ఏపీ వైపు దూసుకొస్తున్న మురసు తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరింత బలపడి మురాసు  తుపానుగా మారింది. ఆదివారం ఉదయం 11.30 గంటలకు నైరుతి, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపాను కేంద్రీకృతమైనట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ నవంబర్ 2వ తేదీ ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. 
 
అనంతరం ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తూ నవంబర్ 2 అర్ధరాత్రి నుంచి నవంబర్ 3 తెల్లవారుజామున మధ్య నెల్లూరు-నరసాపురం మధ్య దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. సోమవారం పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.  మంగళవారం తెల్లవారుజామున దక్షిణకోస్తా తీరానికి సమీపంలోకి చేరుకునే అవకాశం ఉందని, మంగళవారం ఉదయం తీవ్ర తుఫాన్‌గా నెల్లూరు, నరసాపురం మధ్య దక్షిణ కోస్తా తీరాన్ని దాటే అవకాశం ఉందంటుని తెలిపారు. 
 
ఈ తుఫాన్‌కు మురసు పేరు పెట్టారు.  కాకపోతే ఈ తుఫాన్ రాష్ట్రంపై అర్నబ్ తుఫాన్ అంత ప్రభావం చూపకపోవచ్చనే అంచనాలు వేస్తున్నారు. వచ్చే మూడ్రోజులు దక్షిణకోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. మరోవైపు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు..

ఈ మురసు తుఫాన్ ప్రభావం కోస్తా జిల్లాలపై ఉంటుందని చెబుతున్నారు. నవంబర్ 3న బాపట్ల సమీపంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులతో తీవ్ర తుపాను తీరం దాటే అవకాశం ఉండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.  ఈ క్రమంలోనే రేపటి దిల్లీ పర్యటనను కూడా సీఎం రద్దు చేసుకున్నారు. మరోవైపు అర్నబ్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్‌ పునరుద్ధరణపై ఆరా తీశారు. ఈ రోజు రాత్రికి అన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు వివరించారు.

కాగా, నవంబర్ 3న తెలంగాణలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, గరిష్ఠంగా 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది. నవంబర్ 2న కూడా తెలంగాణలో ఈదురుగాలులతో కూడిన ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని తెలిపింది. తుపాను కదలికలు, వర్షాల తీవ్రతపై ప్రజలు వాతావరణ శాఖ తాజా హెచ్చరికలను గమనించాలని సూచించింది.

మురాసు తుపాను ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపిస్తున్న నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా దక్షిణ ఒడిశా జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించింది. లోతట్టు ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో ప్రమాదకర పరిస్థితులు ఉన్న ప్రాంతాల ప్రజలను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించింది.

About The Author