దత్తాత్రేయ హోసబలే,
సర్ కార్యవాహ, ఆర్ఎస్ఎస్
( శతజయంతి సందర్భంగా ఇండోర్ లో జరిగిన అఖిల భారతీయ కార్యకారి మండలి సమావేశాలలో విడుదల చేసిన ప్రత్యేక ప్రకటన)
స్వాతంత్ర్య సమరయోధుడు, విద్యావేత్త, సంఘ సంస్కర్త, ధర్మ ప్రచారకుడు, శుద్ధి ఉద్యమ ధీరోదాత్త నాయకుడైన స్వామి శ్రద్ధానంద జీ అమరత్వానికి వంద ఏళ్లు పూర్తయిన సందర్భంగా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆయనను భక్తిపూర్వకంగా స్మరించుకుంటోంది. పంజాబ్లోని జలంధర్ జిల్లా తల్వాన్ గ్రామంలో జన్మించిన స్వామీజీ, సన్యాస దీక్ష స్వీకరించిన తర్వాత, సమాజ చైతన్యం కోసం అనేక కార్యకలాపాలకు తన జీవితాన్ని అంకితం చేశారు.
భారతీయ విద్యా వ్యవస్థపై బ్రిటిష్ వారు చేసిన క్రమబద్ధమైన దాడిని ధైర్యంగా ఎదుర్కోవడానికి, ఆయన హరిద్వార్ ప్రాంతంలో ‘గురుకుల్ కాంగ్రి’ని స్థాపించారు. భారతీయ విద్యా దృక్పథంతో కూడిన ఒక ప్రత్యామ్నాయ విద్యా సంస్థగా దీనిని తీర్చిదిద్దారు. భారతీయ సంస్కృతి, వేదాలు, సమగ్ర భారతీయ సాహిత్యం, ఆధునిక విషయాల అధ్యయనంతో పాటు, స్వాతంత్ర్య ఉద్యమంలో కూడా గురుకుల్ కాంగ్రి విశేష కృషి చేసింది.
తప్పుడు అభిప్రాయాలు, పక్షపాతాల కారణంగా, కేరళలోని వైకోమ్ శివాలయంలోకి వెనుకబడిన వర్గాల వారికి ప్రవేశం నిరాకరించడమే కాకుండా, ఆలయం చుట్టూ ఉన్న బహిరంగ రహదారులపై నడవడానికి కూడా అనుమతి ఉండేది కాదు. ఈ వివక్షకు వ్యతిరేకంగా వైకోమ్లో ఒక చారిత్రాత్మక ఉద్యమం మొదలైంది. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ ఉద్యమంలో స్వామి శ్రద్ధానంద జీ స్వయంగా పాల్గొన్నారు.
ఈ గొప్ప కార్యం కోసం ఆయన శ్రీ నారాయణ గురువులను కూడా కలిశారు. సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటాన్ని గమనించిన భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, స్వామి శ్రద్ధానందను సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పట్ల నిజమైన శ్రేయోభిలాషిగా భావించారు. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో సమాజాన్ని చైతన్యపరిచేందుకు, ఆయన ‘సద్ధర్మ ప్రచార్’, ‘తేజ్’, ‘వీర్ అర్జున్’, ‘ది లిబరేటర్’ వంటి పత్రికలను ప్రారంభించారు.
నిర్భయమైన, స్థిరమైన, సూత్రబద్ధమైన పాత్రికేయ రచనల ద్వారా ఆయన బ్రిటిష్ వారి అబద్ధాలను, మోసాలను, కుట్రలను ఎండగట్టారు. ప్రతికూల పరిస్థితులు, తప్పుడు సామాజిక, మతపరమైన నమ్మకాల కారణంగా, హిందూ సమాజం నిరంతరం మత మార్పిడుల సవాలును ఎదుర్కోవాల్సి వచ్చింది. హిందూ ధర్మం నుండి మతం మారిన వారికి తిరిగి వచ్చే మార్గాలు మూసుకుపోయి ఉండేవి.
అటువంటి పరిస్థితుల్లో, మతం మారిన హిందువులు తమ పూర్వీకుల ధర్మానికి తిరిగి రావడానికి వీలుగా స్వామీజీ ‘శుద్ధి ఉద్యమం’ ద్వారా ప్రయత్నాలను చేపట్టారు. మోప్లా అల్లర్ల (మారణకాండ) అనంతరం, స్వామీజీ ఈ శుద్ధి ఉద్యమానికి నాయకత్వం వహించి, కేరళలో, దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలు తిరిగి హిందూ ధర్మంలోకి రావడానికి మార్గం సుగమం చేశారు.
పురుషార్థం (లక్ష్యంతో కూడిన కార్యాచరణ), పరమార్థం (సమాజ శ్రేయస్సు కోసం నిస్వార్థ సేవ) రెండింటి సాధనలో అవిచలిత దీక్షతో సాగిన స్వామీజీ కృషి, ఆయన లక్ష్యానికి వ్యతిరేకంగా ఉన్నవారిని తీవ్రంగా కలవరపరిచింది. 1926 డిసెంబర్ 23న, ఢిల్లీలో అబ్దుల్ రషీద్ అనే మతోన్మాది చేతిలో ఆయన దారుణ హత్యకు గురయ్యారు. నిబద్ధతతో కూడిన లక్ష్యసాధనకు స్ఫూర్తిదాయక ఉదాహరణగా నిలిచిన స్వామి శ్రద్ధానంద జీకి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తన హృదయపూర్వక నివాళులర్పిస్తోంది. ఆయన జీవితం, కృషుల నుండి స్ఫూర్తి పొందుతూ, ‘ధర్మ రక్షణ’ కార్యం కోసం నిరంతరం క్రియాశీలంగా ఉండాలని సంఘ్ అందరికీ పిలుపునిస్తోంది.

More Stories
అమెరికాలో తొలి ముస్లిం సెనెటర్ ‘ముస్లిం బ్రదర్హుడ్’ సభ్యుడా?
ప్రజాస్వామ్య దేవాలయంపై విరుచుకుపడిన అరాచకం
భారత వాణిజ్య అస్థిరతపై అమెరికా మధ్యంతర ఎన్నికల ప్రభావం!