ఐఓఏ అథ్లెట్ల కమిషన్‌ చైర్‌పర్సన్‌గా పీవీ సింధు!

దిగ్గజ షట్లర్‌, డబుల్‌ ఒలింపిక్‌ మెడలిస్ట్‌ పీవీ సింధు పది మంది సభ్యులతో కూడిన భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అథ్లెట్స్‌ కమిషన్‌ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైంది. పురుషుల హాకీ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ వైస్‌ చైర్‌పర్సన్‌గా ఎంపికయ్యాడు. స్టార్‌ వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చాను, స్విమ్మర్‌ సాజన్‌ ప్రకాష్‌ను ఐఓఏ జనరల్‌ బాడీకి అథ్లెట్స్‌ కమిషన్‌ ప్రతినిధులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

రెండుసార్లు ఒలింపిక్‌ పతకాలు సాధించిన సింధు, హర్మన్‌ప్రీత్‌ ఐఓఏ కార్యవర్గ మండలిలోనూ సభ్యులుగా చేరనున్నారు. డిసెంబర్‌ 5న జరిగే ఎన్నికల అనంతరం కార్యవర్గ మండలి ఏర్పాటవుతుంది. మీరాబాయి చాను, సాజన్‌ ప్రకాశ్‌కు ఆ ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ఉంటుంది. సింధు, హర్మన్‌ప్రీత్‌, మీరాబాయి చాను, సాజన్‌ ప్రకాశ్‌ 2026 నుంచి 2030 వరకు నాలుగేళ్ల పాటు తమ పదవుల్లో కొనసాగనున్నారు.

నిబంధనల ప్రకారం అథ్లెట్ల కమిషన్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ పదవుల్లో ఒకటి పురుషుడికి, మరొకటి మహిళకు కేటాయించాలి. జనరల్‌ బాడీ ప్రతినిధుల విషయంలోనూ ఇదే నిబంధన వర్తిస్తుంది.  చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ పదవులకు పోటీ చేసే వారు గత మూడు ఒలింపిక్‌ క్రీడల్లో కనీసం ఒకదానిలో పాల్గొన్న ఆరుగురు ఒలింపిక్‌ కేటగిరీ సభ్యుల్లో ఉండాలి. ఈ నెల 3న అథ్లెట్ల కమిషన్‌ సభ్యులుగా పది మంది క్రీడాకారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. 

వింటర్‌ ఒలింపియన్‌ శివ కేశవన్‌, ఒలింపిక్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆసియా అథ్లెట్ల కమిషన్‌ నుంచి షూటర్‌ రాజేశ్వరి కుమారి ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా వ్యవహరించనున్నారు. మిగిలిన సభ్యుల్లో సలీమా టెటే, స్వప్నిల్‌ కుసాలే, భవానీ దేవి, తజిందర్‌పాల్‌ సింగ్‌ తూర్‌, బొంబైలా దేవి, మంజీత్‌ సింగ్‌ ఉన్నారు. గతంలో ఎంసీ మేరీకోమ్‌ నేతృత్వంలోని అథ్లెట్ల కమిషన్‌లోనూ సింధు, మీరాబాయి చాను, భవానీ దేవి సభ్యులుగా పనిచేశారు.

About The Author