అరెస్టులు, నిర్బంధాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఒక వ్యక్తిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు ఉండే 24 గంటల కాలపరిమితిని అధికారికంగా అరెస్ట్ చేసిన సమయం నుంచి కాకుండా, వాస్తవంగా నిర్బంధించిన సమయం నుంచే లెక్కించాలని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(2) కల్పించిన ప్రాథమిక హక్కులను పరిరక్షించేలా కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.
అధికారికంగా అరెస్టు చేసిన సమయం నుంచి మాత్రమే ఈ గడువును లెక్కించాలన్న వాదన చెల్లదని తేల్చిచెప్పింది. నిర్బంధించిన తర్వాత విచారణ లేదా ఇతర ప్రక్రియల పేరుతో గడిపిన సమయాన్ని మినహాయించి, ఆలస్యంగా మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచడానికి పోలీసులకు అవకాశం లేదని స్పష్టం చేసింది. వ్యక్తిగత స్వేచ్ఛకు రాజ్యాంగం కల్పించిన రక్షణను అడ్డుకునేలా అరెస్టు, నిర్బంధం మధ్య వ్యత్యాసాన్ని ఉపయోగించరాదని జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ అతుల్ ఎస్ చంద్రుర్కర్తో కూడిన ధర్మాసనం గురువారం ఈ తీర్పు ఇచ్చింది.
అరెస్టుకు ముందు విచారణ, దర్యాప్తు, తనిఖీలు, వస్తువుల స్వాధీనం వంటి ప్రక్రియల కోసం పట్టిన సమయాన్ని కూడా గడువులో భాగంగానే పరిగణించాలని పేర్కొంది. అధికారిక అరెస్టు నమోదు చేసినప్పటి నుంచే 24 గంటలు ప్రారంభమవుతాయన్న అభిప్రాయం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిర్బంధం జరిగిన సమయాన్ని పక్కనపెట్టి, అరెస్టు మెమోలో నమోదైన సమయాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవడం ద్వారా ప్రాథమిక హక్కులను నీరుగార్చలేరని స్పష్టం చేసింది.
త్రిపుర హైకోర్టు బెయిల్ నిరాకరించడాన్ని సవాలు చేస్తూ నలుగురు వ్యక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధించిన ఎన్డీపీఎస్ చట్టం కింద నమోదైన కేసులో ఈ పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో సోదాలు, స్వాధీన ప్రక్రియలో భాగంగా 2025 సెప్టెంబర్ 29న మధ్యాహ్నం 2 గంటలకు నలుగురినీ అధికారులు నిర్బంధించారు.
అయితే మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 30న ఉదయం 11 గంటలకు మాత్రమే వారిని అధికారికంగా అరెస్టు చేసినట్లు నమోదు చేశారు. ఈ సమయాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు, 24 గంటల గడువును సెప్టెంబర్ 29 మధ్యాహ్నం 2 గంటల నుంచే లెక్కించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అంటే సెప్టెంబర్ 30 మధ్యాహ్నం 2 గంటల్లోగా వారిని మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచాల్సి ఉంటుందని పేర్కొంది.
నిర్బంధానికి సంబంధించిన వాస్తవ తేదీ, సమయాన్ని మేజిస్ట్రేట్లు తప్పనిసరిగా నమోదు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. ఆర్టికల్ 22(2) నిబంధనలు పాటించారా లేదా అనేది పరిశీలించాలని పేర్కొంది. 24 గంటల్లోపు హాజరుపరిచినప్పటికీ నిర్బంధ కాలం సహేతుకంగా ఉందా లేదా అన్నది పరిశీలించాలని తెలిపింది. నిర్బంధం అనవసరంగా ఎక్కువ సమయం కొనసాగితే రిమాండ్‌ను తిరస్కరించే అధికారం మేజిస్ట్రేట్‌కు ఉంటుందని స్పష్టం చేసింది.

More Stories
మొదటిసారి ఆపరేషనల్ మరణం లేని సీఆర్పీఎఫ్
భారతదేశ వీసా ప్రక్రియను మరింత సులభతరం
అగ్ని వీరులకు రెండేళ్లు పొడిగింపు