పాకిస్తాన్‌లోనూ ‘రామాయణ’ క్రేజ్ ..కరాచీ వీధుల్లో ‘జై శ్రీరామ్’ నినాదాలు

నితేశ్‌ తివారీ తెరకెక్కిస్తున్న మోస్ట్ అంటెసిపేటెడ్ పాన్-ఇండియా మైథలాజికల్ మూవీ ‘రామాయణ’ క్రేజ్ కేవలం భారత్‌కే పరిమితం కాలేదు. సరిహద్దులు దాటి పాకిస్తాన్‌లోని కరాచీ నగరంలోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంపై తమ అభిమానాన్ని చాటుకుంటూ పాకిస్తాన్‌లోని హిందువులు సభ్యులు కరాచీలో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. 
 
మొదటి భాగాన్ని దీపావళి కానుకగా నవంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. భారతీయ ఇతిహాసం విడుదల సందర్భంగా కరాచీలో నివసిస్తున్న హిందువులు సంబరాలు చేసుకుంటున్నారు. ఫ్లెక్సీలు పట్టుకొని కరాచీ వీధుల్లో ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేస్తున్నారు. సినిమా మంచి విజయం సాధించాలని చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెబుతున్నారు.  కరాచీ నగరంలో ఉన్న హిందువులు ఒక్కచోట చేరి, చేతిలో ‘రామాయణ’ సినిమా పోస్టర్లు పట్టుకుని డప్పు చప్పుళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా “మేరే ఘర్ రామ్ ఆయే హై” అంటూ భక్తి పారవశ్యంతో భజనలు చేస్తూ వారు నృత్యాలు చేశారు. ఆ ప్రాంతం మొత్తం “జై శ్రీరామ్”, “సియావర్ రామచంద్ర కీ జై” అనే నినాదాలతో మార్మోగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. 

కరాచీలోని ఒక చారిత్రాత్మక శ్రీరామ మందిరానికి చేరుకున్న భక్తులు, ఆలయ ప్రాంగణంలో ‘రామాయణ’ సినిమా పోస్టర్‌ను ప్రతిష్టించి ప్రత్యేక ప్రార్థనలు జరిపించారు. ఈ చిత్రంలో శ్రీరాముడిగా నటిస్తున్న రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా నటిస్తున్న సాయి పల్లవిలపై తమకు ఉన్న ప్రత్యేక అభిమానాన్ని వారు వ్యక్తం చేశారు. ఈ భారీ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా అఖండ విజయం సాధించాలని, మన భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పడంతో పాటు ‘ఆస్కార్’ అవార్డును కూడా గెలుచుకోవాలని వారు హృదయపూర్వకంగా ఆకాంక్షించారు. 

ఈ అద్భుత దృశ్య కావ్యమైన ‘రామాయణ’ చిత్రాన్ని తమ దేశంలోని థియేటర్లలో కూడా విడుదల చేయాలని మేకర్స్‌ను అక్కడి హిందూ సోదరులు కోరారు. అయితే, పాకిస్తాన్‌లో భారతీయ సినిమాల ప్రదర్శనపై కఠిన నిబంధనలు ఉన్నందున, అక్కడ ఈ సినిమా విడుదల పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 

About The Author