గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలకు పాల్పడటంతో పాటు, ఒక ప్రైవేటు సంస్థకు రూ.1.14 కోట్లు ఎఫ్ఐఆర్లో ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో డిజిటల్ మూల్యాంకనాన్ని పక్కనపెట్టి మాన్యువల్ మూల్యాంకనం చేపట్టారు.
ఏపీపీఎస్సీకి రెగ్యులర్ చైర్మన్ లేని సమయంలో అప్పటి కార్యదర్శి మాన్యువల్ మూల్యాంకనం బాధ్యతను మెస్సర్స్ క్యామ్సింగ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అప్పగించారు.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష జవాబు పత్రాలను గుంటూరు జిల్లా చినకాకాని గ్రామంలోని హాయ్‌ల్యాండ్ రిసార్టుకు తరలించి 2021 డిసెంబర్ నుంచి 2022 ఫిబ్రవరి వరకు సుమారు 84 రోజులపాటు జవాబు పత్రాలను అక్కడే ఉంచినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అయితే, అక్కడ జవాబు పత్రాలకు వాస్తవంగా మాన్యువల్ మూల్యాంకనం జరగలేదని ఆరోపణలు ఉన్నాయి.
గతంలో మెస్సర్స్ ట్రూ గ్రేడర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన డిజిటల్ మూల్యాంకనంలో వచ్చిన మార్కులనే మాన్యువల్ మూల్యాంకనంలో వచ్చిన మార్కులుగా చూపించినట్లు ఈడీ దర్యాప్తులో ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
2022 ఫిబ్రవరి 19న కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఏపీపీఎస్సీ చైర్మన్ గతంలో మూల్యాంకనం చేసిన జవాబు పత్రాలను తిరిగి తెప్పించారు. గతంలో ప్రకటించిన ఫలితాల షీట్లను కూడా వెనక్కి తీసుకున్నారు. అనంతరం ఏపీపీఎస్సీ కార్యాలయ ప్రాంగణంలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో మళ్లీ మాన్యువల్ మూల్యాంకనం నిర్వహించారు. ఈ మూల్యాంకనం ఆధారంగానే తుది ఫలితాలు, ఎంపిక జాబితాను ప్రకటించారు.
దీంతో అంతకుముందు నిర్వహించినట్లు చెప్పిన మాన్యువల్ మూల్యాంకనం విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. వాస్తవంగా సేవలు అందించకుండానే రూ.1.14 కోట్లు చెల్లించినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, ఇది మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం నేరపూరిత కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయంగా పరిగణించేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ఈడీ పేర్కొంది.

More Stories
తిరుపతి లడ్డూ కల్తీ విచారణ ఏపీ నుండి మార్పుకు `సుప్రీం’ తిరస్కారం
ఏపీలో తుపాన్ల ప్రభావంపై ప్రధాని మోదీ ఆరా
కళాభిమాని ఆంజనేయరాజు స్మృతికి ఘనంగా నివాళులు