మొదటి జాబితా ప్రకటన తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి ఆప్) ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, హర్మీత్ సింగ్ పఠాన్ మజ్రా, చేతన్ సింగ్ జోరా మజ్రా, ఆదివారం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పాటియాలా జిల్లాలోని సనౌర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పఠాన్ మజ్రా, తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు సమర్పించారు. 
 
ఈ రాజీనామా తక్షణమే అమల్లోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. “నేను ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేస్తున్నాను” అని ఆయన తన లేఖలో తెలిపారు. సమానా నియోజకవర్గ ఎమ్మెల్యే, పంజాబ్ మాజీ మంత్రి అయిన చేతన్ సింగ్ జోరా మజ్రా కూడా సోషల్ మీడియా వేదికగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 
 
“నేను, చేతన్ సింగ్ జోరా మజ్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను” అని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార ఆమ్ ఆద్మీ పార్టీ తన మొదటి అభ్యర్థుల జాబితాను (40 మందితో) ప్రకటించిన మరుసటి రోజే ఈ రాజీనామాలు చోటుచేసుకోవడం గమనార్హం. 
 
ఈ జాబితాలో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న 40 మందికి పార్టీ మళ్లీ అవకాశం కల్పించింది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించిన మొదటి ప్రధాన రాజకీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీయే కావడం విశేషం. పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం అనంతరం, ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఢిల్లీలో ఈ మొదటి అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. 
వరదల నిర్వహణ, తనపై నమోదైన క్రిమినల్ కేసులు సహా పలు అంశాలపై పఠాన్‌మజ్రాకు పార్టీ నాయకత్వంతో సుదీర్ఘకాలంగా విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు జౌరామజ్రా రాజీనామా చేయడంతో, పార్టీలో పెరుగుతున్న అసంతృప్తిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పంజాబ్ మాజీ మంత్రి అయిన జౌరామజ్రా, అసెంబ్లీలో సమానా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 
 
ఈ ఏడాది మే నెలలో శిరోమణి అకాలీ దళ్ మాజీ నాయకుడు సుర్జిత్ సింగ్ రాఖ్రా ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆ తర్వాత ఆయనకు సమానాలో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించే కీలక బాధ్యతను అప్పగించారు. ఈ పరిణామం, స్థానిక ఎమ్మెల్యేను పక్కనపెట్టే ప్రయత్నంగానే విస్తృతంగా కనిపిస్తుంది. తాజాగా ఈ ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామాలు ఆప్‌లో పెరుగుతున్న అసంతృప్తికి నిదర్శనంగా కనిపిస్తున్నది.

About The Author