చైనా గూఢచారిణితోఎన్విడియా సీఈఓకు  వివాహేతర సంబంధం 

 
ప్రపంచంలోనే ప్రముఖ చిప్‌ తయారీ సంస్థ ఎన్విడియా సీఈఓ, వ్యవస్థాపకుడు జెన్సన్‌ హువాంగ్  చైనాకు చెందిన ఒక గూఢచారిగా అనుమానిస్తున్న మహిళతో తనకు వివాహేతర సంబంధం ఉందని తన ఉద్యోగులకు పంపిన ఒక ఈమెయిల్‌లో అంగీకరించారు. హువాంగ్ ‘విదేశీ గూఢచర్య ప్రయత్నానికి లక్ష్యం’ అన్న నివేదికలపై ఎన్విడియా దర్యాప్తు ప్రారంభించిన తరుణంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.  
 
సింగపూర్‌కు చెందిన మెగాస్పీడ్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ఆలిస్‌ హువాంగ్‌తో జెన్సన్‌ హువాంగ్‌కు ఉన్న సంబంధాలపై అమెరికా అధికారులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. అక్టోబర్ 29న, ‘ది న్యూయార్క్ టైమ్స్’ పత్రిక, హువాంగ్ ఒక చైనా గూఢచర్య కుట్రకు లక్ష్యంగా ఉన్నారని నివేదించింది.  ఈ కుట్రను ఆలిస్ హువాంగ్ అలియాస్ హువాంగ్ లీ అనే వ్యాపారవేత్త సమన్వయం చేశారని, ఆమె అతనితో సన్నిహిత సంబంధం ఏర్పరచుకుని, అధునాతన ఎన్విడియా ఏఐ చిప్‌లను, గూఢచర్య సమాచారాన్ని బీజింగ్‌కు చేరవేస్తున్నారని ఆ పత్రిక పేర్కొంది.

63 ఏళ్ల జెన్సన్‌ హువాంగ్‌ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఉద్యోగులకు రాసిన లేఖలో కీలక విషయాలు వెల్లడించారు. తాను భార్యకు నమ్మకద్రోహం చేశానని, తన చర్యలతో భార్యాపిల్లలను బాధపెట్టానని అంగీకరించారు. జరిగినదానికి పూర్తి బాధ్యత తనదేనని, విమర్శలను స్వీకరిస్తానని పేర్కొన్నారు. ఎన్విడియా చేపట్టిన విచారణకు కూడా తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. కంపెనీ ప్రయోజనాలను, అమెరికా జాతీయ భద్రతను కాపాడేందుకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.

ఈ వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందిస్తూ  ఎన్విడియా విచారణ ప్రకటించిన తర్వాత తాను జెన్సన్‌ హువాంగ్‌తో మాట్లాడలేదని తెలిపారు.  అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాత్రం దీనిపై స్పందించేందుకు నిరాకరించారు. అమెరికా ప్రతినిధుల సభకు చెందిన మూడు కీలక కమిటీల- విదేశీ వ్యవహారాలు, చైనా కమ్యూనిస్టు పార్టీ, నిఘా వ్యవహారాల కమిటీల అధ్యక్షులు జెన్సన్‌ హువాంగ్‌కు లేఖ రాశారు. మెగాస్పీడ్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ఆలిస్‌ హువాంగ్‌తో ఆయనకున్న పరిచయాలు, విదేశీ నిఘా సంస్థల నుంచి రక్షణకు ఎన్విడియా అనుసరిస్తున్న భద్రతా విధానాలపై తమ కమిటీల ముందు రహస్య సమావేశంలో వివరించాలని కోరారు.

చైనా నిఘా సంస్థలకు కీలకమైన అమెరికా సాంకేతిక పరిజ్ఞానం, సమాచారాన్ని చేరవేసే అవకాశం ఉందన్న తాజా కథనాలు జాతీయ భద్రతకు సంబంధించిన తీవ్రమైన ఆందోళనలను రేకెత్తిస్తున్నాయని కమిటీ అధ్యక్షులు లేఖలో పేర్కొన్నారు. అత్యాధునిక అమెరికా సాంకేతిక పరిజ్ఞానంలో చైనా జోక్యం, చొరబాట్ల అంశం తమ కమిటీల విచారణలో కీలకమైనదని తెలిపారు.

About The Author