రాజస్థాన్ విద్యార్థులకు రూ.100తో రూ.14 లక్షల ప్రమాద బీమా

విద్యార్థులకు కేవలం రూ.100 వార్షిక ప్రీమియంతో రూ.14 లక్షల వరకు ప్రమాద భీమా కవరేజీ అందించేందుకు  రాజస్థాన్‌ ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ పథకాన్ని విస్తరించాలని యోచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘సబ్కో బీమా అభియాన్‌-2047’లో భాగంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.

రాజస్థాన్‌ యూనివర్సిటీ ఇప్పటికే ఈ విషయంలో ముందడుగు వేసింది. యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థులకు ఏడాదికి కేవలం రూ.100 ప్రీమియంతో రూ.14 లక్షల వరకు ప్రమాద బీమా కవరేజీ కల్పిస్తోంది. గ్రూప్‌ పర్సనల్‌ యాక్సిడెంట్‌ (జీపీఏ) పాలసీ ద్వారా యూనివర్సిటీ, అనుబంధ కళాశాలలకు చెందిన 24,900 మంది విద్యార్థులకు ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇదే నమూనాను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ పథకాన్ని అమలు చేసేందుకు కళాశాల విద్యాశాఖ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలలకు ఆదేశాలు జారీ చేసింది. అడ్మిషన్‌ సమయంలోనే విద్యార్థుల నుంచి భీమా ప్రీమియం వసూలు చేసి, సంబంధిత బీమా కంపెనీలతో కళాశాలల ప్రిన్సిపాళ్లు సమన్వయం చేసుకోవచ్చని జిల్లా స్థాయి బీమా కమిటీ సభ్య కార్యదర్శి సరితా సైని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ జైపూర్‌లోని ఐదు విద్యాసంస్థలకు చెందిన 5,364 మంది విద్యార్థులకు ఇప్పటికే బీమా కవరేజీ కల్పించింది.

రాష్ట్రంలోని మరిన్ని కళాశాలలకు ఈ సదుపాయాన్ని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 2047 నాటికి దేశంలోని ప్రతి పౌరుడికి జీవిత, ఆరోగ్య, సాధారణ ఇన్సూరెన్స్ ల్లో ఏదో ఒక రూపంలో కవరేజీ కల్పించడమే ‘సబ్కో బీమా అభియాన్‌-2047’ ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా అల్వార్‌ జిల్లాలోని దేశాలూలా గ్రామంలో ప్రతి నివాసికి బీమా సౌకర్యం కల్పించినట్లు సరితా సైని వెల్లడించారు. 

ఇదే తరహాలో క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా ఇన్సూరెన్స్ కవరేజీని విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రచారంలో పలు ఇన్సూరెన్స్ సంస్థలు భాగస్వాములవుతున్నాయి. రాజస్థాన్‌లో యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌, బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ప్రధాన బీమా సంస్థలుగా వ్యవహరిస్తున్నాయి.

About The Author