవాలని ప్రోత్సహించామని ముఖ్యమంత్రి చెప్పారు. 
 
“ధంతేరాస్ రోజున మార్కెట్లలో ఉన్న సందడిని మీరు గమనించే ఉంటారు. దీపావళి వల్ల కాలుష్యం కలుగుతుందని చాలామంది వాదిస్తుంటారు. ఒకవేళ కాలుష్యం కలిగినా, అది కాలక్రమేణా తొలగిపోతుంది” అని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. కొత్తగా నియమితులైన 1,000 మందికి పైగా జూనియర్ అసిస్టెంట్లకు నియామక పత్రాలను అందజేసే కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
 
“ప్రజలు బాణసంచా కాలుస్తూ ఆనందంగా గడపడం చూడటం చాలా బాగుంది. నేను అయోధ్యలో ఉన్నాను. ప్రజలు ఏదైనా పండుగను జరుపుకుంటున్నప్పుడల్లా, కొందరు అకస్మాత్తుగా కాలుష్యం గురించి మాట్లాడటం మొదలుపెడతారు” అని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలోనే ఆయన ‘ముఖ్యమంత్రి కిసాన్ దుర్ఘటన కళ్యాణ్ యోజన’ (రైతు కుటుంబాల కోసం ఉద్దేశించిన భీమా మరియు భద్రతా పథకం) కింద 4,300 మంది లబ్ధిదారులకు రూ. 215 కోట్లను విడుదల చేశారు. 
 
“ధైర్యంగా బాణసంచా కాల్చి పండుగను ఆస్వాదించండి” అని చెబుతూ తమ ప్రభుత్వం అల్లరిమూకలకు తలొగ్గేది కాదని, సమస్యలు సృష్టించే వారికి తగిన సమాధానం ఎలా ఇవ్వాలో తమకు తెలుసని ఆయన స్పష్టం చేశారు. గత ఎనిమిదేళ్లలో హోలీ, దీపావళి, ఈద్, క్రిస్మస్, గురు పర్వ వంటి పండుగలన్నీ ఎంతో ప్రశాంతంగా, సామరస్యంతో, ఉత్సాహంగా జరుపుకున్నామని ఆయన పేర్కొన్నారు. 
 
“ఇది అల్లరిమూకలకు లొంగిపోయే ప్రభుత్వం కాదు. పండుగ వేళల్లో అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నించేవారు కచ్చితంగా జైలు పాలవుతారు” అని ఆయన హెచ్చరించారు. గతంలో ప్రతి జిల్లాలో మాఫియా రాజ్యమేలేదని, అప్పట్లో సమాజ్‌వాదీ పార్టీ నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రి స్వయంగా ఇటువంటి అల్లరి మూకలకు అల్లర్లు చేసేందుకు అవకాశం కల్పించారని, అందుకే అప్పట్లో పండుగలను ప్రశాంతంగా జరుపుకోలేకపోయేవారని ఆయన విమర్శించారు.
 
బీజేపీ ప్రభుత్వం మొత్తం రాష్ట్రాన్ని ఒక కుటుంబంగా భావిస్తుందని, మహిళలకు, ప్రజలందరికీ భద్రత కల్పిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. “ఎవరైనా ఆడపిల్లల భద్రతకు భంగం కలిగిస్తే, తదుపరి కూడలి వద్దే యమరాజు వారికి టికెట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటారు. ప్రతి బాలికకు, వ్యాపారికి, పౌరుడికి భద్రత కల్పించేందుకు మేము కట్టుబడి ఉన్నాము” అని ఆయన స్పష్టం చేశారు. 

 

About The Author