ఎస్బిఐకి సంబంధించి రూ. 904.32 కోట్ల బ్యాంక్ మోసానికి పాల్పడినట్లు ఆరోపిస్తూ, సిబిఐ ‘ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్’ (ఎఫ్ఆర్ఎల్), దాని ప్రమోటర్ కిషోర్ బియానీ, ఇతర అజ్ఞాత ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ వ్యక్తులపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో కిషోర్ బియానీ సోదరుడు రాకేశ్ బియానీని కూడా నిందితుడిగా చేర్చారు. వీరిపై నేరపూరిత కుట్ర, మోసం, అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు.
“స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ముంబైలోని ‘స్ట్రెస్డ్ అసెట్స్ మేనేజ్మెంట్ బ్రాంచ్-III’) ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఎఫ్ఆర్ఎల్, దాని ప్రమోటర్లు/మేనేజింగ్ డైరెక్టర్లు/ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు/గ్యారంటర్లైన కిషోర్ బియానీ, రాకేశ్ బియానీలతో పాటు మరికొందరు అజ్ఞాత వ్యక్తులు, ప్రభుత్వ అధికారులపై కేసు నమోదు చేశాం. వీరు నేరపూరిత కుట్రతో మోసానికి పాల్పడటం మరియు అవినీతి నిరోధక చట్టం కింద నేరాలు చేయడం వల్ల, ఫిర్యాదుదారుడైన బ్యాంకుకు రూ. 904.32 కోట్ల నష్టం వాటిల్లింది” అని పేర్కొన్నారు.
ఎస్బిఐ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, నిందితులు ఎస్బిఐ, తొమ్మిది బ్యాంకుల కన్సార్టియం నుండి రుణాలు పొందేందుకు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఆరోపించింది. ఫ్యూచర్ రిటైల్ సంస్థ బిగ్ బజార్, ఫ్యాషన్ ఎట్ బిగ్ బజార్, ఫుడ్‌హాల్ వంటి హైపర్మార్కెట్లు, సూపర్ మార్కెట్ల ద్వారా రిటైల్ వ్యాపారాలను నిర్వహించేది. అలాగే, తన స్టోర్ల ద్వారా ఎఫ్ఎంసిజి (వేగంగా అమ్ముడయ్యే వినియోగ వస్తువులు) , ఫ్యాషన్ వస్తువుల వ్యాపారాన్ని కూడా చేసేదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
బ్యాంకు నుండి పొందిన నిధులను, ఏ ఉద్దేశంతో మంజూరు చేశారో ఆ అవసరాలకు ఉపయోగించకుండా కంపెనీ దుర్వినియోగం చేసిందని సీబీఐ ఆరోపించింది. “ఈ కంపెనీ తన నిధులను అనుబంధ సంస్థలు లేదా ఇతర సంబంధిత సంస్థలకు మళ్లించడం ద్వారా బ్యాంకుకు నష్టం కలిగించింది” అని పేర్కొన్నారు. సిబిఐ ఈ కేసులో నవంబర్ 4న ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ముంబైలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.
“ఈ సోదాల సమయంలో దర్యాప్తునకు కీలకమైన, నేరాన్ని ధృవీకరించే పత్రాలను స్వాధీనం చేసుకున్నాము” అని సిబిఐ ప్రతినిధి తెలిపారు. ఈ ఆరోపిత కుట్రకు సంబంధించి పూర్తి స్థాయిని నిర్ధారించడానికి, ప్రభుత్వోద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులతో సహా ఇందులో భాగస్వాములైన వారందరి పాత్రలను గుర్తించడానికి, అలాగే రుణ నిధులు చివరకు ఏ అవసరాలకు వినియోగించారో తెలుసుకోవడానికి విచారణ కొనసాగుతోందని చెప్పారు.

More Stories
డాలర్‌తో 23 పైసలు పెరిగిన రూపాయి
చైనా గూఢచారిణితోఎన్విడియా సీఈఓకు వివాహేతర సంబంధం
దశాబ్దంలో అతి తక్కువగా 75% తగ్గిన కాంగ్రెస్ విరాళాలు