దత్తాత్రేయ హోసబలే,
సర్ కార్యవాహ, ఆర్ఎస్ఎస్
(శతజయంతి సందర్భంగా ఇండోర్ లో జరిగిన అఖిల భారతీయ కార్యకారి మండలి సమావేశాలలో విడుదల చేసిన ప్రత్యేక ప్రకటన)
భగవాన్ జగన్నాథుని సన్నిధిలో పునీతమైన ఒడిశా భూమి, సమాజానికి మార్గదర్శనం చేసిన ఎందరో మహనీయుల కృషిచే మరింత సుసంపన్నమైంది. అటువంటి వారిలో అసాధారణ యతి, స్వామి లక్ష్మణానంద సరస్వతి ఒకరు. 1926 ఆగస్టు 18న అంగుల్ జిల్లాలోని గురుజంగ్ గ్రామంలో జన్మించిన ఆయన, హిందూ సమాజానికి వ్యతిరేక శక్తులను ధైర్యంగా ఎదుర్కొంటూ అమరత్వానికి చేరుకున్నారు.
యుక్తవయసులో స్వామీజీ ‘ప్రజామండలం’లో చేరి, స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నారు. వివాహానంతరం ఆయన దీక్ష స్వీకరించి సన్యాసాశ్రమాన్ని చేపట్టారు. హిందూ ధార్మిక గ్రంథాలను, సంస్కృత వ్యాకరణాన్ని లోతుగా అధ్యయనం చేశారు. ఒడిశాలోని కంధమాల్ ప్రాంతంలో క్రియాశీలకంగా ఉన్న దేశవిరోధి శక్తులను గట్టిగా ఎదుర్కోవడానికి, ఆయన అదే ప్రాంతంలోని ‘చకపాద’ను తన కార్యక్షేత్రంగా, నివాసంగా ఎంచుకున్నారు.
గిరిజన సమాజం ఆధ్యాత్మిక పునాదులపై భౌతికంగా అభివృద్ధి చెందేలా, వారిలో తమ సంస్కృతి పట్ల గర్వభావం కలిగేలా స్వామీజీ విశేష కృషి చేశారు. సంస్కృత విద్యను ప్రోత్సహించడం, మహిళల కోసం భజన కేంద్రాలను ఏర్పాటు చేయడం, వ్యవసాయం, గోసంరక్షణ,నీటి సంరక్షణ వంటి కార్యక్రమాల ద్వారా గిరిజన సమాజానికి ఆత్మగౌరవంతో కూడిన స్వయంసమృద్ధి మార్గాన్ని ఆయన చూపారు.
‘శుద్ధి యజ్ఞాల’ నిర్వహణ ద్వారా, వారు ధర్మబద్ధమైన జీవనానికి కట్టుబడి ఉండేలా ప్రేరేపించారు. గిరిజన సమాజం ఎంతో భక్తితో ఆరాధించే ‘ధరణి పెను’ అనే పవిత్ర చిహ్నాన్ని, నేటి కాలానికి అనుగుణమైన సందర్భంలో ప్రజల ముందు ఉంచడం ద్వారా, ఆయన సమాజ మూలాలను మరింత దృఢపరిచారు. భగవాన్ జగన్నాథుని యాత్రలు, యజ్ఞాలు, ఇతర కార్యక్రమాల నిర్వహణ ద్వారా, స్థానిక సమాజంలో ధార్మిక విశ్వాసాల పట్ల నిబద్ధతను, తమ సంప్రదాయాల పట్ల గర్వభావాన్ని ఆయన తిరిగి జాగృతం చేశారు.
ఈ లక్ష్య సాధన కోసం, ఆయన హిందూ ధర్మంలోకి తిరిగి వచ్చే ప్రక్రియను మరింత సరళంగా, సులభతరం చేశారు. ఇందుకోసం ఆయన భగవాన్ జగన్నాథుని ‘నిర్మాల్యం’ (ప్రసాదం), తులసి మట్టి, ఆకులు, అలాగే గంగాజలాన్ని ఉపయోగించారు. స్వామీజీ చేపట్టిన ఈ కార్యాల వల్ల, ఆ ప్రాంతంలో క్రియాశీలంగా ఉన్న అసాంఘిక, దేశవిరోధి శక్తులు కలవరపడసాగాయి. వారు ఆయనపై నేరుగా దాడి చేయడానికి పలుమార్లు ప్రయత్నించారు.
అయినప్పటికీ, స్వామీజీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా, మరింత దృఢ సంకల్పంతో తన కార్యాన్ని కొనసాగించారు, తన ఉనికిని బలంగా చాటుకుంటూ, ఎటువంటి అంతరాయం లేకుండా తన లక్ష్య సాధనలో ముందుకు సాగారు. చివరికి, పవిత్రమైన జన్మాష్టమి రోజున, అసహనంతో కూడిన మతోన్మాద శక్తులు జలేశ్పట్టా ఆశ్రమంపై దాడి చేసి, స్వామీజీని, ఆయన నలుగురు శిష్యులను అత్యంత క్రూరంగా హత్య చేశాయి.
మహనీయుడైన అమర సన్యాసి స్వామి లక్ష్మణానంద సరస్వతి గారి జీవితం, మాతృభూమిని, ధర్మాన్ని రక్షించడానికే పూర్తిగా అంకితమైంది. ఈ పవిత్ర కార్యమే ఆయన జీవిత పరమార్థంగా ఉండేది. ఆయన వ్యక్తిత్వం, ఆయన చేసిన పనులు వేర్వేరు కావు. ఆయన నమ్మకాలు, ఆచరణలు ఒకదానితో ఒకటి పెనవేసుకుని, అచంచలమైన ఏకత్వాన్ని ప్రతిబింబించేవి.
నేడు, ఆయన చేసిన గొప్ప త్యాగం నుండి స్ఫూర్తి పొందిన ఎంతోమంది కార్యకర్తలు, ఆ స్ఫూర్తిని తమ హృదయాల్లో నిలుపుకుని, ధార్మిక విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి, సంప్రదాయాలను పరిరక్షించడానికి నిబద్ధతతో పనిచేస్తున్నారు. ‘వేదాంత కేసరి’గా పేరొందిన పూజ్యనీయ సన్యాసి స్వామి లక్ష్మణానంద సరస్వతి జయంతి సందర్భంగా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం ఈ గొప్ప సన్యాసికి, అమరవీరునికి తన వినమ్ర నివాళులర్పిస్తోంది.

More Stories
అమెరికాలో తొలి ముస్లిం సెనెటర్ ‘ముస్లిం బ్రదర్హుడ్’ సభ్యుడా?
ప్రజాస్వామ్య దేవాలయంపై విరుచుకుపడిన అరాచకం
భారత వాణిజ్య అస్థిరతపై అమెరికా మధ్యంతర ఎన్నికల ప్రభావం!