జాతీయ అంశాలపై చర్చించేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సిద్ధంగా ఉందని, అయితే ప్రజా నిరసనల్లోకి దేశ వ్యతిరేక శక్తులు చొరబడి వాటిని దుర్వినియోగం చేయకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంఘ్ సీనియర్ నాయకుడొకరు హెచ్చరించారు. జాతీయవాదం, హిందుత్వ, ఇతర అంశాలపై తమ సంస్థకున్న దృక్పథాల గురించి చర్చించేందుకు ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్, ఇతర బాధ్యులు సిద్ధంగా ఉన్నారని అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ స్పష్టం చేశారు.
ఇలాంటి చర్చలు గత వంద ఏళ్లుగా జరుగుతూనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. నవంబర్ 2న ఇండోర్‌లో ప్రారంభం కానున్న ఆర్ఎస్ఎస్ అఖిల భారత కార్యకారి మండలి సమావేశాలకు ముందు అంబేకర్ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇటీవల యువత (జెన్ జెడ్) చేపట్టిన నిరసనల నేపథ్యంలో, యువతను చేరుకోవడంలో ఆర్ఎస్ఎస్ ఆలస్యం చేసిందా? అని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, దేశానికి సంబంధించిన అంశాలపై ప్రశ్నలు లేవనెత్తేవారిని ఆర్ఎస్ఎస్ సమర్థిస్తుందని లేదా వ్యతిరేకిస్తుందని భావించడం సరికాదని అంబేకర్ చెప్పారు.
“దేశంలో ఎవరైనా ఏదైనా అంశంపై గళం ఎత్తితే, సంఘ్ దానికి అనుకూలంగానో లేదా వ్యతిరేకంగానో ఉందని ఎందుకు భావిస్తారు? అది తప్పుడు ఆలోచనా విధానం. దేశానికి సంబంధించిన అంశంపై ఎవరైనా ప్రశ్న లేవనెత్తితే, అది మంచిదే. అలా చేసే హక్కు వారికి ఉంది” అని ఆయన చెప్పారు. అయితే, నిరసనలు దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని, దేశ వ్యతిరేక శక్తులు వాటిని తమ స్వార్థానికి వాడుకోకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
“నాగ్‌పూర్‌లో జరిగిన విజయదశమి వేడుకల్లో సరసంఘచాలక్ (మోహన్ భాగవత్) పేర్కొన్నట్లుగా, దేశంలో జరిగే ఏ నిరసన అయినా దేశ ప్రయోజనాలను కాపాడేలా, దేశాన్ని ముందుకు తీసుకెళ్లేలా ఉండాలి. కాబట్టి, దేశ ప్రయోజనాలకు విరుద్ధమైన శక్తులు నిరసనల్లోకి చొరబడి వాటిని దుర్వినియోగం చేయకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలి” అని ఆయన హితవు చెప్పారు.
ఈ అంశంపై ఆర్ఎస్ఎస్ నిరంతరం దృష్టి సారిస్తోందని, పరిస్థితిని గమనిస్తూనే ఉంటుందని అంబేకర్ చెప్పారు. అలాగే, కొత్తగా వస్తున్న ప్రజా సమాచార వేదికలను లేదా సాంకేతికతను తమ సంస్థ వ్యతిరేకించడం లేదని, అయితే వాటిని బాధ్యతాయుతంగా ఉపయోగించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. “సంఘ్ ఏ మాధ్యమాన్ని గానీ, దానిలోని కొత్త సాంకేతికతను గానీ వ్యతిరేకించదు. అయితే, మానవులుగా మనం ఈ వేదికలను ఎలా ఉపయోగిస్తున్నామనే దానిపై తప్పక ఆలోచించాలి. ఈ అంశంపై సమాజంలో అవగాహన కల్పించేందుకు సంఘ్ తన కృషిని కొనసాగిస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.
ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో యువత భాగస్వామ్యం పెరుగుతోందని పేర్కొన్న అంబేకర్, గత ఏడాది సుమారు రెండు లక్షల మంది సంస్థ నిర్వహించిన ప్రాథమిక శిక్షణా శిబిరాలకు హాజరయ్యారని తెలిపారు. వివిధ కార్యక్రమాల ద్వారా యువతను సంఘ్ నిరంతరం భాగస్వాములను చేస్తోందని ఆయన చెప్పారు.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) తీసుకువచ్చిన వివాదాస్పద నిబంధనల గురించి మాట్లాడుతూ, ఈ సర్క్యులర్ ‘సమతుల్యంగా లేదని’ ఆర్ఎస్ఎస్ ఇప్పటికే అభిప్రాయపడిందని అంబేకర్ తెలిపారు. వ్యక్తం చేసిన ఆందోళనలను ప్రభుత్వం, యూజీసీ గమనించాయని పేర్కొంటూ కోర్టు ఈ నిబంధనలపై స్టే విధించిందని, ప్రస్తుతం ఈ వ్యవహారం న్యాయస్థానం పరిశీలనలో ఉందని ఆయన పేర్కొన్నారు.
“ఈ విషయంలో తదుపరి జరిగే పరిణామాలు సమతుల్యంగా ఉండాలి; ప్రభుత్వం దీనిని నిర్ధారించాలి” అని ఆయన చెప్పారు. ఒక సర్క్యులర్ సామాజిక సామరస్యానికి భంగం కలిగించకూడదని పేర్కొన్న అంబేకర్, సమాజం ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. జనవరి నెలలో కేంద్ర ప్రభుత్వం ‘యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (ఉన్నత విద్యా సంస్థలలో సమానత్వ ప్రోత్సాహం) నిబంధనలు, 2026’ను నోటిఫై చేసింది.
దీని ప్రకారం, అన్ని ఉన్నత విద్యా సంస్థలు వివక్షకు సంబంధించిన ఫిర్యాదులను పరిశీలించడానికి, సమానత్వాన్ని ప్రోత్సహించడానికి ‘ఈక్విటీ కమిటీలను’ (సమానత్వ కమిటీలు) ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ కమిటీలలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు, దివ్యాంగులు, మహిళలు సభ్యులుగా ఉండాలి.
దేశవ్యాప్తంగా లక్షకు పైగా శాఖలను నిర్వహిస్తున్న ఆర్ఎస్ఎస్, తనను తాను అధికారికంగా నమోదు చేసుకోవాలని ఆలోచిస్తోందా? అని అడగగా, ప్రస్తుతం అటువంటి ప్రతిపాదన ఏదీ లేదని అంబేకర్ స్పష్టం చేశారు. గత ఏడాది కాలంలో 13,000కు పైగా కొత్త శాఖలు ప్రారంభమయ్యాయని ఆయన తెలిపారు. నవంబర్ 2న ఇండోర్‌లో ప్రారంభం కానున్న ‘అఖిల భారత కార్యకారి మండలి’ సమావేశానికి, సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలేలతో సహా మొత్తం 408 మంది బాధ్యులు హాజరుకానున్నారని అంబేకర్ చెప్పారు.
మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో, సంస్థాగత నిర్మాణంలో ప్రతిపాదిత మార్పులతో సహా పలు అంశాలపై చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. ‘అఖిల భారత కార్యకారి మండలి’ అనేది ఆర్ఎస్ఎస్కు చెందిన ప్రధాన సంస్థాగత విభాగం. సంఘ్ కార్యకర్తల ప్రకారం, ఈ సమావేశంలో సంస్థ శత వార్షికోత్సవ కార్యక్రమాలను సమీక్షించడంతో పాటు, కొత్త ప్రసార మాధ్యమాల కోసం కంటెంట్, దేశంలో విదేశీ జోక్యం, ప్రపంచ పరిస్థితి, మాదకద్రవ్యాల దుర్వినియోగం వంటి అంశాలపై చర్చించనున్నారు.

More Stories
కామన్వెల్త్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో భారత జట్లు సత్తా
రాహుల్, ట్రంప్, నెతన్యాహు ‘ఓట్ల దొంగతనం’ అని ఆరోపించారు
ఒమర్ అబ్దుల్లాపై 24 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు