తెలంగాణాలో రూ. 3,892 కోట్లతో ఐదు కీలక ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం 

అర్బన్‌ ఛాలెంజ్‌ ఫండ్‌ (యూసీఎఫ్‌) కింద తెలంగాణలో రూ.3,892 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఐదు కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు ఈనెల 3న ఢిల్లీలో జరిగిన నాలుగో నేషనల్‌ ఎపెక్స్‌ కమిటీ సమావేశం ఆమోదం తెలిపింది. వరదనీటి నిర్వహణ, చారిత్రక కట్టడాల పునరుద్ధరణ, రవాణా సదుపాయాల మెరుగుదల వంటి కీలక రంగాల్లో ఈ నిధులతో పనులు చేపట్టనున్నారు.  ప్రాజెక్టుల అమలుతో రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతోపాటు ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. 
 
యూసీఎఫ్‌ మార్గదర్శకాల ప్రకారం ఈ ప్రాజెక్టుల వ్యయంలో కేంద్ర ప్రభుత్వం 20 నుంచి 25 శాతం వరకు భరించనుంది. కేంద్రం కేటాయించే నిధులకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటా సమకూర్చనుంది. మిగిలిన మొత్తాన్ని పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ (పిపిపి) విధానంలో పనులు దక్కించుకునే ప్రైవేటు సంస్థలు పెట్టుబడిగా వెచ్చించనున్నాయి. కేంద్రం తాజాగా ఆమోదించిన ఐదు ప్రాజెక్టుల్లో హైదరాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, అలంపూర్‌ ప్రాంతాలకు సంబంధించిన పనులు ఉన్నాయి.

హైదరాబాద్‌ జలమండలి ఆధ్వర్యంలో చేపట్టనున్న గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్‌-2, ఫేజ్‌-3 పనులకు రూ.1,992 కోట్లతో ఆమోదం లభించింది. నగర భవిష్యత్తు తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. మరోవైపు వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో సమగ్ర వరదనీటి నిర్వహణ వ్యవస్థ ఏర్పాటుకు రూ.1,465 కోట్ల భారీ ప్రాజెక్టుకు అనుమతి లభించింది. 

 
వర్షాకాలంలో నగరంలోని లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోకుండా డ్రైనేజీ వ్యవస్థను ఆధునికీకరించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. వరంగల్‌ నగరంలో వరద ముప్పును తగ్గించేందుకు ఈ పనులు కీలకంగా మారనున్నాయి. చారిత్రక వరంగల్‌ కోట కందకం పునరుద్ధరణ, అభివృద్ధి పనులకు కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కూడా) ఆధ్వర్యంలో రూ.209.08 కోట్లు మంజూరయ్యాయి. 
 
చారిత్రక ప్రాధాన్యం కలిగిన కందకాన్ని పునరుద్ధరించడంతోపాటు పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దేందుకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయి. అలాగే హనుమకొండ సెంట్రల్‌ బస్‌ డిపో నిర్మాణానికి రూ.168.80 కోట్లతో ఆమోదం లభించింది. ఆధునిక రవాణా సదుపాయాలు, ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించేలా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఈ రెండు పనులతో వరంగల్‌– హనుమకొండ నగరాల అభివృద్ధికి మరింత ఊతం లభించనుంది.


జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అలంపూర్‌ దేవాలయ అభివృద్ధికి రూ.57.50 కోట్లతో పనులు మంజూరయ్యాయి. అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదో శక్తిపీఠంగా ప్రసిద్ధిగాంచిన జోగులాంబ అమ్మవారి ఆలయానికి ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల, భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు ఈ నిధులు దోహదపడనున్నాయి.                                                       

About The Author