భారతదేశ వీసా ప్రక్రియను మరింత సులభతరం

భారతదేశ వీసా ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ  వీసా నిబంధనల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. ఇందులో భాగంగా ప్రధాన వీసా కేటగిరీలను 13 నుంచి 9 కి తగ్గించడంతో పాటు వీసా దరఖాస్తు ఫారమ్‌లలోని అంశాలను 70 శాతం మేర తగ్గించాలని నిర్ణయించినట్లు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న 13 ప్రధాన వీసా కేటగిరీలను 9కి, అలాగే 49 సబ్-కేటగిరీలను 23కి తగ్గించాలని నిర్ణయించారు.
దీనివల్ల దరఖాస్తుదారులకు ఏ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకోవాలో సులభంగా అర్థమవుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా, వీసా దరఖాస్తు ఫారమ్‌లలోని 70 శాతం అంశాలను తొలగించడం ద్వారా, వాటిని మరింత క్లుప్తంగా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. ఒకే రకమైన, పదేపదే అడిగే, అనవసరమైన ప్రశ్నలను పూర్తిగా తొలగించడం ద్వారా వినియోగదారులకు సులభంగా అర్థమయ్యేలా వీసా ఫారమ్‌లను రూపొందించడం ఈ చర్య ముఖ్య ఉద్దేశం.
ఈ మార్పులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందిస్తున్నారు. అన్ని రకాల వీసా కేటగిరీలకు, సబ్-కేటగిరీలకు ఈ కొత్త నిబంధనలు అమలు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, జూన్ నెలలో ఇమిగ్రేషన్‌ నిబంధనలకు సంబంధించి హోంశాఖ కీలక మార్పులు చేసింది. విదేశీయులు అనుమతి పొందిన సమయం కన్నా ఎక్కువ రోజులు భారత్‌లో ఉండాలంటే వారి వీసా గడువు ముగియకముందే విదేశాంగశాఖ వద్ద రిజిస్టర్‌ చేసుకోవాలని సూచించింది.
అందుకు సంబంధించి కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత్‌కు 180 రోజులు అంతకంటే తక్కువ గడువు వీసాలపై వచ్చే విదేశీయులకు ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. ఒకవేళ వీరు భారత్‌లో కొనసాగాలంటే వీసా గడువు ముగియకముందే రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేసుకోవాలని చెప్పింది. వాస్తవానికి గతంలో వీసా గడువు పూర్తైన తర్వాత 14 రోజుల్లోపు పొడిగింపునకు దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉండేది, కానీ ఆ నిబంధనల ప్రకారం ముందే రిజిస్ర్టేషన్‌ చేసుకోవాలి. భారత్‌లో ఉన్న విదేశీ పౌరులపై పర్యవేక్షణకు ఆ నిబంధన ఉపయోగపడనుందని హెంశాఖ అభిప్రాయపడింది. 

About The Author