హైకోర్టులో బేష‌ర‌తు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ఇమ్రాన్ ఖాన్‌

స‌ర్‌కు వ్య‌తిరేకంగా జ‌రిగిన ఆందోళ‌న‌ల్లో న‌టుడు ఇమ్రాన్ ఖాన్ పాల్గొన్న విష‌యం తెలిసిందే. ఆ కేసులో ఆయ‌న ముంబై హైకోర్టు ముందు బేష‌ర‌తు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. అమెరికా పౌరుడివై ఉండి ఎలా నిర‌స‌న‌ల్లో పాల్గొన్నావ‌ని కోర్టు ఆయ‌న్ను మంద‌లించింది. చీఫ్ జ‌స్టిస్ మ‌హేశ్ చంద్ర నేతృత్వంలో బెంచ్ ఆ కేసును విచారించింది.  ఒక‌వేళ భార‌తీయ వ్య‌క్తి అమెరికాలో నిర‌స‌న చేప‌డితే, అప్పుడు ఆ దేశం ఎలా రియాక్ట్ అయి ఉండేద‌ని కోర్టు ప్ర‌శ్నించింది.
నిర‌స‌న ప్ర‌దేశానికి ఎందుకు వెళ్లావ‌ని కోర్టు అడిగింది. భార‌త పౌరుల హ‌క్కులు, ఓసీఐ కార్డు హోల్డ‌ర్ల మ‌ధ్య చాలా తేడా ఉంద‌ని, నిర‌స‌న‌ల కోసం అక్క‌డ‌కు వెళ్లావా లేక మ‌రేదైనా ప‌ని ఉందా అని కోర్టు ప్ర‌శ్నించింది. నిర‌స‌న‌ల‌తో సంబంధం లేద‌ని ప్ర‌క‌ట‌న చేయాల‌ని కోర్టు పేర్కొన్న‌ది. ఎందుకంటే నిర‌స‌న అనేది స‌ర్ ప్ర‌క్రియ‌కు వ్య‌తిరేకంగా జ‌రుగుతోంద‌ని, దానికి మీకు ఎటువంటి సంబంధం లేద‌ని కోర్టు చెప్పింది. మీరు భార‌తీయ పౌరుడు కాదు కాబ‌ట్టి, ఆ నిర‌స‌న‌ల్లో పాల్గొన‌డం చ‌ట్ట వ్య‌తిరేకం అవుతుంద‌ని కోర్టు పేర్కొన్న‌ది. 

ఒక‌వేళ అమెరికాలోనే భార‌తీయ పౌరుడు నిర‌స‌న‌లో పాల్గొని ఉంటే, అప్పుడు ఆ వ్య‌క్తిని త‌క్ష‌ణ‌మే విమానం ఎక్కించేవాళ్లు అని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. ‘మీరు (ఇమ్రాన్ ఖాన్) అమెరికన్ సిటిజన్. మీ దగ్గర ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డు ఉంది. ఈ నేపథ్యంలో ఒక భారతీయ పౌరుడిగా రాజకీయ ప్రదర్శనల్లో మీరు పాల్గొనలేరు. ఆ హక్కు మీకు లేదు. భారతీయ పౌరుడు అమెరికాలో అలాంటి నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటే ఏంటి పరిస్థితి. మరుసటి రోజే ఆ పౌరుడిని ఇండియాకు తరలిస్తారు’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఇమ్రాన్ ఖాన్ ఆయన మొత్తం జీవితాన్ని భారత్‌లోనే గడిపారని, ఆయనకు అమెరికన్ పౌరసత్వం పుట్టుకతోనే వచ్చిందని ఆయన అడ్వొకేట్ వెంకటేశ్ ధోండ్ తెలిపారు. అయినా కూడా ఇమ్రాన్ అలాంటి ఆందోళనలో పాల్గొనలేరని హైకోర్టు స్పష్టం చేసింది. ఇమ్రాన్ తన జీవితం మొత్తం భారత్‌లోనే గడిపేస్తే, భారత పౌరసత్వం ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. భారత పౌరసత్వం తీసుకోవాలని సూచించింది. ఎందుకంటే ఆయన మన దేశంలోనే బాలీవుడ్ స్టార్ అయ్యారని గుర్తుచేసింది.
క్షమాపణ చెప్పినా హైకోర్టు ఆయనను తీవ్రంగా మందలించింది. భవిష్యత్తులో మళ్లీ అలాంటి రాజకీయ ఆందోళనలో పాల్గొనడానికి ఆ క్షమాపణను సాకుగా వాడుకోరాదని హైకోర్టు సూచించింది.  భార‌త్‌ను విడిచి వెళ్లాల‌ని గ‌తంలో ప్ర‌భుత్వం ఇచ్చిన నోటీసులను పెండింగ్‌లో పెట్టింది. అక్టోబ‌ర్ 28వ తేదీలోగా ఇమ్రాన్ దేశం విడిచి వెళ్లాల‌ని విదేశాంగ శాఖ గ‌త‌నెల‌లో ఆదేశాలు జారీ చేసిన విష‌యం తెలిసిందే.

About The Author