ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యాను అంతర్జాతీయ వేదికలపై ఒంటరి చేయాలన్న పశ్చిమ దేశాల ప్రయత్నాలు కొనసాగుతుండగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విషయంలో బ్రిటన్, అమెరికా భిన్నమైన వైఖరులు ప్రదర్శిస్తున్నాయి. వచ్చే ఏడాది బ్రిటన్‌లో జరగనున్న జీ20 శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ హాజరుకాబోరని ఆ దేశ ప్రధాని ఆండీ బర్న్‌హామ్ స్పష్టం చేయగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం డిసెంబర్లో మియామీలో జరిగే జీ20 సమావేశానికి పుతిన్‌ను ఆహ్వానించారు.
బ్రిటన్ ప్రధాని బర్న్‌హామ్ పుతిన్ హాజరుపై స్పందిస్తూ రష్యా జీ20 సభ్యదేశంగా కొనసాగుతున్నందున ఆ దేశాన్ని కూటమి నుంచి తొలగించడం, పుతిన్‌ను అధికారికంగా నిషేధించడం వంటి అంశాలు వేర్వేరని వివరించారు. జీ20 ఆహ్వానాల ప్రక్రియ కూటమి పరిధిలోనే ఉంటుందని పేర్కొన్నారు. అయితే, పుతిన్‌పై బ్రిటన్ విధించిన ఆంక్షలు ఇంకా అమల్లో ఉన్నందున ఆయన సదస్సుకు హాజరుకాబోరని స్పష్టం చేశారు.
2022లో ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి బ్రిటన్ ఆ దేశ నాయకత్వంపై ఆంక్షలు విధిస్తోంది. ఈ విషయంపై బర్న్‌హామ్ కార్యాలయం మరింత వివరణ ఇవ్వలేదు. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల మధ్య సమన్వయం కోసం ఏర్పాటైన జీ20 కూటమిలో రష్యా ఇప్పటికీ సభ్యదేశంగా ఉంది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అమెరికా, బ్రిటన్ సహా పలు పశ్చిమ దేశాలు రష్యాపై ఆర్థిక, దౌత్యపరమైన ఆంక్షలు విధించాయి.
అంతర్జాతీయ వేదికలపై మాస్కోను దూరం పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయినప్పటికీ జీ20లో రష్యా సభ్యత్వం రద్దు కాలేదు. సాధారణంగా ఆతిథ్య దేశాలు సభ్యదేశాలన్నింటినీ వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానిస్తాయి. ఈ నేపథ్యంలో పుతిన్ హాజరుపై బ్రిటన్ ప్రధాని చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే, డిసెంబర్లో మియామీలో జరగనున్న జీ20 సమావేశానికి పుతిన్‌ను ఆహ్వానించినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో గత సెప్టెంబర్‌లో వెల్లడించారు. ఈ సమావేశం ద్వారా రష్యా అధ్యక్షుడికి ట్రంప్‌తోపాటు ఇతర ప్రపంచ దేశాల నాయకులతో ముఖాముఖి చర్చించే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. దీంతో రష్యాతో వ్యవహరించే విషయంలో పశ్చిమ దేశాల మధ్య ఏకాభిప్రాయం లేదన్న చర్చ మొదలైంది.
రష్యా ప్రతినిధుల భాగస్వామ్యంపై ఇటీవల జరిగిన జీ20 విదేశాంగ మంత్రుల సమావేశంలోనూ విభేదాలు వెలుగుచూశాయి. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ పాల్గొన్న నేపథ్యంలో ఐరోపా దేశాల అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సంప్రదాయ గ్రూప్ ఫొటోను కూడా అమెరికా ఆతిథ్య నిర్వాహకులు రద్దు చేసినట్లు వార్తలు వచ్చాయి. రష్యా జీ20 సభ్యత్వం కొనసాగుతున్న నేపథ్యంలో ఆ దేశం తరఫున ఇతర ప్రతినిధులు బ్రిటన్ సదస్సులో పాల్గొంటారా? అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

More Stories
బంగ్లాదేశ్‌లో భారతీయ వైద్య విద్యార్థి అదృశ్యం.. చెరువులో మృతదేహం
ఇజ్రాయెల్ ప్రధానిగా ఐసెన్కోట్కు అరబ్ పార్టీలు మద్దతు
నిరసన జ్వాలలతో రణరంగంగా ఫ్రాన్స్ .. అధ్యక్ష ఎన్నికలపై ప్రభావం!