దాడులపై సిరియా, జోర్డాన్‌ సంయుక్త దర్యాప్తు

ఇటీవల దక్షిణ సిరియాలో జోర్డాన్‌ జరిపిన వైమానిక దాడుల్లో ఏడుగురు పౌరులు మరణించిన ఘటనతో ఇరు దేశాల మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలను తగ్గించేందుకు కీలక అడుగు పడింది. సిరియా, జోర్డాన్‌ విదేశాంగ మంత్రులు సోమవారం డమాస్కస్‌లో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. దాడుల ఘటనపై సంయుక్త దర్యాప్తు చేపట్టడంతోపాటు, వివిధ రంగాలకు సంబంధించి 11 సహకార ఒప్పందాలపై సంతకాలు చేశారు.

గత అక్టోబర్‌ 26న దక్షిణ సిరియాలోని దరా ప్రావిన్స్‌లో జోర్డాన్‌ వైమానిక దాడులు నిర్వహించింది. జోర్డాన్‌ వాదన ప్రకారం తమ దేశంలోని కరక్‌ ప్రావిన్స్‌లో చర్చిపై జరిగిన ప్రాణాంతక దాడితో సంబంధమున్న ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) ఉగ్రవాదులే లక్ష్యంగా ఈ దాడులు చేపట్టింది. అయితే, ఈ దాడుల్లో ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు పౌరులు మరణించినట్లు సిరియా అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనపై సిరియా విదేశాంగ మంత్రి అసద్‌ అల్‌ షైబానీ స్పందిస్తూ సమస్య పరిష్కారానికి జోర్డాన్‌ ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తోందని తెలిపారు. దాడులకు సంబంధించిన పరిస్థితులు, వాస్తవాలను వెలికితీసేందుకు ఇరు దేశాలు సంయుక్త భద్రతా, సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బాధితులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయడంతోపాటు, అమాయకుల కుటుంబాలకు పరిహారం అందించే ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు.

జోర్డాన్‌ విదేశాంగ మంత్రి అయ్‌మన్‌ సఫాది కూడా సిరియా ప్రజల ప్రాణాలు తమ దేశ ప్రజల ప్రాణాలతో సమానమని పేర్కొన్నారు.  సిరియా–జోర్డాన్‌ ఉన్నత సమన్వయ మండలి మూడో సమావేశం సందర్భంగా ఇరు దేశాలు 11 సహకార పత్రాలపై సంతకాలు చేశాయి. పెట్టుబడులు, పౌర విమానయానం, ఆహార భద్రత, యార్ముక్‌ నదీ పరీవాహక ప్రాంతంలో కృత్రిమ వర్షం కురిపించే కార్యక్రమాలు వంటి అంశాలు వీటిలో ఉన్నాయి.

అంతేకాకుండా సౌదీ అరేబియా నుంచి జోర్డాన్‌, సిరియా మీదుగా టర్కీ వరకు రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనపైనా చర్చించారు. ఈ రైల్వే అనుసంధానం అమలులోకి వస్తే ప్రాంతీయ రవాణా, వాణిజ్య సంబంధాలకు మరింత ఊతం లభించే అవకాశం ఉంది. సిరియా, జోర్డాన్‌ మధ్య ఆర్థిక సంబంధాలు కూడా విస్తరిస్తున్నాయి.  గత ఏడాదితో పోలిస్తే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు మూడు రెట్లు పెరిగి 330 మిలియన్‌ డాలర్లకు చేరినట్లు అసద్‌ అల్‌ షైబానీ వెల్లడించారు.

ఇరు దేశాల సరిహద్దుల్లో చాలాకాలంగా కొనసాగుతున్న మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు కలిసి పనిచేస్తున్నట్లు జోర్డాన్‌ విదేశాంగ మంత్రి సఫాది తెలిపారు. సరిహద్దు భద్రతను బలోపేతం చేయడం, అక్రమ రవాణా నెట్‌వర్క్‌లను నియంత్రించడం వంటి అంశాల్లో పరస్పర సహకారం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

సిరియాపై ఇజ్రాయెల్‌ జరుపుతున్న దాడులను జోర్డాన్‌ విదేశాంగ మంత్రి ప్రస్తావిస్తు వాటిని నిలిపివేసేందుకు అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ దాడులు కొనసాగితే ప్రాంతంలో మరింత ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సిరియా సార్వభౌమత్వానికి, భద్రతకు మద్దతు తెలిపే వైఖరిని పునరుద్ఘాటించారు.

2024 డిసెంబర్‌లో సిరియా మాజీ అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ పాలన కూలిపోయిన తర్వాత సిరియా, జోర్డాన్‌ మధ్య రాజకీయ, ఆర్థిక, భద్రతా సహకారం క్రమంగా విస్తరిస్తోంది. దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనంత బలంగా ప్రస్తుతం ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయని సిరియా విదేశాంగ మంత్రి పేర్కొన్నారు.

About The Author