ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన వ్యక్తి డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌

ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన వ్యక్తిని డ్రగ్స్‌ కేసులో రష్యా పోలీసులు అరెస్ట్‌ చేయడం కలకలం రేపుతోంది. జైలులో ఉంటావా లేక ఆర్మీలో చేరి యుద్ధంలో పాల్గొంటావా అని తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు అతడి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. సహాయం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశారు.  ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌కు చెందిన రిటైర్డ్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కుమారుడైన 38 ఏళ్ల టికేశ్వర్ సాహు, సెప్టెంబరు 8న పర్యాటక వీసాపై రష్యా వెళ్లాడు.

సెప్టెంబరు 16 తర్వాత కుటుంబ సభ్యులకు అతడితో సంబంధాలు తెగిపోయాయి. ఆందోళన చెందిన ఆ కుటుంబం రష్యాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించింది. కాగా, మాదకద్రవ్యాలకు సంబంధించిన ఒక తీవ్రమైన కేసులో రష్యా పోలీసులు టికేశ్వర్‌ను అరెస్ట్‌ చేసినట్లు అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. 

ఈ నేపథ్యంలో అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు బెదిరిస్తున్నారని, అలాగే రష్యా సైన్యంలో చేరి యుద్ధంలో పాల్గొనాలంటూ అతడిపై ఒత్తిడి తెస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మరోవైపు రష్యాలోని వోల్గోగ్రాడ్‌లో పోలీసుల అదుపులో ఉన్న టికేశ్వర్‌ భద్రత, చట్టపరమైన హక్కుల కోసం తాము ఆందోళన చెందుతున్నట్లు అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. 

న్యాయ పోరాటం కోసం రష్యాలో ఒక ప్రైవేట్ న్యాయవాదిని కూడా నియమించినట్లు పేర్కొన్నారు. అలాగే రష్యా జైలులో ఉన్న టికేశ్వర్‌ను విడుదల చేయించాలని, సురక్షితంగా భారత్‌కు తీసుకువచ్చేందుకు సహాయం చేయాలని కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వారు ఆశ్రయించారు. టికేశ్వర్ భార్య మనోరమ ఇటీవల ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని  హోంశాఖ పరిశీలిస్తున్నదని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

About The Author