ఓటర్ల జాబితాకు సంబంధించి చేపట్టిన ప్రత్యేక సమగ్ర సమీక్ష(ఎస్ఐఆర్) ప్రక్రియ పూర్తయిన తర్వాత ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ రాష్ర్టాల్లో ఓటర్ల సంఖ్య 13.24 శాతం తగ్గిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఐదు రాష్ర్టాల్లో వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారులు ఇటీవల వెల్లడించిన గణాంకాల ప్రకారం ఈ ఐదు రాష్ర్టాల్లో సర్ ప్రక్రియ తర్వాత ఓటర్ల సంఖ్య సుమారు 18.71 కోట్ల నుంచి 16.43 కోట్లకు తగ్గింది.
అంటే మొత్తం మీద సుమారు 2.29 కోట్ల మంది ఓటర్లు తగ్గారు. ఇది సుమారు 13.2 శాతానికి సమానం. రాష్ర్టాలన్నింటిలోకెల్లా అత్యధిక ఓటర్లను కలిగి ఉన్న ఉత్తర ప్రదేశ్ మొత్తం తగ్గుదలలో దాదాపు 90 శాతం వాటాను కలిగి ఉంది. రెండో దశలో స్పెషల్ సమ్మరీ రివిజన్ ప్రకియను చేపట్టిన ఉత్తర ప్రదేశ్లో ఈ ప్రక్రియకు ముందు 15.44 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్య ముసాయిదా జాబితాలో 12.56 కోట్లకు తగ్గింది.
ఆ తర్వాత తుది ఓటర్ల జాబితాలో ఈ సంఖ్య 13.40 కోట్లుగా నమోదైంది. నికర నష్టం సుమారు 2.04 కోట్లు లేదా 13.24 శాతంగా ఉంది. ఐదు రాష్ర్టాల్లో ఇదే అత్యధికం. ఈ ముసాయిదా నుంచి సుమారు 2.89 కోట్ల పేర్లను తొలగించగా వాటిలో సుమారు 0.84 కోట్లు(దాదాపు 29 శాతం) తిరిగి చేరాయి. మూడవ దశలో సర్ నిర్వహించిన పంజాబ్లో ముసాయిదా జాబితాలో ఓటర్ల సంఖ్య 2.15 కోట్ల నుంచి 1.94 కోట్లకు తగ్గింది. ఆ తర్వాత తుది ఓటర్ల జాబితాలో ఈ సంఖ్య 2.01 కోట్లుగా నమోదైంది.
ఉత్తరాఖండ్లో ఓటర్ల సంఖ్య 0.80 కోట్ల నుంచి 0.71 కోట్లకు తగ్గి, చివరకు 0.72 కోట్లుగా నమోదైంది. ఓటర్ల సంఖ్యలో సుమారు 0.08 కోట్ల మేర, అంటే 10.07 శాతం నికర తగ్గుదల కనిపించింది. మణిపూర్లో మూడవ దశలో సర్ నిర్వహించగా ఓటర్ల సంఖ్య 0.209 కోట్ల నుంచి 0.193 కోట్లకు పడిపోయి చివరకు 0.196 కోట్లతో ముగిసింది. నికరంగా 6.33 శాతం తగ్గారు. గోవాలో సుమారు 0.013 కోట్ల మేర లేదా 10.76 శాతం నికర నష్టం నమోదైంది.
ఇదిలా ఉండగా, ఇటీవల 17 రాష్ట్రాల్లో స్పెషల్ సమ్మరీ రివిజన్ ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ప్రారంభంలో జరగవచ్చని తెలిపింది. ఎన్నికల ముందు జరుగుతున్న ఈ స్పెషల్ సమ్మరీ రివిజన్ ద్వారా ఇంతకుముందు జాబితాలో లేని ఓటర్లకు తిరిగి నమోదు చేసుకునే అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా జనవరి 1వ తేదీ నాటికి లేదా అంతకంటే ముందు 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులు ఓటర్లుగా నమోదు చేసుకునే అవకాశం దక్కుతుంది. అనంతరం రానున్న ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం లభిస్తుంది.

More Stories
దీపావళి రోజు బాణాసంచా కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతి
రామమందిర విరాళాలపై పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు
జనవరి 25 నుంచి దేశవ్యాప్తంగా జనగణన