ఓటర్ల జాబితాలో పేరు చేర్చుకునేందుకు మరో అవకాశం!

ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించిన వారికి భారత ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. అర్హులైన ఓటర్లు తమ పేర్లను మళ్లీ ఓటర్ల జాబితాలో చేర్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన ప్రధాన ఎన్నికల అధికారులను ఆదేశించింది. ఈ మేరకు నవంబర్ 6న సంబంధిత అధికారులకు లేఖ జారీ చేసింది.

మహారాష్ట్ర, హర్యానా, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణ, నాగాలాండ్ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారులకు ఈ ఆదేశాలు అందాయి. ఎన్నికల ఫారాలు జారీ చేసినప్పటికీ, ‘గైర్హాజరు, నివాసం మార్చిన, మరణించిన లేదా నకిలీ’ కేటగిరీల కింద గుర్తించి పేర్లు తొలగించిన ఓటర్లకు ఈ అవకాశం వర్తించనుంది. ఏఎస్‌డీడీ కేటగిరీల కింద పేర్లు తొలగించబడిన ఓటర్లు తుది ఓటర్ల జాబితాలో తమ పేర్లను చేర్చుకునేందుకు మరోసారి ఫారాలు సమర్పించుకోవచ్చని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

ఇందుకోసం తమ ప్రస్తుత సాధారణ నివాస పరిధిలోని ఎన్నికల నమోదు అధికారి (ఈఆర్ఓ) లేదా సహాయ ఎన్నికల నమోదు అధికారిను సంప్రదించవచ్చు. సరిగ్గా పూర్తి చేసిన ఎన్నికల ఫారాలను సంబంధిత అధికారులకు అందజేయాల్సి ఉంటుంది.  ఈ ప్రక్రియలో భాగంగా ఏఎస్‌డీడీ కేటగిరీల కింద గుర్తించిన ఓటర్ల బూత్‌ వారీ జాబితాలను మరోసారి ప్రదర్శించాలని ఈసీ ఆదేశించింది.

సంబంధిత పోలింగ్ కేంద్రాలు, పంచాయతీ భవనాలు, పట్టణ స్థానిక సంస్థల కార్యాలయాల్లోని నోటీసు బోర్డులపై వీటిని అందుబాటులో ఉంచనున్నారు. అంతేకాకుండా ఆయా రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారుల అధికారిక వెబ్‌సైట్లలోనూ ఈ జాబితాలను అప్‌లోడ్ చేయనున్నారు. ఓటర్లు సులభంగా పరిశీలించుకునేందుకు చదవగలిగే పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో అందుబాటులో ఉంచాలని సూచించింది.

“వివిధ రాజకీయ పార్టీలకు చెందిన సంబంధిత బిఎల్‌ఎలతో సమన్వయం చేసుకుంటూ, ఇంటింటికీ వెళ్లి, ఇరుగుపొరుగు వారిని, కుటుంబ సభ్యులను లేదా నివాస సంక్షేమ సంఘాలను (ఆర్‌డబ్ల్యుఎలను) విచారించి, సాధ్యమైన చోట అందుబాటులో ఉన్న సంప్రదింపు నంబర్లను ఉపయోగించి, అటువంటి ఓటర్లను సంప్రదించడానికి బిఎల్‌ఒలు సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేయాలి,” అని ఈసీ పేర్కొంది.

ముసాయిదా ఓటర్ల జాబితాలో సంబంధిత ఓటర్ల పేర్లను ఎందుకు చేర్చలేదనే దానికి సంబంధించిన సంభావ్య కారణాలను కూడా ఈ జాబితాల్లో పొందుపరచనున్నారు. తద్వారా తమ పేర్లు తొలగిపోవడానికి గల కారణాలను తెలుసుకుని, తిరిగి ఓటర్ల జాబితాలో చోటు సంపాదించేందుకు అవసరమైన చర్యలు తీసుకునే అవకాశం ఓటర్లకు కలగనుంది.

About The Author