“అడ్డంకులు సృష్టించే శక్తి”గా మారిపోయిన ప్రతిపక్షం

ప్రతిపక్షం దేశాన్ని విభజించే లక్ష్యంతో ఒక “అడ్డంకులు సృష్టించే శక్తి”గా మారిపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. “ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించడం, సవాలు చేయడం ప్రతిపక్షం బాధ్యత, కానీ అడ్డంకులు సృష్టించడం కాదు. దురదృష్టవశాత్తూ, ప్రతిపక్షం ఇప్పుడు ఒక ‘అవరోధ పక్షం’గా (అడ్డంకులు సృష్టించే శక్తిగా) తయారైంది” అని  గుజరాత్‌లో జరిగిన ‘ఏకతా దినోత్సవం’ కార్యక్రమంలో హితవు చెప్పారు. 
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా భారతదేశం జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ ఏక్తా దివస్ పరేడ్‌ను వీక్షించి, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద పటేల్‌కు పుష్పాంజలి ఘటించి, సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ వేడుకల్లో భాగంగా, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఆధ్వర్యంలో ‘నక్సల్ ముక్త్ భారత్’ అనే ప్రత్యేక నాటక ప్రదర్శన కూడా జరిగింది. వామపక్ష తీవ్రవాదం వల్ల ప్రభావితమైన 126 జిల్లాల నుండి సుమారు 2,000 మంది కళాకారులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.
 
“నిరాశ, నిస్పృహలతో ఉన్న వీరు దేశ అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. ఇదే వారి ప్రధాన రాజకీయ ఎజెండాగా మారింది. రాజ్యాంగం కల్పించిన గౌరవాన్ని, పరిమితులను కాలరాస్తున్నారు. దేశాన్ని విభజించేందుకు వీరు నిరంతరం కుట్రలు చేస్తున్నారు. ‘భారతమాత’ బిడ్డల మధ్య చిచ్చుపెట్టేందుకు, విభజన సృష్టించేందుకు దుర్మార్గమైన పథకాలు రచిస్తున్నారు. గత దశాబ్ద కాలంగా పేరుకుపోయిన నిరాశ, అసహనంతో వీరు ఇప్పుడు బహిరంగంగానే బయటపడ్డారు” అని ప్రధాని పేర్కొన్నారు. 
 
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలను ఉద్దేశించి కూడా ప్రధాని మోదీ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. “విదేశాల్లో వీరు రహస్యంగా ఎవరిని కలుస్తున్నారు? భారత్‌కు వ్యతిరేక శక్తులు ఎవరికి మద్దతు ఇస్తున్నాయి? మన శత్రువుల భాషలో ఎవరు మాట్లాడుతున్నారు? ఇలాంటి పరిణామాలను మనం గుర్తించాలి. వీటన్నింటినీ మనం ఐక్యంగా ఎదుర్కోవాలి” అని ఆయన పిలుపిచ్చారు. 
 
సోషల్ మీడియాను అబద్ధపు ప్రచారాలకు, పుకార్లను వ్యాప్తి చేయడానికి ఒక సాధనంగా వాడుకుంటున్నారని ప్రధాని ఆరోపించారు. “సోషల్ మీడియాను ఒక ఆయుధంగా మార్చి, తప్పుడు ప్రచారాలు చేస్తూ, భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోంది” అని ఆయన పేర్కొన్నారు. భారతదేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఎండగడుతూ, దీనిపై దేశమంతా ఏకతాటిపై నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
“స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ భారతదేశంలో పేదరిక నిర్మూలన గురించి మాట్లాడుతున్నారు. పేదరికాన్ని తొలగిస్తామని చెప్పి ఓట్లు అడిగారు. కానీ దేశంలో పేదరికం ఏ స్థితిలో ఉందో మనందరికీ తెలుసు. ‘గరీబీ హటావో’ (పేదరిక నిర్మూలన) అని నినాదాలు చేసిన వారే కాలక్రమేణా మరింత ధనవంతులుగా మారారు” అని ఆయన విమర్శించారు. 
 
ప్రపంచ బ్యాంక్ నివేదికను ఉటంకిస్తూ, గత 10-12 ఏళ్లలో 50 కోట్ల మంది భారతీయులు తీవ్ర పేదరికం నుంచి బయటపడ్డారని ప్రధాని మోదీ తెలిపారు. పేదరికాన్ని తగ్గించడంలో సహాయపడిన చర్యలుగా ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ, ఆరోగ్య సంరక్షణ, శాశ్వత గృహాలు, మరుగుదొడ్ల నిర్మాణం, స్వచ్ఛమైన వంట ఇంధనం అందుబాటు, భీమా వంటివాటిని కూడా ఆయన పేర్కొన్నారు.
 
“ఈ కార్యక్రమాలు కుటుంబాలకు డబ్బు ఆదా చేయడంలో సహాయపడటంతో పాటు, కష్ట సమయాల్లో అండగా నిలిచాయి,” అని ఆయన పేర్కొన్నారు. దేశం నక్సలిజాన్ని నిర్మూలించిందని కూడా ఆయన చెప్పారు. “దేశం నక్సలిజం, మావోయిజం నుంచి విముక్తి పొందే వరకు విశ్రమించబోమని గతేడాది చెప్పాను. ఆ వాగ్దానం నెరవేరింది. మనం నక్సల్స్‌ను అంతం చేసినప్పటికీ, ‘దిమాగీ నక్సల్స్’ ముప్పు ఇంకా చాలా ఎక్కువగా ఉంది,” అని మోదీ హెచ్చరించారు.

About The Author