పెట్రోల్ పై సుంకం రద్దు.. డీజిల్ పై పెంపు

అంతర్జాతీయ ఆయిల్‌ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఇంధన ఎగుమతి విధానంలో మార్పులు చేసింది. పెట్రోల్‌ ఎగుమతులపై ఇప్పటి వరకు వసూలు చేస్తున్న ప్రత్యేక సుంకాన్ని పూర్తిగా తొలగించింది. మరోవైపు డీజిల్‌, విమాన ఇంధనం ఎగుమతులపై పన్నులను పెంచింది. శనివారం ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్లతో ఈ కొత్త రేట్లు వెలుగులోకి వచ్చాయి. 

కేంద్రం సవరించిన ఎగుమతి సుంకాల ప్రకారం పెట్రోల్‌పై లీటరుకు ఉన్న రూ.2.50 పన్నును పూర్తిగా ఎత్తివేసింది. డీజిల్‌ ఎగుమతులపై గతంలో రూ.8.50గా ఉన్న సుంకాన్ని రూ.11.50కి పెంచింది. అంటే లీటరుకు రూ.3 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ (ఏటీఎఫ్‌)పై సుంకాన్ని రూ.10.50 నుంచి రూ.11కు పెంచింది. దీనివల్ల లీటరుకు 50 పైసల భారం అదనంగా పడనుంది.

పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణ ప్రపంచ చమురు వ్యాపారాన్ని ప్రభావితం చేస్తోంది. ముడిచమురు సరఫరాలో అంతరాయాలు ఏర్పడటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మార్చి చివరిలో కేంద్రం ఇంధన ఎగుమతులపై ప్రత్యేక సుంకాలను అమల్లోకి తీసుకొచ్చింది. 

దేశంలో ఇంధన కొరత తలెత్తకుండా చూడటంతో పాటు, విదేశీ మార్కెట్లలో అధిక ధరలు లభిస్తున్నాయనే కారణంతో రిఫైనరీలు దేశీయ అవసరాలను పక్కనపెట్టకుండా నియంత్రించడం ఈ విధానం వెనుక ప్రధాన ఉద్దేశం. ప్రపంచ చమురు రవాణాలో హోర్ముజ్‌ జలసంధి అత్యంత కీలకమైన మార్గం. భారత్‌ దిగుమతి చేసుకునే ముడిచమురులో గతంలో సుమారు 45 శాతం ఈ మార్గం ద్వారానే వచ్చేది. 

పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల కారణంగా ఈ మార్గంలో నౌకాయానానికి ఆటంకాలు ఏర్పడటంతో చమురు సరఫరాపై ఒత్తిడి పెరిగింది. దీంతో భారత్‌ ఇతర మార్గాలు, దేశాల నుంచి ఆయిల్‌ తెచ్చుకునే ప్రయత్నాలను వేగవంతం చేసింది. ప్రపంచ మార్కెట్‌లో ముడిచమురు ధరలు, సరఫరా పరిస్థితులు నిరంతరం మారుతున్న నేపథ్యంలో కేంద్రం ఎగుమతి సుంకాలపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తోంది. అంతర్జాతీయ పరిణామాలను బట్టి తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.  

About The Author